ఓటీటీలు వచ్చాక శాటిలైట్ మార్కెట్ పై ఫోకస్ తగ్గిన మాట వాస్తవం. విడుదలైన మూడు వారాల్లోనే సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంటోంది. దాంతో టీవీలో వచ్చినప్పుడు చూద్దాంలే అనుకొనేవాళ్లు తగ్గిపోయారు. థియేటర్లో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూసేస్తున్నారు. ఆ తరవాత టీవీల్లో సినిమా వస్తోంది. శాటిలైట్ క్రేజ్ తగ్గినప్పటికీ ఆ రూపంలో ఎంతో కొంత నికర ఆదాయం నిర్మాతలకు అందుతోంది. కాబట్టి… శాటిలైట్ ఎప్పటికైనా ఓ వరమే.
అయితే ఇప్పుడు శాటిలైట్ ఛానళ్లు తెలివి మీరాయి. ఓటీటీలో మూడు వారాలకే సినిమా వచ్చినప్పుడు శాటిలైట్ లో నెల రోజుల్లో సినిమా వేసే వెసులుబాటు కల్పించమన్నది వాళ్ల ప్రధాన డిమాండ్. నెల రోజుల్లో ఓటీటీలోకి వస్తే కనీసం ఆ తరవాతైనా శాటిలైట్ లో ప్రదర్శించుకొంటామన్నది వాళ్ల పట్టు. అంతే కాదు.. ఓ సినిమా కొనేముందు తప్పకుండా చూపించాల్సిందే. సినిమా మొత్తం చూశాకే కొనాలా, వద్దా? అనే నిర్ణయానికి వస్తారు. నచ్చితే కొంటారు, లేదంటే లేదు. ఇటీవల వచ్చిన ప్రతీ సినిమా (సంక్రాంతికి వస్తున్నాంతో సహా) చూసిన తరవాత కొన్నవే. పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా లేదు. అన్నింటికీ ఇదే రూల్. ఎంత పెద్ద హీరో అయినా ఇదే ఫార్ములా. శాటిలైట్‌కి సెన్సార్ వేరేలా ఉంటుంది. ఏ సర్టిఫికెట్ సినిమాలు అక్కడ చెల్లవు. కాబట్టి, శాటిలైట్ కు తగ్గట్టుగా సినిమాని రీ ఎడిట్ చేయాలి. ఇది కూడా ముందు నుంచీ ఉన్న రూలే. ఇప్పుడు ఇంకాస్త స్ట్రిక్ట్ చేశారు. ఇటీవల కొన్ని పెద్ద సినిమాల్ని సైతం శాటిలైట్ ఛానళ్లు లైట్ తీసుకొన్నాయి. దాంతో సినిమా విడుదలై, ఓటీటీలోకి వచ్చిన సినిమాలకు సైతం శాటిలైట్ అమ్ముడుపోని పరిస్థితి.
టీవీ ఛానళ్లు కొత్త సినిమాలపై కోట్లకు కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేవు. ధియేటర్లో చూసేసి, ఓటీటీలో ఉన్న సినిమా, టీవీల్లోకి వస్తే ఎవరికి ఇంట్రస్ట్ ఉంటుంది? పైగా ఇటీవల కొన్ని పెద్ద సినిమాలు సైతం టీవీల్లో సరైన టీఆర్పీ తెచ్చుకోలేకపోయాయి. ఇలాంటి దశలో సినిమాలపై భారీ పెట్టుబడి పెట్టడం అనవసరం అని ఛానళ్లు భావిస్తున్నాయి. ఇది నిజంగా నిర్మాతలకు ఎదురు దెబ్బే. ఇప్పటికే ఓటీటీ సంస్థలు, వాటి నియమావళి నిర్మాతలకు తలనొప్పి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు శాటిలైట్ ఛానళ్లు కూడా అదే పాట పాడుతున్నాయి. నిజంగా ఇది నిర్మాతకు క్లిష్ట తరుణమే.