ఇరవై ఏడో తేదీన చిన్నమ్మ విడుదలవుతుంది.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దున్ని పారేస్తుందని… తమిళ మీడియా జోరుగా విశ్లేషిస్తున్న సమయంలో అనూహ్యంగా శశికళ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు శ్వాస సమస్య ఏర్పడటంతో బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి.. కరోనా టెస్టులు నిర్వహిస్తే.. నెగెటివ్ వచ్చింది. కానీ.. పరిస్థితి మెరుగుపడకపోవడంతో కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు సీటీ స్కాన్‌లో కరోనా సోకినట్లుగా తేలింది. అయితే అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆమె ఉపిరి తిత్తులు దెబ్బతిన్నాయని డాక్టర్లు ప్రకటించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కూడా ప్రకటించారు.
శశికళ ఆరోగ్య పరిస్థితి ఒక్క సారిగా విషమంగా మారడం.. తమిళనాడులోనే కాదు… దేశవ్యాప్తంగా చర్చనీయాంసం అయింది. జయలలిత మృతి తర్వాత తమిళనాడుకు ఇక ఆమె జయలలిత అనుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ మొత్తం ఆమె వెనుకే ఉంది. అయితే.. బీజేపీ ప్రోత్సాహంతో మొదట పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో కూడా.. ఎమ్మెల్యేలంతా ఆమె వైపే ఉన్నారు. ఆ సమయంలో అనూహ్యంగా ఆమెపై ఉన్న అక్రమాస్తుల కేసుల్లో తీర్పు రావడంతో ప్రమాణస్వీకారానికి అంతా సిద్ధం చేసుకుని కూడా జైలుకు పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. అన్నాడీఎంకే కూడా ఆమెను దూరం పెట్టింది. శిక్షాకాలం పూర్తవుతున్న కారణంగా ఇరవై ఏడో తేదీన ఆమె విడుదలవుతారని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.
ఆస్పత్రిలో ఉన్నంత కాలం ఎప్పుడూ పెద్దగా అనారోగ్యానికి గురి కాని.. శశికళ … విడుదలవుతున్న సమయంలో ఆస్పత్రి పాలవడం ఆమె అభిమానుల్ని కలవరపాటుకు గురి చేస్తోంది. అదీ కూడా పరిస్థితి విషమంగా మారడం… ఇబ్బందికి గురి చేస్తోంది. ప్రస్తుతం బలమైన … జనాకర్షక నేతలు లేని తమిళనాడులో… స్టాలిన్‌కు ఆమె గట్టి పోటీ అవుతుందన్న ప్రచారమూ జరిగింది. అయితే.. ఇప్పుడు కోలుకున్నా.. ఆమె యాక్టివ్‌గా రాజకీయాల్లో పాల్గొనడం సాధ్యం కాదన్న చర్చ నడుస్తోంది. ముందుగా ఆమె సంపూర్ణ ఆరోగ్యంగా జైలు నుంచి విడుదలై రావాలని తమిళనాడులో ఆమె ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు.