లిరికల్ వీడియోల గురించి ఇది వరకు పెద్దగా పట్టించుకునేవారు కాదు. నాలుగైదు ఫొటోలూ, పాటలోని సాహిత్యం… మేకింగ్ వీడియో, స్టిల్స్.. ఇవి కలగలిపి కొట్టేసేవారు. ఇప్పుడు అలా కాదు. అక్కడ కూడా తమదైన ముద్ర వేయాలని తాపత్రయ పడుతున్నారు. ఎంత ఖర్చుకైనా వెనుకంజ వేయకూడదని అనుకుంటున్నారు. `అల వైకుంఠపురములో` నుంచీ లిరికల్ వీడియోలకు బడ్జెట్ కేటాయించడం మొదలైంది. మ్యుజీషియన్స్నీ, సింగర్స్‌ని తీసుకొచ్చి.. లిరికల్ వీడియోలను ప్రత్యేకంగా షూట్ చేసి, దాన్నే ఓ పాట స్థాయిలో విడుదల చేస్తున్నారు. `భీమ్లా నాయక్`లోనూ ఇది కనిపించింది. తమన్ తన ట్యూన్స్పైనే కాదు.. వాటి ప్రజెంటేషన్‌పై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడని ఈమధ్య మరింత బలంగా అర్థం అవుతోంది.
తాజాగా `సర్కారు వారి పాట` నుంచి ఓ లిరికల్ వీడియో వచ్చింది. `కళావతి` అంటూ సాగే ఈ పాట కోసం సిద్ద్ శ్రీరామ్ తో పాటు, మ్యుజీషియన్స్ ని తీసుకొచ్చి ఓ వీడియో చేశారు. మహా అయితే తమన్ బృందం కనిపించేది రెండు నిమిషాలే. కాకపోతే.. ఈ పాటకు అక్షరాలా.. అరవై లక్షలు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. `సర్కారు వారి పాట`కు సంబంధించి విడుదలైన తొలి పాట ఇది. ప్రమోషన్ పరంగా.. ఈ మాత్రం ఖర్చు, జాగ్రత్తలు లేకపోతే… కష్టం అని నిర్మాతలు భావించారు. అందుకే ఒక్క రిలికల్ వీడియోకే అరవై లక్షలు ఖర్చు చేయగలిగారు. కాకపోతే… ఈ పాట ముందే లీక్ అయి బయటకు వచ్చేయడంతో.. ఆ రిస్కు, ఆ కష్టం.. వృథాగా మారింది. చిత్రబృందం తేరుకుని, అనుకున్న సమయానికంటే ముందే ఈ పాటని విడుదల చేసి నష్టనివారణ చర్యలు చేపట్టింది.