శశికళ అమ్మ జయలలిత సమాధి మీద శపథం చేశారు. జైల్లో ఓపిగ్గా శిక్ష అనుభవించారు. రిలీజై వచ్చిన తర్వాత రాజకీయాల్లో తేల్చుకుంటానన్నారు. అయితే హఠాత్తుగా రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటున్నానని ప్రకటించారు. ఇది సంచలనం అయింది.కానీ అసలు విషయం వేరే ఉందని అంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో అన్నాడీఎంకే వర్గం అయినా ఆ పార్టీతో ఉండాలంటే ఖచ్చితంగా గ్రూపులు లేవని నిరూపించాల్సిన పరిస్థితి. ఇప్పుడు శశికళ లీడ్లో ఉంటే.. ఆమె ఏం చెబితే అది క్యాడర్ చేస్తారు. కనీసం యాభై శాతం మంతి ఓటర్లు పక్క చూపులు చూస్తారు. ఈ పరిస్థితిని నివారించడానికి బీజేపీ హైకమాండ్ ఉభయతారకంగా శశికళ రిటైర్మెంట్ గేమ్ ఆడుతోందని చెబుతున్నారు.
శశికళ వర్గానికి టిక్కెట్లు ఇప్పించేందుకు పెద్ద ఎత్తున అన్నాడీఎంకేలో ప్రయత్నాలు జరిగాయి. బీజేపీ కూడా చెప్పింది. అయితే ఓపీఎస్, ఈపీఎస్ మాత్రం.. టిక్కెట్లు శశికళ వర్గానికి ఇచ్చేదిలేదన్నారు. కారణంగా గెలిచిన తర్వాత వారు అంతా శశికళకే సపోర్ట్ చేస్తారు. అందుకే… వారికి టిక్కెట్లు ఇచ్చేలాగా.. శశికళ రాజకీయాల నుంచి వైదొలిగేలా.. వ్యూహం రచించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు సఫలం కావడంతకో శశికళ నుంచిలేఖ విడుదలయింది. రాజకీయాలపై ఎంతో మక్కువ ఉన్న శశికళ.. ఖాళీగా ఉంటుందని ఎవరూ అనుకోవడం లేదు.
ప్రస్తుత ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయావకాశాలు అంతంత మాత్రమే. శశికళ లీడ్ తీసుకున్నా గెలిచే పరిస్థితిలేదు. రేపు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత క్యాడర్ ఎలాగూ ఆమె నాయకత్వం కావాలని ఉద్యమాలుచేస్తారని.. తప్పని సరిగా మళ్లీ శశికళకే అన్నాడీఎంకే బాధ్యతలు అప్పగించక తప్పదని అంటున్నారు. శశికళ కూడా ఈ వ్యూహంతోనే రిటైర్మెంట్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి శశికళ రాజకీయాల నుంచి వైదొలుగుతారని తమిళనాట కూడా అనుకోవడం లేదు. ఆమె రిటైర్డ్ హర్ట్ అయ్యారని.. రిటైర్మెంట్ కాదని.. అన్నాడీఎంకే ఆమె చేతికే వెళ్తుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.