అమెరికాలో ప్రారంభం కావల్సిన `సర్కారు వారి పాట` వీసాలు రాని కారణంగా, ఆగిపోయింది. జనవరి తరవాత షూటింగ్ ఉండొచ్చని, అప్పటి వరకూ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే ఛాన్సు లేదని వార్తలొచ్చాయి. మహేష్ బాబు మనసు మార్చుకుని, త్రివిక్రమ్ సినిమా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, `సర్కారు వారి పాట` వెనక్కి వెళ్లే అవకాశం ఉందని గుసగుసలు వినిపించాయి. చిత్రసీమలో ఏదైనా సాధ్యమే కాబట్టి, పరశురామ్ సినిమా వాయిదా పడినా ఎవ్వరూ షాకైపోరు.
అయితే… మహేష్‌తో సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే ప్లాన్ బి కూడా సిద్ధం చేస్తున్నారు. అమెరికా షెడ్యూల్ కంటే ముందుగా.. ఇండియాలోనే కొంతమేర షూటింగ్ చేయాలని భావిస్తున్నారు. మహేష్ ఉన్నా లేకున్నా, షూటింగ్ కి వచ్చినా రాకున్నా, అడ్డు లేకుండా – మహేష్ లేని సన్నివేశాలతో షూటింగ్ మొదలెట్టాలన్నది ఆలోచన. ఈ ప్రతిపాదన ఇంకా మహేష్ వరకూ తీసుకెళ్లలేదు. ఇండియాలో షూటింగ్ కి మహేష్ ఓకే అంటే, మహేష్ ఉన్న సన్నివేశాలతోనే షూటింగ్ మొదలవుతుంది. ఒకవేళ మహేష్ స్వయంగా `ఇప్పట్లో షూటింగులు వద్దు` అంటే తప్ప – `సర్కారు వారి పాట`కు ఇబ్బంది ఉండదు. ఆ మాట మహేష్ నోటి నుంచి రాకూడదనే దర్శక నిర్మాతలు ఆశ పడుతున్నారు. షూటింగ్ మొదలైతే, ఇలాంటి రూమర్లు ఆగిపోతాయని, మహేష్ తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా చేయాల్సివస్తుందన్నది నిర్మాతల ప్లాన్. మరి ఇది వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.