హాలీవుడ్ క్లాసిక్ ‘గాడ్ ఫాదర్’ స్ఫూర్తితో రామ్గోపాల్ వర్మ హిందీలో ‘సర్కార్’ తీశారు. అయితే.. ‘సర్కార్’లో అమితాబ్ బచ్చన్ పాత్రను మరాఠీ రాజకీయ పార్టీ ‘శివసేన’ వ్యవస్థాపకుడు బాల్ థాకరే తరహాలో తీర్చిదిద్దారు. నేటివిటీ టచ్ పర్ఫెక్ట్గా కుదరడంతో ‘సర్కార్’ సూపర్ హిట్ కొట్టింది. అందులో అమితాబ్ పాత్ర ప్రజలకు మేలు చేయడం కోసం ప్రభుత్వాలను, పోలీస్ వ్యవస్థను లెక్క చేయని విధంగా వుంటుంది. ‘నోటా’లో కట్టప్ప సత్యరాజ్ పాత్ర కూడా అదే విధంగా వుంటుందని దర్శకుడు ఆనంద్ శంకర్ చెప్తున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ అలియాస్ విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న సినిమా ‘నోటా’. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రాజకీయాల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ‘కట్టప్ప’గా పాపులర్ అయిన సత్యరాజ్ పాత్రకు చాలా ప్రాముఖ్యత వుందట. ‘సర్కార్’లో అమితాబ్ తరహాలో ఆయన పాత్ర శక్తిమంతంగా వుంటుందని దర్శకుడు ఆనంద్ శంకర్ స్పష్టం చేశాడు. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో నాజర్ కీలక పాత్ర చేస్తున్నారు.