ఓ సినిమాకి డివైడ్ టాక్ వస్తే.. ఇక అంతే సంగతులు అనుకొనేవారు. స్టార్ సినిమాకి డివైడ్ టాక్ రావడం పెద్ద మైనస్. వసూళ్లు అనూహ్యంగా పడిపోతాయి. కానీ సరైనోడికి సీన్ రివర్స్ అయ్యింది. టాక్ బాగోలేకున్నా, రివ్యూలు ఏకి పడేసినా… సరైనోడు ఆగలేదు. బాక్సాఫీసు దగ్గర దూసుకెళ్లిపోయాడు. ఇప్పుడు రూ.50 కోట్ల క్లబ్‌లోనూ చేరిపోయాడు. మంగళవారం రాత్రికి మొత్తమ్మీద ప్రపంచ వ్యాప్తంగా రూ.55 కోట్లు సాధించిందీ చిత్రం. ఒక్క నైజాంలోనే రూ.14 కోట్లు పిండేసింది. ఓవర్సీస్లో మాత్రం బన్నీ దూకుడు కాస్త తగ్గిందనే చెప్పాలి. అక్కడ ఈ చిత్రానికి రూ.4 కోట్లు మాత్రమే దక్కాయి.
రేసుగుర్రంతో బన్నీ తొలిసారి రూ.50 కోట్ల క్లబ్లో చేరింది. సన్నాఫ్ సత్యమూర్తి కాస్త దూరంలో ఆగిపోయింది. ఇప్పుడు సరైనోడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పదో రోజునే.. రూ.50 కోట్ల క్లబ్లో స్థానం సంపాదించుకొంది. కొన్ని చోట్ల బయ్యర్లు పూర్తిగా బయటపడిపోయారు. ఇంకొన్ని చోట్ల… స్వల్ప నష్టాల్ని చవి చూడాల్సివస్తోంది. అయినా ఫర్వాలేదు. నెగిటీవ్ టాక్‌లోనూ ఇన్ని భారీ వసూళ్లు సాధించడం గొప్పే.