ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అని ప్రకటించిన జయలలిత నెచ్చెలి శశికళ మనసు మార్చుకున్నారు. అన్నాడీఎంకేలోకి బలవంతంగా అయినా ఎంట్రీ ఇచ్చేందుకు రూట్ రెడీ చేసుకున్నారు. నేనొస్తున్నా అంటూ కేడర్‌ను ఉద్దేశించి ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. అన్నాడీఎంకే అందరిదీ అని, ఇందులో అందరూ సమానమే అని వ్యాఖ్యానించారు. పార్టీకి నేతృత్వం వహించే వారు తల్లితో సమానం అని, కేడర్‌ను బిడ్డల వలే చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అన్నాడీఎంకే నాయకత్వ సంక్షోభంలోఉంది. పళని స్వామి, పన్నీర్ సెల్వం ఆధిపత్య పోరాటంతో క్యాడర్‌కు వారిపై నమ్మకం కలగడం లేదు.
కొద్ది రోజుల కిందట పన్నీర్ సెల్వం, పళనీ స్వామి మోడీ, అమిత్ షాలతోసమావేశం అయ్యారు. ఆ సందర్భంగా అన్నాడీఎంకేలోకి శశికళను తీసుకుని కీలక బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఆమె వస్తే తమ పరిస్థితి డమ్మీ అవుతుందని ఈపీఎస్, ఓపీఎస్ ఇద్దరూ అంగీకరించడం లేదు. శశికళ ప్రస్తుతం అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకునేందుకు పావులు కదపుతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ శశికళ పార్టీలోకి మళ్లీరాకుండా చేయాలని ఇద్దరు నేతలు పట్టుదలగా ఉన్నారు.
స్టాలిన్‌ను ఢీకొట్టే నేత లేకపోతే… అన్నాడీఎంకే మనుగడ కష్టం అన్న విశ్లేషణలు వస్తూండటం… పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇద్దరూ.. ఎవరికి వారే అన్నట్లుగా పోటీ పడుతున్నారు. దీంతో క్యాడర్ కూడా రెండుగా విడిపోయింది. ఈ సమయంలో అన్నాడీఎంకే విషయంలో మళ్లీ.. శశికళ తెర ముందుకు వస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీకి తాను తప్ప.. ఎవరూ పెద్ద దిక్కు లేరన్న భావనతో.. తెర ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ కూడా ఆమెకు మద్దతుగా ఉంటోంది. శశికళ అన్నాడీఎంకేలోకి వస్తే ఆమె వర్గానికి చెందిన ఐదు శాతం ఓటు బ్యాంక్ కలసి వస్తుందని.. స్థానిక సంస్థల ఎన్నికలు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని నచ్చ చెబుతున్నారు. దానికి తగ్గట్లుగానే శశికళ గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు. ఒకటి, రెండు నెలల్లో శశికళ చేతుల్లోకి అన్నాడీఎంకే వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు.