హైదరాబాద్: తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడూ ఉప్పు-నిప్పుగా ఉండే విషయం తెలిసిందే. అయితే ఆశ్చర్యకరంగా వరంగల్ ఉపఎన్నిక సందర్భంగా తెలుగుదేశం సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సర్వే సత్యనారాయణనుంచి వెనకేసుకొచ్చారు. రెడ్డి సామాజికవర్గాన్ని అణచివేసేందుకే రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. జైపాల్ రెడ్డి, జానారెడ్డిలను విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదని అన్నారు. కవితకు కేంద్ర మంత్రిపదవికోసం కేసీఆర్ వెంకయ్యనాయుడుతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. హరీష్‌రావును పక్కన పెటట్టం కాంగ్రెస్‌కే అనుకూలమని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాదిగ కాదని చెప్పటం మాదిగలను అవమానించటమేనని అన్నారు. కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదని మండిపడ్డారు. కేసీఆర్ కరపత్రంగా పనిచేస్తున్న నమస్తే తెలంగాణపై పరువునష్టం దావా వేస్తామని సర్వే చెప్పారు.
సర్వే సత్యనారాయణ కుమారుడు నవనీత్ హైదరాబాద్-వరంగల్ మార్గంలో రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం అవుషాపూర్ సర్వే నం.15లో 1.24 ఎకరాల స్థలాన్ని పట్టాదారులు, అధికారులు, రెవెన్యూ సిబ్బందితో చేతులు కలపటంద్వారా సొంతం చేసుకుని వందలమంది ప్లాట్ల యజమానుల నోట్లో మట్టికొట్టారని నమస్తే తెలంగాణ పత్రిక ఇవాళ మొదటి పేజిలో ఒక కథనాన్ని ఇచ్చింది. ఆ కథనంపైనే నమస్తే తెలంగాణ మీద పరువునష్టం దావా వేస్తానని సర్వే అంటున్నారు.