ఏపీలో వైసీపీలో సర్పంచ్లు కూడా జగన్ ను శాపనార్ధాలు పెట్టడం చాలా రోజులుగా కనిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూ అదే పరిస్థితి వచ్చింది. కేంద్రం ఇచ్చిన పదిహేనో ఆర్థిక సంఘం నిధులను తెలంగాణ సర్కార్ వాడేసుకుందని ఆరోపిస్తూ.. సర్పంచ్లు రోడ్డెక్కారు. వైసీపీ సర్పంచ్లు రాజీనామాలు చేస్తున్నారు. పంచాయతీ నిధులు పంచాయతీలకు జమ చేయాలంటున్నారు. దీనపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలు కూడా చేస్తున్నారు.
పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తుంది. 15వ ఆర్థిక సంఘం తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కొద్ది రోజుల కిందట నిధులు విడుదల చేసింది. అన్ని పంచాయతీలకు కలిపి ఈ మొత్తం రూ. ఐదు వేల కోట్ల కన్నా ఎక్కువగానే ఉంటుంది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఈ డబ్బును డ్రా చేసి, ఆయా గ్రామ పంచాయతీల్లోని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించే అధికారం సర్పంచ్లకు మాత్రమే ఉంటుంది. కానీ డిజిటల్ కీ ఉపయోగించి ప్రభుత్వం మొత్తం మళ్లించుకుందని.. ఇప్పుడు పంచాయతీ నిధుల్లో పైసా కూడా లేవని సర్ంచ్లు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ పల్లెల్లో అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ లే ఉన్నప్పటికీ పంచాయతీ నిధులు వస్తే గ్రామాల్లో పనులు చేపట్టాలని.. లేదా ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు డ్రా చేసుకుందామని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వచ్చినవి వచ్చినట్లుగా మాయం కావడంతో వారు నిరాశ చెందుతున్నారు. రాజీనామాలు చేస్తామంటున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. నిధులు తిరిగి ఇవ్వకుంటే ప్రగతి భవన్ తలుపులు బద్దలు కొడతామని సర్పంచ్ల సంఘం హచ్చరికలు జారీ చేస్తోంది. అయితే కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను ఎక్కడా కూడా ప్రభుత్వ ఖాతాల్లోకి మళ్లించలేదని పంచాయతీలు చేసిన ఖర్చులకు బిల్లులను చెల్లించామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆ బిల్లులు పంచాయతీలే చెల్లించాలి కానీ.. ప్రభుత్వం తమ నిధులు వసూలు చేసి చెల్లించడమేమిటని..నమ్మశక్యంగా లేదని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ కు సర్పంచ్ల సెగ బాగానే తగిలే చాన్సులు కనిపిస్తున్నాయి.