వరంగల్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ తరపున మొదట సిరిసిల్ల రాజయ్యను అనుకొన్నా నిన్న రాత్రి ఆయన ఇంట్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆయన కోడలు సారిక, ఆమె ముగ్గురు చిన్నారి పిల్లలు అనుమానాస్పద స్థితిలో సజీవ దహనం అవడంతో ఆయన ఇక పోటీ చేసే పరిస్థితిలో లేరు. ఒకవేళ ఆయన అందుకు సిద్దపడినా కాంగ్రెస్ పార్టీ అంగీకరించి ఉండేదే కాదు. కనుక ఆయన స్థానంలో సర్వే సత్యనారాయణను బరిలోకి దింపుతోంది. ఈరోజు సాయంత్రం ఐదు గంటలతో నామినేషన్లు వేసేందుకు గడువు ముగుస్తుంది కనుక ఆయన మరికొద్ది సేపటిలో తన నామినేషన్ వేయబోతున్నారు.
ఈ ఉప ఎన్నికలలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని మొదటి నుంచి ధీమా వ్యక్తం చేస్తున్న తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజయ్య ఇంటిలో జరిగిన ఈ ఘోర దుర్ఘటన తమ విజయావకాశాలపై ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని అంగీకరించారు. అంటే రాజయ్యకి బదులుగా ఎన్నికలలో పోటీకి దిగుతున్న సర్వే సత్యనారాయణ నష్టపోయే అవకాశాలున్నాయని ముందే అంగీకరించినట్లు భావించవచ్చును. రాజయ్యను కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎంపిక చేసినప్పటికే కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. ఎందుకంటే తెరాస అభ్యర్ధిగా పోటీ చేస్తున్న దయాకర్ వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న గాలి వినోద్ కుమార్ ఇద్దరూ కూడా కాంగ్రెస్, ఎన్డీయే అభ్యర్ధులతో పోల్చితే యువకులే పైగా వరంగల్ నియోజక వర్గ ప్రజలకు చిరపరిచితులు. ఇప్పుడు రాజయ్య స్థానంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి సర్వే సత్యనారాయణకి వరంగల్ నియోజక వర్గంపై అంత పట్టు లేదు. పైగా రాజయ్య ఇంట్లో జరిగిన దుర్ఘటన ప్రభావం కూడా ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా చెపుతున్నారు. అంటే పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయని భావించవచ్చును. కనుక కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను కాపాడటం కోసమే బరిలోకి దిగుతున్న సర్వే సత్యనారాయణ ఈ ఎన్నికలలో బలవుతున్నరేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆఖరి నిమిషంలో జరిగిన ఈ పరిణామాల వలన అధికార తెరాస అభ్యర్ధికి అనుకూలంగా మారే అవకాశం కనబడుతోంది.