మంత్రి హరీష్ రావు… తెరాసలో ఆయనకంటూ ఒక గుర్తింపు ఉంది. క్షేత్రస్థాయిలో పేరున్న నాయకుడు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ తరువాత నంబర్ టూ ఎవరనే చర్చ అడపాదడపా తెరమీదికి వస్తూనే ఉంటుంది. మంత్రి హరీష్ రావు.. సీఎం కుమారుడు కేటీఆర్… వీరిద్దరిలో ఎవరు అనే చర్చకు ఎప్పటికప్పుడు ఫుల్ స్టాప్ లు పడుతూ ఉంటాయి. అయితే, కేసీఆర్ తరువాత కేటీఆర్ అనే క్లారిటీ ఇప్పటికే వచ్చేసింది. గడచిన ఏడాది కాలంలో కేటీఆర్ అన్ని రకాలుగా ఫోకస్ అవుతూ వస్తున్నారు. పార్టీపై గ్రిప్ పెంచుకుంటూ, తన శాఖలను సమర్థంగా నిర్వహిస్తూ బాగానే పేరు తెచ్చుకుంటున్నాయి. దీంతో తెరాసలో కూడా ఈ చర్చకు దాదాపు ఫుల్ స్టాప్ పడింది. కానీ, ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ తెరమీదికి తెస్తోంది.
మంత్రి హరీష్ రావుని అందరూ కలిసి ఒంటరిని చేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ చేపట్టిన ఓ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో నియంత పాలన సాగుతోందని ఈ సందర్భంగా విమర్శించారు. ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితలు కలిసి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మాస్ లో మాంచి ఫాలోయింగ్ ఉన్న మంత్రి హరీష్ రావును వీరంతా ఒంటరిని చేసేశారనీ, లేదంటే ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయమని సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించడం విశేషం. 2019లో కాంగ్రెస్ సత్తా చాటుతుందనీ, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ రాబోయేది కాంగ్రెస్ సర్కారు మాత్రమే అని సర్వే వ్యాఖ్యానించారు.
విచిత్రం ఏంటంటే… మంత్రి హరీష్ రావును కాంగ్రెస్ పార్టీ వెనకేసుకుని మాట్లాడటం..! తెరాసను ఇరుకున పెట్టే బలమైన అంశాలేవీ కాంగ్రెస్ లేవనెత్తలేకపోతోందన్నది వాస్తవం. కేసీఆర్ పాలనపై పోరాటం మొదలుపెట్టినా.. ఆయన చాణక్యం ముందు కాంగ్రెస్ ఎత్తులేవీ నిలవలేకపోతున్నాయి. ఆ మధ్య, టీ కాంగ్రెస్ కాస్త వేడి పెంచిందనే వాతావరణం క్రియేట్ అయ్యేసరికి… బడుగు బలహీన వర్గాలకు రకరకాల వరాలను బడ్జెట్ ద్వారా కురిపించి, కాంగ్రెస్ విమర్శలకు చెక్ పెట్టేశారు కేసీఆర్.
దీంతో కాంగ్రెస్ శ్రేణులు సైలెంట్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీలో వీక్ పాయింట్ అయిన హరీష్ టాపిక్ ను తెరమీదికి తీసుకొచ్చారు. నిజానికి, కేటీఆర్ ను హైలైట్ చేసేందుకు మంత్రి హరీష్ ను కాస్త పక్కన పెట్టారనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కూడా కొంతమేరకు ఉంది. సో.. ఇప్పుడు అదే టాపిక్ ను మరోసారి తెరమీదికి తెచ్చి… రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని చెప్పాలి. ఏదేమైనా, మంత్రి హరీష్ రావును కాంగ్రెస్ పార్టీ వెనకేసుకుని రావడం చిత్రమే. మరి, దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి