పరశురామ్ అనగానే గీత గోవిందం గుర్తొస్తుంది. అదో క్లాస్ లవ్ స్టోరీ. అంతకు ముందు తాను ఎంచుకున్న కథలు కూడా క్లాసీవే. సోలో.. శ్రీరస్తు – శుభమస్తు.. ఇలా. సున్నితమైన భావోద్వేగాలూ, కుటుంబ బంధాలు, చక్కటి డైలాగ్స్.. ఇవీ పరశురామ్ బలం. అయితే సడన్ గా మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నాడు. ఈ పాట కూడా పరశురామ్ గత చిత్రాల్లానే క్లాసీగా ఉంటుందేమో అనుకుంటుంటే… మహేష్ కోసం మాసీగా తయారు చేసేస్తున్నాడట. ముఖ్యంగా ఈసినిమాలో ఫైట్ సీక్వెన్స్‌లపై పరశురామ్ దృష్టి పెట్టాడని, మాస్ ఎలిమెంట్స్ ని బాగా దట్టించాడని, మాస్ కోసమే కొన్ని సీన్లు రాసుకున్నాడని టాక్. ఇంట్రవెల్ బ్యాంగ్ అయితే.. తప్పకుండా ఓ కొత్త మహేష్‌నీ ఓ కొత్త పరశురామ్ నీ చూస్తారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
మరి.. ఇంత మాసీగా పరశురామ్ సినిమా తీయగలడా? తనకు అంత స్టామినా ఉందా? అనే అనుమానాలూ. మహేష్ ఫ్యాన్స్‌లో వ్యక్తం అవుతున్నాయి. కాకపోతే… రవితేజతో పరశురామ్ `ఆంజనేయులు` అనే సినిమా తీశాడు. యావరేజ్‌గా ఆడింది. అందులో రవితేజకు బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు మాస్ సీన్లు బాగానే రాసుకోగలిగాడు. కాబట్టి.. తనపై నమ్మకం ఉంచుకోవొచ్చు. `సర్కారు వారి పాట`తో తాను సూపర్స్టార్లనీ డీల్ చేయగలనని పరశురామ్ నిరూపించుకోగలిగితే…. తాను బిగ్ లీగ్ లోకి చేరిపోవడం ఖాయం.