అమ్మ పురట్చి తలైవి.. జయలలిత అంటే తమిళనాట రాజకీయాల్లో తిరుగులేని పేరు. తన అవినీతికి సంబంధించి ఆరోపణలు, కోర్టు కేసులు ఎన్ని ఉన్నప్పటికీ అన్నిటినీ బుల్డోజ్ చేసేసుకుంటూ.. తిరిగి అధికారపీఠాన్ని అధిష్టించి ఉన్న జయలలితకు ఆమె సహచరురాలు, అత్యంత ఆత్మీయురాలు అయినా శశికళ గురించి కూడా అందరికీ తెలుసు. తమిళనాట రాజకీయాల్లో పార్టీ వ్యవహారాల్లో జయలలితకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో… ఇంచుమించుగా అంతే రేంజిలో శశికళకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. తెలుగునాట రాజకీయాల్లో ఒప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి రాజ్యం సాగుతున్నప్పుడు.. ఆయన ‘ఆత్మ’గా ముద్రపడిన కేవీపీ రామచంద్రరావు.. ఎలా హవా నడిపించారో.. తమిళనాట ‘ఆత్మ’ అనే పేరు లేకపోయినప్పటికీ.. శశికళతో.. అమ్మ జయలలిత బంధం అంతకంటె గట్టిదే. అలాంటి అమ్మ పురట్చితలైవి ఆత్మ – శశికళ.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా అనే ప్రచారం బీభత్సంగా జరుగుతోంది.
తమిళనాడు రాజకీయాల్లో జయలలిత మీద ఎన్ని ఆరోపణలు ఉంటే.. దాదాపుగా అన్నింటిలోనూ ఆమె నెచ్చెలి శశికళకు కూడా భాగం ఉంటుంది. జయకు ఆమె ఎంత ‘క్లోజ్’ అనే సంగతిపై రకరకాల ప్రచారాలు ఉన్నాయి కూడా! అవన్నీ పక్కన పెడితే.. ఈ ఏడాదిలో జరగబోతున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల లో శశికళ కూడా ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఈసారి ఎన్నికలు తమిళనాడులో చాలా పోటాపోటీగా ఉంటాయనే అభిప్రాయం విశ్లేషకుల్లో ఉంది. గతంలో ఘంటాపథంగా గెలిచిన జయలలితకు ఈదఫా అంత బలమైన సానుకూల పవనాలు ఉండకపోవచ్చుననేది ఒక విశ్లేషణ. ప్రత్యర్థి డీఎంకే బలం కాకపోయినా.. ఆమె ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల దృష్టిలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో జయలలిత సొంత కుంటుంబంగా పరిగణించదగిన శశికళ కూడా ఎమ్మెల్యేగా బరిలోకి దిగడం ఆశ్చర్యకరమైన పరిణామమే.
వైఎస్ఆర్ హయాంలో రాష్ట్ర అధికారం మొత్తానికి కేవీపీ రామచంద్రరావు కేంద్రబిందువుగా ఉన్నప్పటికీ.. చాలాకాలం వరకూ ఆయనకు రాజకీయ ఆధికార పదవులు లేవు. రెండో విడతలో వైఎస్ఆర్.. రాజ్యసభసభ్యత్వం కట్టబెట్టారు. ఇప్పుడు జయలలిత తన నెచ్చెలిని కూడా ఎమ్మెల్యే చేయాలనుకుంటోది. జయ జైలుకు వెళ్లవలసి వచ్చిన వేర్వేరు సందర్బాల్లో పన్నీర్ సెల్వంను సీఎం చేసిన సంగతి అందరికీ తెలుసు. అయితే పన్నీర్ సెల్వం కూడా తలెగరేస్తున్నాడని ఆ మధ్య కొన్ని పుకార్లు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో.. తన రాజకీయ వారసురాలిగా శశికళను, ఆమె కుటుంబాన్ని ప్రొజెక్టు చేయడానికి ఈ ఎన్నికలనుంచి జయలలిత రంగం సిద్ధం చేస్తున్నారా? అనే ప్రచారం తమిళనాట ఎక్కువగా జరుగుతోంది.