ఏ హీరోని ఎలా చూపించాలో బోయపాటి శ్రీనుకి బాగా తెలుసు. వాళ్ల ప్లస్సులపై దృష్టి పెట్టి, వాటినే ఎలివేట్ చేస్తుంటాడు. దాంతో… బోయపాటి సినిమా అంటే అభిమానులకు పండగే. ఆ లెక్కన అల్లు అర్జున్‌కీ బోల్డన్ని ప్లస్సులున్నాయి. మంచి నటుడు, యాక్షన్ సీన్స్ బాగా చేస్తాడు, డాన్సర్, దానికంటే మంచి ఎంటటైనర్! ఇక ఈసారి బోయపాటి శ్రీను బ్లాక్ బ్లస్టర్ సినిమా తీయడం ఖాయం అనుకొనే సరైనోడు థియేటర్లలోకి అడుగుపెడుతున్నారంతా. మరి.. సరైనోడు వాళ్ల అంచనాలకు సరిపోయాడా, ప్లస్సులూ.. మైనస్సులూ ఏమైనా ఉన్నాయా? ఇంతకీ సరైనోడు.. బాక్సాఫీసుని అదరగొడతాడా?? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* కథ
వైరం ధనుష్ (ఆది పినిశెట్టి) ముఖ్యమంత్రి కొడుకు. చేతిలో అధికారం ఉంది కదా అని ఎన్ని దుర్మార్గాలైనా చేస్తుంటాడు. అతన్ని ఎదిరించడానికి.. ఏ ఒక్కరూ ముందుకు రారు. ధనుష్ ఆడగాలకు పర్ణశాల అనే ఓ గ్రామం బలైపోతుంటుంది. అక్కడి పంట పొలాల్ని బలవంతంగా లాక్కుని ఆయిల్ బిజినెస్ చేద్దామనుకొంటాడు ధనుష్. మరోవైపు.. గణ (అల్లుఅర్జున్) మిలటరీ నుంచి వచ్చేస్తాడు. దేశానికి తన అవసరం సరిహద్దుల్లో కంటే.. లోపలే ఎక్కువ ఉందన్నది తన నమ్మకం. బాబాయ్ (శ్రీకాంత్) ఓ లాయర్. తాను ఏ కేసూ గెలవలేడు.. కానీ కోర్టు బయట మాత్రం అన్ని కేసుల్నీ గణ సెటిల్ చేస్తుంటాడు. ఓసారి ఎమ్మెల్యే దివ్య (కేథరిన్)ని చూసి ఇష్టపడతాడు. ముందు.. దివ్య `నో` చెప్పినా. చివరికి గణ ధైర్యాన్ని చూసి ప్రేమిస్తుంది. ఓ కేసులో గణ, దివ్య.. ధనుష్‌కి ఎదురెళతారు. అక్కడి నుంచి గణకీ, ధనుష్‌కీ మధ్య వైరం మొదలవుతుంది. ఆ గొడవలు ఎంత వరకూ వెళ్లాయి? ధనుష్ అధికార మదాన్ని గణ ఎలా అణిచాడు? మధ్యలో మహాలక్ష్మి (రకుల్ ప్రీత్‌సింగ్ ) ఎవరు?? ఆమెకూ గణకూ ఉన్న సంబంధం ఏమిటి అన్నదే… సరైనోడు కథ.
* విశ్లేషణ
ముందే చెప్పినట్టు ఏ హీరో బలమేంటో.. బోయపాటికి బాగా తెలుసు. ఈసినిమా కూడా ఆ బలాబలాల్ని బేరీజు వేసుకొంటూనే నడిపించేశాడు. బన్నీ స్టైలీష్ స్టార్. కాబట్టి ప్రతీసీన్ స్టైలీష్‌గా తీశాడు. బన్నీ ఫైట్లు బాగా చేస్తాడు. కాబట్టి యాక్షన్ ఘట్టాల్ని ఓ రేంజులో తీశాడు. బన్నీ డాన్సులు బాగా చేస్తాడు. కాబట్టి తమన్ చేత మాస్ బీట్లు కొట్టించాడు. ఎమోషన్ బాగా పలికిస్తాడు.. అలాంటి ఒకట్రెండు సీన్లు రాసుకొన్నాడు. కథానాయకుడి ఇంట్రడక్షన్ ఫైట్, కోర్టులో సీన్, విశ్రాంతి ముందొచ్చే ఫైట్.. ఇవి మూడూ థియేటర్లో కాస్త కూర్చోబెట్టాయి. సెకండాఫ్ లో ఊహించని మలుపులేం ఉండవు. సగటు ప్రేక్షకుడి ఆలోచనకు తగ్గట్టుగానే సినిమా నడుస్తుంటుంది. కేథరిన్‌తో నడిపించిన సీన్లు.. బోర్ కొట్టిస్తాయి. బ్రహ్మానందం కామెడీ ఓకే అనిపించినా, విరగబడి నవ్వేంత సీన్ లేదు. బన్నీ బలాల్ని బాగా ఎలివేట్ చేసిన బోయపాటి… మిగిలిన సంగతి ఏమాత్రం పట్టించుకోలేదు.
ఓ రొటీన్ కథలో బన్నీ తాలుకూ స్టైల్‌నీ, బోయపాటి యాక్షన్నీ మిక్స్ చేశాడంతే. దర్శకుడు ఈ కథని తనకు ఎలా కావాలంటే అలా నడిపించేశాడు. ఎక్కడా లాజిక్ ఉండదు. ఎమ్మెల్యే వెంట హీరో ఎందుకు పడ్డాడో, తనని వదిలేసి.. మహాలక్ష్మిపై మళ్లీ ప్రేమ ఎందుకు పెంచుకొన్నాడో అర్థం కాదు. సీఎమ్నీ, అతని కొడుకునీ చంపేస్తే.. దాని ఇన్వెస్టిగేషన్ మరీ అంత చీప్‌గా ఉంటుందా? ఓ ఊరు మొత్తాన్ని ఆక్రమించుకొని అడ్డొచ్చినవాళ్లందరినీ చంపేస్తే ఆ సంగతి మీడియాకు ఎక్కదా?? ఇలా లాజిక్‌లు లేని విషయాలు బోలెడున్నాయి. అయితే… ఏ సీనుకి ఆ సీను విడివిడిగా చూస్తే మాత్రం… ‘బాగానే ఉంది కదా’ అనిపిస్తుంది. అదే బోయపాటి స్పెషాలిటీ. ఆర్ ఆర్తో, కెమెరా వర్క్‌తో స్టైలీష్ లుక్‌తో.. హడావుడి చేస్తాడు. అదే ఈ సినిమాలో ఇంకాస్త ఎక్కువగా కనిపించింది.
* నటీనటుల ప్రతిభ
అల్లు అర్జున్ ఒక్కడే ఈ సినిమాకి అత్యంత పెద్ద ప్లస్సు. తన యాక్షన్‌తో, తన ఈజ్‌తో.. గణ పాత్రలో చక్కగా ఇమిడిపోయాడు. ఈ సినిమా కోసం బన్నీ తన బాడీ పెంచాడు. అందుకే.. ఒక్క చేత్తో వందలమందిని చితగ్గొడుతున్నా నమ్మబుల్‌గా అనిపించింది. డాన్సులూ బాగానే చేశాడుగానీ… తన మార్క్ సిగ్నేచర్ స్టెప్పులు కనిపించలేదు. క్లైమాక్స్‌లో బాబాయ్ కోసం ఆరాట పడే సీన్లో.. చితగ్గొట్టేశాడు. రకుల్‌ది చిన్న పాత్రే. కానీ.. ప్రాధాన్యం ఉన్న పాత్ర. కేథరిన్ ఎక్కువ సేపు కనిపించినా.. పెద్దగా ఆకట్టుకోలేదు. ఎమ్మెల్యేలు మరీ అంత ఎక్స్పోజింగ్ చేయాలా అనిపించింది. ఆది విలన్ పాత్రకు ఓకే అయినా… బన్నీ ముందు తేలిపోయాడేమో అనిపిస్తుంది. బ్రహ్మానందం కాస్త బెటర్. తనవల్ల కాస్తో కూస్తో ఎంటర్టైనింగ్ దొరికింది.
* సాంకేతికంగా
గీతా ఆర్ట్స్ నుంచి ఓ సినిమా వచ్చిందంటే అది టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గానే ఉంటుంది. ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉంది. కెమెరా వర్క్ సూపర్బ్. తమన్ ఎప్పట్లా రొడ్డకొట్టుడు మ్యూజిక్ కొట్టాడు. ఆర్.ఆర్‌లో మాత్రం పనితనం కనిపించింది. ఎడిటింగ్ లోపాలున్నాయి. సీన్లు మధ్యలో లేపేశారేమో.. జంపింగ్‌లు కనిపించాయి. బోయపాటి మరోసారి మాస్‌ని నచ్చేలా ఓ సినిమా తీశాడు. అయితే ఈ సారి ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకి దూరంగా ఉంటారేమో అనిపిస్తోంది.
* ప్లస్ పాయింట్స్
అల్లు అర్జున్
యాక్షన్ సీన్స్
* మైనస్ పాయింట్స్
కథ
మితిమీరిన హింస
* చివరగా…
ఈ సినిమా మాస్‌కి బాగా నచ్చొచ్చు. ఎందుకంటే ఊరమాస్ డైలాగులున్నాయి. ఫైట్లు భయంకరంగా ఉన్నాయి. వాటిని చూస్తూ గడిపేద్దాం అనుకొన్నవాళ్లకు సరైనోడు మంచి ఆప్షనే. కానీ.. ఫైట్లంటే బోరు, యాక్షన్ సీన్లు చూడలేం.. అనుకొన్నవాళ్లకు మాత్రం సరైనోడుతో కాస్త ఇబ్బందే.
తెలుగు360.కామ్ రేటింగ్ 2.75/5