గాడ్ ఫాదర్ స్ఫూర్తితో తీసిన సినిమాల్లో సర్కార్‌కి ప్రత్యేక స్థానం ఉంది. బాలీవుడ్లో అమితాబ్ రీ ఎంట్రీ తరవాత సాధించిన సూపర్ హిట్లలో సర్కార్ ఒకటి. అమితాబ్ క్యారెక్టరైజేషన్, సన్నివేశాల్లోని ఇంటెన్సిటీ, వర్మ టేకింగ్ ఇవన్నీ సర్కార్‌ని సూపర్ హిట్ చేశాయి. సర్కార్ 2కీ జనాదరణ బాగానే కనిపించింది. అయితే… సర్కార్ ఇచ్చిన ఇంపార్ట్ సర్కార్ 2 ఇవ్వలేకపోయిందన్నది నిజం. ఇప్పుడు సర్కార్ 3 వచ్చింది. రామూ ఫామ్‌లో లేకపోవడం వల్లో, లేదంటే ఈ తరహా కథలకు, సెట్యువేషన్స్కూ అలవాటు పడిపోవడం వల్లో… సర్కార్ 3 కొత్తగా ఏం కనిపించలేదు. దానికి తోడు… ఈ సినిమాపై జనాల ఫోకస్ కూడా బాగా తగ్గిపోయింది. థియేటర్‌కి వెళ్లి ఈ సినిమా చూడాలన్న కుతూహలం తన ట్రైలర్ల ద్వారా కల్పించలేకపోయాడు రాంగోపాల్ వర్మ. దాంతో.. సర్కార్ 3కి దారుణమైన ఓపెనింగ్స్వచ్చాయి.
అమితాబ్ ఇప్పటికీ బాలీవుడ్ లో సూపర్ స్టార్ హోదాని అనుభవిస్తున్నాడు. అయినా సరే.. ఈ సినిమాని ప్రేక్షకులు పట్టించుకోలేదు. అమితాబ్ కెరీర్లో ఎప్పుడూలేనంత దారుణమైన ఓపెనింగ్స్ చవిచూసింది సర్కార్ 3. ఇది వరకటి సర్కార్ సినిమాలతో పోలిస్తే… తీసిన విధానం, సన్నివేశాల జోడింపు సాధారణమైన స్థాయిలో ఉండడంతో ఈ సినిమా విమర్శకులకూ మింగుడు పడలేదు. సర్కార్‌ని ఓ బ్రాండ్‌గా ప్రమోట్ చేసిన వర్మ… ఇక సర్కార్ సిరీస్‌కి శుభం కార్డు వేయాల్సిన సమయం ఆసన్నమైందనిపిస్తోంది. ఒకవేళ పంతంకొద్దీ తీసినా.. జనం ఇంతకు మించి లైట్ తీసుకొనే ప్రమాదం ఉంది.