‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో అల్లు అర్జున్ స్నేహితుడు కేశవ పాత్రలో ఆకట్టుకున్నాడు జగదీష్ ప్రతాప్ బండారి. పుష్ప రాజ్ కథని చెప్పే పెద్ద పాత్రే జగదీష్ కి దక్కింది. ఆ సినిమా జగదీష్ కి మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు జగదీష్ ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు అభినవ్ ‘సత్తిగాని రెండెకరాలు’ సినిమాని రూపొందిచాడు. పుష్ప తీసిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా నేరుగా ఆహా ఓటీటీలో విడుదలైయింది. మరి పుష్పతో తొలి బ్రేక్ అందుకున్న జగదీష్ కి ఈ చిత్రం నటుడిగా మరో మెట్టు ఎక్కించిందా? మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది ?
అది తెలంగాణలోని ఓ పల్లెటూరు. సత్తి(జగదీష్ బండారి) ఊర్లో అటో నడుపుతూ జీవితం గడుపుతుంటాడు. స్నేహితుడు అంజి( రాజ్ తీరన్ దాసు) తో కలసి చిన్నచిన్న దొంగతనాలు చేసే ఓ చెడ్డ అలవాటు కూడా వుంటుంది. సత్తికి ఓ బాబు, పాప. సడన్‌గా కూతురుకి అనారోగ్యం చేస్తుంది. వైద్యానికి పాతిక లక్షలు కావాలి. అప్పటికే సత్తి ఊరంతా అప్పులు చేసి పుట్టెడు దరిద్రంలో ఉంటాడు. సత్తికి వున్న ఏకైక ఆస్తి తాత ఇచ్చిన రెండెకరాలు భూమి. ఎట్టిపరిస్థితిలో ఆ భూమిని అమ్మవద్దని, అది తర్వాతి తరంకు ఇవ్వాలని చెబుతాడు సత్తితాత. ఆ సెంటిమెంట్‌తో ఎన్ని కష్టాలు వచ్చిన ఆ భూమిని అమ్మడానికి ఇష్టపడడు. అయితే ఆ భూమిని అమ్మాల్సిన అనివార్య పరిస్థితి వస్తుంది. గ్రామ సర్పంచ్ (మురళీధర్ గౌడ్) ఓ పార్టీని తీసుకొస్తాడు. ఇక భూమి అమ్మేద్దామనుకునే సమయంలో సత్తి జీవితంలో ఓ సంఘటన జరుగుతుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కారు ప్రమాదానికి గురౌతాడు. ఘటనా స్థలంలో సత్తికి కారులో ఓ సూట్ కేస్ దొరుకుతుంది. ఇంతకీ ఆ సూట్ కేస్ లో ఏముంది ? ఆ సూట్ కేస్ అంజి జీవితాన్ని ఎలా మార్చింది ? అనేది మిగతా కథ.
చిన్నప్పుడు రెండెకరాలు భూమి గురించి తాత సత్తికి చెప్పడంతో కథమొదలౌతుంది. తర్వాత సత్తి అతని కుటుంబం, పాపకి అనారోగ్యం, రెండెకరాల భూమి నేపధ్యం ఇవన్నీ కథలోకి మెల్లగా తీసుకెళ్తాయి. అయితే కార్ యాక్సిడెంట్ తర్వాత ఈ కథ డార్క్ క్రైమ్ కామెడీ వైపు మలుపు తీసుకుంటుంది. సత్తికి సూట్ కేస్ దొరకడం, దాన్ని అంజి దగ్గరికి తీసుకెళ్లడం, ఆ సూట్ కేస్ ని తెరచే ప్రయత్నాలు ఫర్వాలేదనిపించినప్పటికీ అవి అంత సహజంగా ఉండకపోవడం ఇందులో ప్రధాన సమస్య. ఎప్పుడైతే సూట్ కేస్ సత్తికి దొరికిందో ఆక్కడి నుంచి కథ వేగంగా పుంజుకోవాలి. కానీ దర్శకుడు సన్నివేశాలని చాలా నిదానంగా పేర్చుకుంటూ వెళ్ళాడు.
ఇలాంటి క్రైమ్ కామెడీలో కథనం పరుగుపెట్టాలి. కానీ ఇందులో అది లోపించింది. సూట్ కేస్ కోసం వచ్చిన రైడర్ (వెన్నెల కిషోర్) ఈ కథలో డార్క్ కామెడీ జనరేట్ చేయాలి. కానీ అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అదే విధంగా ఇందులో రియాజ్ పాత్ర కూడా కీలకం. అతడిని నుంచి కూడా సత్తి, అంజిలకు ముప్పు వుండేలా కథనం చేసివుంటే కథలో ఒక ఉత్కంఠ వచ్చేది. ఈ కథలో కొంత వరకూ ‘ఐ కేర్ ఎ లాట్’ అనే హాలీవుడ్ సినిమా పోలికలు కనిపిస్తాయి. అది యాదృచ్చికమో, కావాలని చేశారో.. చిత్ర బృందమే చెప్పాలి. ఆ సినిమాలో పీటర్ డింక్లేజ్ వేసిన రోమన్ పాత్రకి కాపీగా రియాజ్ పాత్రని డిజైన్ చేసినట్లు కనిపిస్తుంది. కానీ రియాజ్ లో ఆ ఇంటెన్సిటీ లేదు. దీంతో అదంతా పేలవమైన ట్రాక్ గా తేలిపోయింది.
మరోవైపు సత్తి, అంజి పాత్రలు కూడా కథకు దూరంగా వెళుతుంటాయి. అంజి ప్రేమకథతో చేకూరిన లాభం ఏమిటో అర్ధం కాదు. అంజి, అండమ్మా ల ఫ్యామిలీ సీన్లు మాత్రం చాలా సహజంగా తీశారు. అయితే రెండెకరాల కోసం సత్తి చేసే ప్రయత్నాలేవీ వుండవు. భూమిని కాపాడుకోవాలనే తాపత్రయం సత్తిలో బలంగా వున్నట్లు చూపించి, సూట్ కేసు డ్రామాని మరింత ఉత్కంఠగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడేమో అనిపిస్తుంది.
జగదీష్ నటన బావుంది. సత్తి పాత్రలో సహజంగా కుదురుకున్నాడు. భార్యని పుట్టింటికి వెళ్ళకుండా బ్రతిమాలే సన్నివేశంలో తన నటన ఇంకాస్త బావుంది. సినిమా అంతా చాలా యీజ్ తో కదిలాడు. రాజ్ తీరన్ దాసు నటన కూడా బావుంది. అయితే ఈ పాత్రని మరింత యాక్టివ్ చేయాల్సింది. వెన్నెల కిశోర్ కి చాలా నిడివి వున్న పాత్ర దక్కింది. తను మంచి కమెడియన్. అయితే వెన్నెల కిశోర్ బలం డైలాగ్. కానీ దర్శకుడు రాసుకున్న పాత్రకి మాత్రం బాడీ లాంగ్వేజ్ తోనే కామెడీ పండించే నటుడు కావాలి. వెన్నెల కిశోర్ తన శక్తిమేరకు ప్రత్నించాడు కానీ చాలా చోట్ల వర్క్ అవుట్ కాలేదు. సత్తి భార్యగా చేసిన మోహన శ్రీ, అంజి ప్రియురాలుగా కనిపించిన అనీషా దామా ఫర్వాలేదనిపిస్తారు. మురళిధర్ గౌడ్, బిత్తిరి సత్తి, రియాజ్ మిగతా నటులు పరిదిమేర కనిపించారు.
బడ్జెట్ పరిమితులు కనిపిస్తాయి. కెమెరాపనితనం, సంగీతం ఓకే. ఓటీటీ ముఖ్య ఉద్దేశం వెండితెరపై చెప్పలేని కథలు చూపించే అవకాశం ఇవ్వడం. సత్తిగాని రెండెకరాలు కథ విషయానికి వస్తే ఒరిజినాలిటీ లోపించింది. ఓ సామాన్యుడికి విలువైన వస్తువు దొరకడం, దాని విలువ తెలియని పాత్రలతో నడిపే డ్రామ.. ఐదివరకే చాలా సినిమాల్లో చూశాం. ఈ కథ కూడా ఆ వరుసలోనే చేరిపోతుంది తప్పితే, గుర్తుంచుకోవాల్సిన సినిమాగా మాత్రం అనిపించదు.