అన్నాడీఎంకే అధినేతి, తమిళనాడు ముఖ్యమంత్రి, “అమ్మ’’ జయలలితకు తను ఒక గొప్ప అభిమానాని అని అయితే.. ఇప్పుడు తన ‘అమ్మ’’ తన ప్రాణాలను తీయాలని చూస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన “అమ్మ’’ పై అనుచితంగా మాట్లాడిన ఒక డీఎంకే ఎంపీపై తను భౌతిక దాడికే దిగాను అని, అతడి చెంప కూడా పగలగొట్టాను అని, ఈ విషయంలో తనను అమ్మ అభిమానిస్తుందని అనుకొంటే.. ఇప్పుడు తన ప్రాణాలకు జయలలిత నుంచి హాని నెలకొని ఉందని శశికళ అనే అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యురాలు రాజ్యసభలోనే ఆందోళన వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది.
తమిళనాట రాజకీయ నేతల అతి అంతా ఇంతా కాదని వేరే చెప్పనక్కర్లేదు. ఏ పార్టీలో ఉన్న వారు ఆ పార్టీ అధినాయకత్వాన్ని ఎంతగానో అభిమానిస్తుంది. ఈ అభిమానం పెడధోరణులకు దారి తీస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. చట్టసభలో జయలలిత చీర పట్టుకు లాగినా, ఆమె కు నటుడు శోభన్ బాబుతో అక్రమసంబంధం ఉందని వ్యాఖ్యానించినా, అలాగే అమ్మ అభిమానులు తమ వ్యతిరేకుల మీద దాడులకు దిగినా ఇలాంటి వాటన్నింటికీ కేంద్రం తమిళనాడే. ఇలాంటి నేపథ్యంలో శశికళ వ్యవహారం మరో అంకం.
తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని శశికళ రాజ్యసభలోనే ఏడ్చింది. ఆ ప్రమాదం అమ్మ నుంచే అని ఆమె అంటోంది. తను డీఎంకే ఎంపీపై దాడి చేసిన విషయాన్ని కూడా ఆమె చెప్పడం.. ఈ దాడిని జయలలితే ఖండించిందని చెప్పడం ద్వారా తన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైందని ఆమె చెప్పినట్టు అయ్యింది. జయలలిత పై అతి అభిమానం చూపిన ఆమెను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. ఆమె రాజ్యసభ సభ్యత్వానికి కూడా ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. ఏ అభిమానం అయినా.. హద్దుల్లో ఉంటే మంచిదనేందుకు ఈ వ్యవహారం ఒక రుజువు.