చింత చచ్చినా పులుపు చావలేదన్న సామెత కాంగ్రెసు పార్టీ విషయంలో నిజమౌతున్నట్లుగా కనిపిస్తోంది. అటు తెలంగాణలో కూడా ఆ పార్టీ పూర్తిస్థాయిలో పతనానికి చేరువ అయిపోతున్నప్పటికీ.. ఆ పార్టీలో ఉండే వర్గ విభేదాలు, ముఠా కక్షలు మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. అధిష్ఠానం నుంచి ఢిల్లీ పెద్దల కూటమి నుంచి ప్రతినిధిగా నగరానికి ఎవరు వచ్చినా సరే.. వారి ముందు తమ ముఠా తగాదాలను విపులంగా ప్రదర్శించడానికి స్థానిక నాయకులు ఉత్సాహపడేలా కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఓటమి తరువాత.. కొన్ని రాజీనామాలు అలకలు జరుగుతున్న సమయంలో.. డిగ్గీ రాజా సమీక్షకు వచ్చినప్పుడు.. మాజీకేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ.. రాష్ట్రంలోని కీలక నాయకులు నలుగురి పదవులకు చెక్ పెట్టే ప్రయత్నం చేయడం విశేషం. పార్టీలో పలచబడని ముఠాకక్షలకు ప్రతీకగా కనిపిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడిపోయిన తర్వాత.. రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ కూడా రాజీనామా చేశారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణకు సంబంధించినంత వరకు ఇప్పట్లో రాజకీయ వాతావరణం ఎలా ఉన్నదంటే.. ఏ పార్టీలో ఎవరు ఏ కారణాల మీద రాజీనామా చేసినా.. వారు తెరాసలోకి వెళ్లిపోతున్నారని జనం అనుమానించేలా ఉన్నది. కానీ కాంగ్రెసులో పరిస్థితి భిన్నంగా ఉంది. క్యామమల్లేష్ రాజీనామాను ఆమోదించరాదని.. రంగారెడ్డి జిల్లా డీసీసీ సారథ్యం మరోసారి ఆయనకు అప్పగించాలని.. ఒక ఓటమి వలన పదవినుంచి తప్పించడం తగదని ఒక వాదన వినిపిస్తోంది.
పార్టీ పరిశీలకుడు దిగ్విజయసింగ్.. గురువారం నగరానికి వచ్చినప్పుడు కేంద్రమాజీమంత్రి సర్వే సత్యనారాయణ ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. క్యామ మల్లేష్‌కు మళ్లీ పదవి ఇవ్వాలంటూ సర్వే పోరాడితే అది ఒక ఎత్తు. కానీ ఆ ముసుగులో ఆయన తెకాంగ్రెస్ అగ్రనాయకులందర్నీ టార్గెట్ చేస్తున్నారు. ఒక ఎన్నికలో ఓటమి గురించి మల్లేష్ తో రాజీనామా చేయించడం కరెక్టు కాదంటున్న సర్వే సత్యనారాయణ.. ఓటమికి సంబంధించి రాజీనామా చేయాల్సి వస్తే.. ముందుగా తమ పార్టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఫ్లోర్‌లీడర్లు జానారెడ్డి, షబ్బీర్ ఆలీలు ముందుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే.. వారే మా రాష్ట్ర పార్టీకి మూల స్తంభాలు.. ముందుగా నైతిక బాధ్యత వారు వహించాలి.. తర్వాత చిన్న వారితో రాజీనామాలు చేయించాలి..అ ంటూ సర్వే డిమాండ్ చేస్తున్నారు.
మొత్తానికి కాంగ్రెస్‌లో ఇప్పటికీ సజీవంగా పరిఢవిల్లుతున్న ముఠాకక్షలు భవిష్యత్తులో ఆపార్టీ మనుగడకు సంబంధించి కూడా స్పష్టమైన సంకేతాలే ఇస్తున్నాయి గానీ.. శవాసనం వేస్తున్న పార్టీలో పదవుల గురించి ఇంత రగడ ఎందుకు జరుగుతోందా? అని జనానికి ఆశ్చర్యం కలుగుతోంది.