‘జయలలిత అక్రమాస్తుల కేసులో తీర్పు వచ్చేసింది…’. ఒక వర్గం మీడియా అంతా కూడా కనీసం జయలిలత పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడడం లేదు. శశికళనే తప్పు చేసింది. శశికళనే జైలుకు వెళ్ళబోతోంది అనే అర్థం వచ్చేలా రాస్తున్నారు. ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే అమ్మ ఆత్మకు తానే ఆత్మబంధువుని అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్న పన్నీరు సెల్వం కూడా ఈ తీర్పు విని ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నాడన్న వార్తలు వినిపిస్తూ ఉండడం. తనను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసిన శశికళ శ్రీ కృష్ణ జన్మస్థానానికి వెళుతుండడం పట్ల పన్నీరు సెల్వం సంతోషపడుతూ ఉండొచ్చు కానీ భారతదేశంలో ఉన్న చాలా మంది నాయకుల్లాగే చనిపోయిన తర్వాత దోషిగా మిగిలిన నాయకుల లిస్టులోకి జయలలిత కూడా చేరిందన్న విషయం మాత్రం ఉద్ధేశ్యపూర్వకంగానే మర్చిపోతున్నట్టున్నాడు. పన్నీరు విషయం పక్కన పెడితే శశికళ జైలు పయనంతో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌కి వార్నింగ్ బెల్స్ మోగినట్టుగానే అని చాలా మంది బాష్యాలు చెప్పేస్తున్నారు. ఆల్రెడీ చంద్రబాబునాయుడితో సహా చాలా మంది టిడిపి నేతలు, టిడిపి అనుకూల మీడియా వారు వైసిపి వాళ్ళలో టెన్షన్ పెంచే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. నెక్ట్స్ వికెట్ జగనే అనే ప్రచారాన్ని షురూ చేశారు. మరి జగన్‌కి కూడా శశికళ గతే పడుతుందా?
ఆ ఛాన్సులు అయితే కచ్చితంగా ఉన్నాయి. కాకపోతే జగన్ జైలుకు పంపించడం వళ్ళ బిజెపి పార్టీకి ప్రయోజనం ఉండాలి. అలాంటి పరిస్థితి వస్తే మాత్రం కచ్చితంగా జగన్ కూడా జైలు బాట పట్టక తప్పదు. మరి వైఎస్ జగన్ ఆ పరిస్థితులు కొని తెచ్చుకుంటాడా? శశికళలా తొందరపడతాడా? తొడగొడతాడా? ఆ అవకాశం అస్సలు లేదు. 2014 ఎన్నికల సమయంలో కూడా ఫలితాలు వచ్చాక మోడీతో కలవడానికి సుముఖంగానే ఉన్నాడు జగన్. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకూ మోడీతో వైరం తెచ్చుకునే పనులు ఏవీ చేయలేదు. ప్రత్యేక హోదా కోసం అర వీర భయంకరంగా ఉద్యమం చేస్తున్నామని వైసిపివాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కానీ….అంతటి ఉద్యమ ఉద్రిక్తతల సమయంలో కూడా మోడీని మాత్రం పల్లెత్తు మాట కూడా అనకుండా గొప్ప సంయమనం పాటిస్తూ ఉంటారు. అలాగే చంద్రబాబుకు ఆత్మబంధువు అయిన వెంకయ్యనాయుడితో సహా ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకులు ఎవ్వరూ కూడా ఎప్పుడూ వైఎస్ జగన్‌పైన విమర్శలు చేయడం లేదు.
సో…ఆంధ్రప్రదేశ్ వరకూ చూసుకుంటే టిడిపి-బిజెపిల మధ్య బహిరంగంగా పొత్తు ఉంది. వైసిపి-బిజెపిల మధ్య రహస్య పొత్తు ఉంది అని అనుకోవాల్సి ఉంటుంది. సోనియాను ఎదిరించిన నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నాశనమయిపోవడానికి కారణమైన నాయకుడు అయిన జగన్ పట్ల మోడీతో సహా బిజెపి నేతలందరికీ కూడా సాఫ్ట్ కార్నరే ఉన్నట్టుగా కనిపిస్తోంది. వైఎస్ జగన్ కూడా మోడీతో సంబంధాలను ఇంకాస్త బలపరుచుకునే ప్రయత్నాలే చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు శశికళ పాఠం పుణ్యమాని మోడీకి బానిసలా ఉండడానికి కూడా జగన్ రెడీ అయిపోవచ్చు. మోడీ-జగన్‌ల మధ్య సంబంధాలు అలా ఉన్నంత కాలం వైఎస్ జగన్ కేసు సంవత్సరాల పాటు సాగుతూనే ఉంటుంది. తేడా వచ్చిన రోజు మాత్రం జగన్‌కి కూడా శశికళ పరిస్థితే వస్తుందనడంలో సందేహం లేదు. సో…..ప్రస్తుతానికి మోడీతో జగన్ సంబంధాలు సవ్యంగానే ఉన్నాయి కాబట్టి జగన్ ముఖ్యమంత్రి పదవి ఆశలు సజీవంగానే ఉన్నాయన్నమాట. వైసిపి వారు ధైర్యంగా ఉండొచ్చన్నమాట.