శశికళ రాజకీయ జీవితం అర్ధంతరంగా ముగిసిపోయిందని చాలామంది మురిసిపోతున్నారు! జయలలిత అక్రమ ఆస్తుల కేసులో తీర్పు రావడంఓ ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కానీ, ఇది ముగింపు కాదు.. విరామం మాత్రమే అనేది శశికళ ప్రవర్తన చూస్తే ఎవరికైనా అర్థమౌతుంది. తన పోరాటం ఇక్కడితో ఆగేది కాదనీ, జైల్లోకి వెళ్లినంత మాత్రాన తాను ఓడినట్టు కాదన్న సంకేతాలు ఇచ్చారు. బెంగళూరు బయలుదేరే ముందు చెన్నైలోని అమ్మ సమాధికి చిన్నమ్మ వెళ్లారు. ఎంతో భావోద్వేగతంతో జయ సమాధికి నమస్కరించి.. మూడుసార్లు సమాధిపై గట్టిగా చరిచారు. దీనిపై ఎవరికి నచ్చిన విశ్లేషణలు వారు ఇచ్చుకుంటున్నారు. వ్యంగ్యంగా కామెంట్లు చేసేవారు కూడా ఉన్నారు.
అయితే, ఈ మూడు శపథాలు అనుకోవాలి! ఆమె ముందున్న మూడు లక్ష్యాలుగా భావించాలి. మొదటిది.. తాను జైల్లో ఉన్నాసరే అన్నాడీఎంకే పార్టీని రక్షించుకుంటానని చెప్పినట్టు భావించొచ్చు! రెండోది.. పన్నీర్ సెల్వమ్ అంతు చూస్తా అని అనుకోవచ్చు. ఎందుకంటే, ఢిల్లీ పెద్దలు ఆడించే గంగిరెద్దుగా ఆయన మారిపోయి, అన్నాడీఎంకే పార్టీని పణంగా పెట్టారన్నది చిన్నమ్మ కోపం. మూడోది.. కేంద్రంలోని భాజపా..! తాను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం ఇష్టం లేకపోవడమే ఇంతలా కక్ష సాధింపులకు భాజపా తెగబడిందన్న అభిప్రాయం ఆమెలో బలంగా ఉంది. ఈ మూడింటిపైనా ఆమెకు ఉక్రోషం ఉండటం సహజం. ఇవే విషయాలను ఆమె నేరుగా చెప్పే పరిస్థితి లేదు. ఆ ఉక్రోషాన్ని జయ సమాధి వద్ద ఇలా వెళ్లగక్కారు అనుకోవచ్చు. అయితే, శపథాలు చేసినంత మాత్రాన వాటిని సాధించుకోవడం సాధ్యమౌతుందా..? ప్రస్తుతం కేంద్రంలో భాజపా బలంగా ఉంది కదా! వారి అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉంటే ఏ స్థాయిలో రాజకీయ కక్షసాధింపులు ఉంటాయో అర్థమౌనే ఉన్నాయి కదా! ప్రాంతీయ పార్టీలను లొంగదీసుకోవాలన్న ఒక సుదీర్ఘ లక్ష్యంతో ముందుకు సాగుతోంది కదా!
అయితే, ఈ నేపథ్యంలో చిన్నమ్మ మూడు శపథాలు అలానే మిగిలిపోతాయి అని చెప్పలేం. ఎందుకంటే, రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో ఎవ్వరూ ఊహించలేరు. ప్రస్తుతం జైలుకి వెళ్లినంత మాత్రాన శశికళ పొలిటికల్ చాప్టర్ క్లోజ్ అని కూడా చెప్పలేం. చిన్నమ్మ జైలు జీవితం తమిళుల్లో సింపథీ పెంచే అవకాశం లేదనీ చెప్పలేం. మొత్తానికి, తీవ్రమైన లక్ష్యాలతోనే చిన్నమ్మ జైలుకు బయలుదేరారు. మరి, అవి నెరవేరుతాయో లేదో అనేది కాలమే చెబుతుంది.