తమిళనాడులో అనుకున్నదే జరిగింది..! జయ అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసులో కీలక తీర్పును సర్వోన్నత న్యాయస్థానం వెలువరించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువడింది. జస్టిస్ పినాకినీ చంద్రగోష్, జస్టిస్ అవితా వరాయ్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును ఇచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎక్యూజ్డ్ -2 గా ఉన్న శశికళను దోషిగా నిర్దారిస్తూ నాలుగేళ్ల శిక్షను ధర్మాసనం ఖరారు చేసింది.
దీంతో తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలకు తెర లేచిందనే చెప్పాలి. ఈ తీర్పుతో శశికళ కలలు చెదిరాయని అనుకోవాలి. ఎందుకంటే, జయలలిత మరణం తరువాతి నుంచీ కూడా ఎంతో ప్రణాళికాబద్ధంగా సీఎం సీటుకు శశికళ దగ్గరౌతూ వచ్చారు. ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ కూడా అన్నాడీఎంకే శాసన సభ పక్షనేతగా ఎన్నికయ్యారు. పార్టీలో ప్రాధాన్యత పెంచుకున్నారు. పట్టు సాధించారు. మెజారిటీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోగలిగారు. చివరికి, పన్నీర్ సెల్వమ్‌తో రాజీనామా చేయించే పరిస్థితిని కూడా ఓ రకంగా ఆమె క్రియేట్ చేసుకుని, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు. ఇక, ప్రమాణ స్వీకారమే తరువాయి అనుకున్న తరుణంలో… కథ అడ్డం తిరిగింది.
కానీ, అనూహ్యంగా పన్నీర్ ఎదురు తిరగడం… మెజారిటీ ఉన్నా కూడా గవర్నర్ నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు ఆమెకు ఆహ్వానం రాకపోవడం.. ఆ తరువాత, ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు… వెరసి శశికళను ముఖ్యమంత్రి పీఠానికి దూరం చేశాయని చెప్పాలి. అయితే, దీంతో పన్నీర్ సెల్వానికి లైన్ క్లియర్ అయినట్టేనా.. కాదా అనేది వేచి చూడాల్సిన అంశం. శిక్ష పడినంత మాత్రాన శశికళకు మద్దతుగా ఉంటూ వస్తున్న ఎమ్మెల్యేలు మనసు మార్చుకుని పన్నీర్‌కు మద్దతు ఇస్తారా..? లేదా, శశికళ క్యాంపు నుంచి ఇంకేదైనా కొత్త నాయకత్వం బయటకి వస్తుందా…? శశికళ వారసులుగా తెరమీదకి ఎవరైనా వచ్చే అవకాశం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ తీర్పు తరువాత చిన్నమ్మ మద్దతుదారుల స్పందన ఏవిధంగా మారబోతోందనేది కూడా ఉత్కంఠ భరింతంగానే ఉంది. తాజా తీర్పు నేపథ్యంలో తెర వెనక ఉండి కథ నడిపిస్తున్న భాజపా ఎత్తుగడలు ఎలా ఉంటాయో కూడా వేచి చూడాల్సిన అంశమే. మొత్తానికి, తమిళ రాజకీయాలు మాంచి రసకందాయంలో పడ్డాయి.