విజయ్ సినిమాకి తెలుగులో ఆరు కోట్ల రేటు రావడమే గొప్ప. `సర్కార్`తో ఆ ఫీట్ సాధ్యమైంది. మురుగదాస్ దర్శకుడు కావడం, కీర్తి సురేష్ లాంటి తెలుగు టచ్ ఉన్న అమ్మాయి కథానాయిక కావడం, ఈ దీపావళికి పెద్దగా తెలుగు సినిమాలేం లేకపోవడం బాగా కలిసొచ్చింది. అందుకే ఆరు కోట్లకు తెలుగు రైట్స్ అమ్ముడుపోయాయి. ఇక్కడ తెలుగులో కొన్న నిర్మాత కూడా.. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మంచి రేట్లకు ఈసినిమాని అమ్ముకున్నాడు. దాదాపుగా ఆయన గట్టెక్కేసినట్టే. కాకపోతే తెలుగులో సర్కార్ సినిమాకి ఏమాత్రం బజ్ లేదు. సాధారణంగా తెలుగులో శుక్రవారం సినిమా విడుదల అవుతుంటుంది. లేదంటే గురువారం. `సర్కార్` మాత్రం మంగళవారం విడుదల అవుతోంది. అలాంటప్పుడు `మంగళవారం మా సినిమా వస్తోందహో` అని గట్టిగా చెప్పుకోవాలి. విజయ్ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసేంత అభిమానులు తెలుగులో లేరు. కాబట్టి.. పబ్లిసిటీ ముఖ్యం. కానీ `సర్కార్` పబ్లిసిటీ లేమితో అల్లాడుతోంది.
రూ.6 కోట్లకు సినిమాని అమ్మేసిన తమిళ నిర్మాతలు కనీసం… సినిమాకి సంబంధించిన స్టిల్స్ కూడా తెలుగు నిర్మాతకు ఇవ్వడం లేదు. ఇక ప్రెస్ మీట్లకూ, ప్రమోషన్లకూ టైమ్ ఎక్కడి నుంచి ఇస్తారు? `తెలుగులో ప్రమోషన్లకు నేను రాను` అని విజయ్ గట్టిగానే చెప్పేశాడు. మురుగదాస్దీ అదే మాట. తెలుగులో తీసిన `స్పైడర్` హిట్టయి ఉంటే, మురుగదాస్ ఈసినిమా ప్రమోషన్లలో పాల్గొనేవాడేమో. ఆ సినిమా ఫ్లాప్‌తో టాలీవుడ్లో ప్రచారానికి ఆయన మొహం చాటేశాడు. దానికి తోడు `కాపీ కథ` అనే ముద్ర ఒకటి పడిపోయింది. దాంతో మురుగదాస్ కూడా తెలుగు ప్రచారానికి డుమ్మా కొట్టాడు. ఇంకొన్ని గంటల్లో `సర్కార్` విడుదలైపోతోంది. కానీ.. తెలుగులో ప్రమోషన్లు ఇంకా మొదలవ్వలేదు. అదీ… తెలుగు సర్కార్ దీన స్థితి. తెలుగులో తనకంటూ ఓ మార్కెట్ సృష్టించుకోలేక అల్లాడిపోతున్న విజయ్… అందుకోసం తన వంతు ప్రయత్నం చేయాలి కదా?? సూర్య, కార్తి, విక్రమ్, విశాల్.. ఆఖరికి కమల్ హాసన్ కూడా తెలుగులో తన సినిమాని డబ్బింగ్ రూపంలో విడుదల చేస్తున్నప్పుడు ప్రమోషన్లు జోరుగా చేసుకుంటారు. కానీ విజయ్‌కి మాత్రం ఆ స్పృహ లేకుండా పోయింది.