ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరు నెలల కాలానికి ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులు భర్తీ చేయాలని నిర్ణయించారు. మంత్రి వర్గంలో ముస్లింలకు, ఎస్టీలకు ప్రాతినిధ్యం లేదు. ఎస్టీ ఎమ్మెల్యే ఒక్కరే టీడీపీలో ఉన్నారు. ఆయనకు ఇవ్వడానికి సమీకరణాలు కుదరలేదు. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి మంత్రి పదవి ఇస్తారని తొలుత భావించినప్పటికీ వైసీపీ నుంచి వచ్చిన నేతలకు ఇక మంత్రి పదవులు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఈలోపే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యారు. ఆయన కుమారుడు, ఐఐటీ పూర్తి చేసిన శ్రావణ్ ప్రస్తుతం సివిల్స్ కు శిక్షణ తీసుకుంటున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకపోయినప్పటికీ శ్రావణ్ ఆరు నెలల్లో అటు ఎమ్మెల్సీ, లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. అవకాశం ఉంటే శ్రావణ్ కు ఎమ్మెల్సీ ఇవ్వడం, లేదా ఆరు నెలల్లో శాసనసభకు ఎన్నికలు జరుగుతుండటంతో శ్రావణ్ ను అరకు స్థానం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటికే శ్రావణ్ కు ఆదివారం మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, ప్రమాణ స్వీకారం చేసేందుకు రావాల్సిందిగా సమాచారం కూడా పంపారు.
మంత్రి వర్గంలో చంద్రబాబుతో పాటు ప్రస్తుతం 24మంది మంత్రులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శాసనసభ్యుల సంఖ్య ప్రకారం 26మంది మంత్రులుగా ఉండే అవకాశం ఉంటుంది. బీజేపీ మంత్రుల రాజీనామాతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దక్షిణ స్తా జిల్లాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు పైడికొండల మాణిక్యాలరావు , డాక్టర్ కామినేని శ్రీనివాస్ లు మంత్రి పదవుల్లో ఉన్నారు. ఈసారి చంద్రబాబు రాయలసీమ జిల్లాలకు ఓ పదవి ఇవ్వబోతున్నారు. మైనారిటీల నుంచి శాసనసభకు తెలుగుదేశం పార్టీ తరపున ఎవరూ ఎన్నిక కాలేదు. వైసీపీ నుంచి జలీల్ ఖాన్, చాంద్ బాషా టీడీపీలో చేరారు. ఒకరికి మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్ గా ఉన్న కర్నూలు జిల్లాకు చెందిన యన్.ఎండి ఫరూక్ ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయనకు సమాచారం పంపారు. రాయలసీమలో ముస్లింలు ఎక్కువుగా ఉండటంతో రాయలసీమకు చెందిన మైనార్టీని క్యాబినేట్ లోకి తీసుకుంటే మంచిదని పార్టీ నేతలు చంద్రబాబుకు సూచించారు.
యన్.ఎం.డి ఫరూక్ ని క్యాబినేట్ లోకి తీసుకుంటే కర్నూలు జిల్లా నుంచి మూడో మంత్రిగా ఆయన క్యాబినేట్ లో ప్రాతినిధ్యం వహిస్తారు. తొలుత పశ్చిమగోదావరిజిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ షరీఫ్ ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని భావించినప్పటికీ ప్రాంతాల వారీగా చూస్తే యన్.ఎం.డి ఫరూక్ రాయలసీమ జిల్లాలకు చెందిన వారు కావడంతో ఆయనకు ఈ సారి క్యాబినేట్ లో స్థానం ఇవ్వాలని నిర్ణయించారు. షరీఫ్ కు శాసనసమండలి ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో ముస్లీంలకు రెండు ఉన్నతస్థాయి పదవులు ఇచ్చినట్లవుతుందని చంద్రబాబు నిర్ణయానికి వచ్చారు