సాయి కుమార్ తనయుడిగా చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆది. ప్రేమకావాలి.. తో మంచి హిట్టే వచ్చింది. కానీ ఆ తరవాతే.. ఫ్లో సరిగా వెళ్లలేదు. ఈమధ్య ఆదికి కాస్త గ్యాప్ వచ్చింది. ఇప్పుడిప్పుడే.. జోరుగా సినిమాలు చేస్తున్నాడు. అందులో శశి ఒకటి. ఈ రోజు ఆది సాయికుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిరంజీవి చేతుల మీదుగా టీజర్ విడుదలైంది.
ఇదో కాలేజీ కథ. తనకు నచ్చినట్టు బతికే ఓ కుర్రాడి కథ. తన జీవితంలో ప్రేమ ఎంటర్ అయ్యాక.. ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో.. చెప్పే కథ. గడ్డంతో.. ఆది లుక్స్ రఫ్‌గా కనిపిస్తున్నాయి. తన క్యారెక్టరైజేషన్ , గెటప్ కాస్త `అర్జున్ రెడ్డి`ని పోలి ఉన్నాయని ఎవరైనా అనుకుంటే.. అందులో వాళ్ల తప్పులేం లేవు. సురభి కథానాయికగా నటిస్తోంది. `అమ్మాయి అందంగా ఉందని ప్రేమించి, సమస్యల్లో ఉందని వదిలేస్తే.. ఆ ప్రేమకు అర్థం లేదు` అనే డైలాగులు వినిపించాయి.. టీజర్లో. మరి ఆ సమస్యలేంటో, వాటిని ఓ ప్రేమికుడిగా ఆది ఎలా ఫేస్ చేశాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. లాక్ డౌన్ కి ముందే పూర్తయిన సినిమా ఇది. థియేటర్లు తెరచుకుంటున్నాయి కాబట్టి, సినిమా త్వరలోనే బయటకు వచ్చే ఛాన్సుంది.