పన్నీర్ సెల్వమ్ మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోకూడదు… ఇది శశికళ పంతం! శశికళకు సీఎం కుర్చీ ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదు… ఇది ఎవరి పంతమో ప్రత్యకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆ పంతమే చట్టం పనిని వేగవంతం చేయించింది. అదే రాష్ట్ర గవర్నర్‌ను మందగమనంలో నడిపించింది. తమిళ రాజకీయాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు నాన్చుడు ధోరణితో వ్యవహరించేలా చేసింది. ఇన్ని జరిగాక… చివరికి ఎవరి పంతం ఇప్పుడు నెగ్గుతున్నట్టు..?
తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ పళనిస్వామికి గవర్నర్ విద్యాసాగరరావు ఆహ్వానం పంపించారు. నిజానికి, ఎమ్మెల్యేల సంఖ్యాబలం విషయంలో శశికళ వర్గం మొదట్నుంచీ స్పష్టంగా ఉన్నా, ఎలాంటి నిర్ణయమూ ప్రకటించకుండా తమిళనాడు రాజకీయాల్లో గత వారం రోజులుగా గవర్నర్ టెన్షన్ పెంచుతూ వచ్చారు. జయలలిత అక్రమ ఆస్తుల కేసులో శశికళ జైలు వెళ్లడంతో పరిస్థితి అంతా పన్నీర్‌కు అనుకూలంగా మారుతుందని ఆశించారు. కానీ, చిన్నమ్మ జైలుకు వెళ్తూ వెళ్తూ తన వారసుడిని నాయకుడిగా నిలబెట్టేసింది! పళని స్వామిని తన స్థానంలో ముఖ్యమంత్రి కుర్చీకి ప్రపోజ్ చేశారు. దాంతో 124 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా ఉన్నారనీ, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను పళని కోరారు. పన్నీర్ వర్గానికి అవకాశం ఇద్దామన్నా కూడా ఆ మ్యాజిక్ ఫిగర్ అక్కడ కరువైంది.
దీంతో తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా పళని స్వామి ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ చేయాల్సి వచ్చింది! అయితే, ఈ క్రమంలో ఎవరి పంతం నెగ్గినట్టు.? ఎట్టి పరిస్థితుల్లోనూ శశికళ సీఎం కాకూడదని కేంద్రంలో భాజపా పెద్దలు భావించినట్టు ప్రచారం జరిగింది. వారు ఆశించినట్టే చిన్నమ్మ జైలుకు వెళ్లారు. అయితే, అనూహ్యంగా అదే వర్గానికి అధికారం దక్కుతోంది. చిన్నమ్మ లేకపోతే ఆమె వర్గం చిన్నాభిన్నం అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ, అది జరిగేట్టు ప్రస్తుతానికి కనిపించడం లేదు. పళనిస్వామి సీఎం కాగానే.. మరో 15 రోజుల్లో అసెంబ్లీలో ఆయన బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పదిహేను రోజుల్లో భారీ నాటకీయ పరిణామాలు సాధ్యమా అంటే… కాదనే చెప్పాలి. ఎందుకంటే, గత వారం రోజులుగా పన్నీరుకు అవకాశం ఇచ్చినా, అనుకూలంగా గవర్నర్ వ్యవహరించినా కూడా ఆయనకు మద్దతు పెరగలేదు. పోనీ.. ఈ తరుణంలో మళ్లీ ఇలాంటి పన్నీర్ వర్గ అనుకూల చర్యలకు పాల్పడితే ఉన్న పరువు కాస్తా పోయే ప్రమాదం ఉందని పైనున్న పెద్దలకి తెలీదా..? శశికళను జైలుకు పంపడం ద్వారా వారి రాజకీయ కక్ష సాధింపులు ఈ రేంజిలో ఉంటాయా అనే ఓ నెగెటివ్ ఫీలింగ్ రాజకీయ వర్గాల్లో క్రియేట్ అయిన మాట వాస్తవమే. కాబట్టి, ఇప్పుడున్న పరిస్థితుల్లో పద్ధతి ప్రకారం నడుచుకోవడమే కిం కర్తవ్యం. మొత్తానికి, ఈ సీఎం సీటు కొట్లాటలలో అరటిపండుగా మిగిలిపోయేది మాత్రం పన్నీర్ సెల్వమ్ అనేది పలువురి అభిప్రాయం.