తమిళనాడులో రాజకీయాలు మారుతున్నాయి. స్టాలిన్‌ను ఢీకొట్టే నేత లేకపోతే… అన్నాడీఎంకే మనుగడ కష్టం అన్న విశ్లేషణలు వస్తూండటం… పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇద్దరూ.. ఎవరికి వారే అన్నట్లుగా పోటీ పడుతున్నారు. దీంతో క్యాడర్ కూడా రెండుగా విడిపోయింది. ఈ సమయంలో అన్నాడీఎంకే విషయంలో మళ్లీ.. శశికళ తెర ముందుకు వస్తున్నట్లుగా కనిపిస్తోంది. గదత ఎన్నికలకు ముందు అనూహ్యంగా ఆమె.. ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటించారు. కానీ అదంతా బీజేపీ గేమ్‌ప్లాన్‌లో భాగం అని అనుకున్నారు.
అన్నాడీఎంకేతో కలిసి పొత్తు పెట్టుకుని బీజేపీ బరిలోకి దిగింది. ఓట్లు చీలిపోకుండా.. ఇబ్బంది కలగకుండా.. శశికళ.. రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లుగా ప్రకటించినట్లుగా భావిస్తున్నారు. ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీకి తాను తప్ప.. ఎవరూ పెద్ద దిక్కు లేరన్న భావనతో.. తెర ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ కూడా.. ఆమెకు ఫేవర్‌గా ఉన్నట్లుగా చెబుతున్నారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వం.. చాలా ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ.. మాస్ లీడర్లు కాలేకపోవడంతో… శశికళకు మార్గం సుగమం అయినట్లుగా చెబుతున్నారు.
త్వరలోనే ఆమె.. పూర్తి స్థాయిలో అన్నాడీఎంకే బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం.. ఈపీఎస్.. ఓపీఎస్లను.. శశికళ బాధ్యతల విషయంలో సముదాయించే ప్రయత్నం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. స్టాలిన్.. గత తమిళనాడు రాజకీయాలకు భిన్నంగా పాలన చేస్తున్నారు. కక్ష సాధింపులను దూరంగా పెట్టి.. అందర్నీ కలుపుకుని వెళ్లే రాజకీయం అమలు చేస్తున్నారు. దీంతో.. అన్నాడీఎంకే రాజకీయం సాఫ్ట్‌గా మారిపోయింది. శశికళ వస్తే తప్ప.. స్టాలిన్‌తో పోటీ పడే పరిస్థితి లేదని ఇప్పటికే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.