(సెటైర్)
అబ్బాయ, నేనబ్బాయ, కాంతాన్ని. అదే, తూళ్లూరు సెంటర్ లో పుల్లట్లమ్మే పుల్లమ్మ గుర్తుందిగా… ఆ పుల్లమ్మ కూతుర్ని. మనమిద్దరం క్లాస్ మేట్సుంల్లే . మరచిపోయిఉంటావు. ప్రభుత్వ ఉద్యోగంలో నీకు క్షణం తీరక లేదంటగా…ఇక మమ్మల్నేడ పట్టించుకుంటావులే… అవును నీకీ విషయం గుర్తుందా.. చిన్నప్పుడు దెయ్యాలంటే నీకు భయం. రాత్రి ప్రైవేట్ క్లాసులయ్యాక నిన్న ఇంటికాడదాకా దిగబెట్టింది నేనేగా. ఇప్పుడు గుర్తొచ్చుంటుంది. హైదరాబాద్ లో గవర్నమెంట్ ఉద్యోగంలో సెటిలయ్యాక మేమెందుకు గుర్తుంటామూ… కానీ రోజులు మారాయికదా…నీవు పెట్టాబేడా సర్దుకుని రావాల్సిందేగదా అబ్బాయ. స్టేట్ డివైడయ్యాక ఏమాటకామట చెప్పుకోవాలి, ఇక్కడ బాగా డెవలప్ అవుతోంది. నువ్వేమో `హైదరాబాద్‌లా…హైదరాబాద్‌లా’ అంటూ జీడిపాకంలా అతుక్కుని అక్కడే ఉంటానంటున్నావటగా… పైగా గొంతెమ్మ కోర్కెలు కూడా కోరుతున్నావని ఇక్కడోళ్లు అంటున్నార్లే. అవున్లే, మనబాబుగారికి ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలి. జూన్ రెండోతేదీనాటికి మీరంతా ఈడకు వచ్చేయలంటగా. అయినా హైదరాబాద్ లో ఏముందీ..? గాలినీరు అన్నీ కలుషితమేనంటగా. ఇంటికాడ కూర్చున్నా భద్రత లేదాయె. మా చిన్నోడు చెప్పాడులే. అవును నీకెంతమంది పిల్లలు ? స్కూల్లో చదివేరోజుల్లో నువ్వంటే నాకు పిచ్చి ఇదిలె. నువ్వు మాత్రం తక్కువా… కళ్లలో కళ్లుపెట్టి చూసేవాడి కదూ. మన గురించి రాములోరి గుడికాడ పోరంబోకోళ్లు చాలా కబుర్లు చెప్పుకునేవారంటగా. నాకు అప్పట్లో తెలిసిచావలా. సరే, కాలేజీ చదువులకని నీవేమో హైదరాబాద్ మకాం మార్చావుగా. అప్పటి నుంచి మళ్ళీ మనూరు రావడమే నీకు కష్టమైంది. మొన్నీమధ్య నీ ఫ్రెండ్ – అదే స్కూల్ మేట్ శీనుగాడు నా కొట్లొ చాలాసేపు కూర్చుని నాలుగైదు పుల్లట్లు లాగించాడు. అప్పుడు చెప్పాడు, `మా హైదరాబాద్, మా హైదరాబాద్ ‘ అంటూ తెగకలవరిస్తున్నావంటగా. ఎలాగైనా అమరావతికి రాకుండా తప్పించుకోవాలనుకుంటున్నావటగా. నీకదేం బుద్ది అబ్బాయ. నిక్షేపంగా సొంతూరొస్తే ఎంత బాగుటుంది. మన బాబుగారు మనూరినేకాదబ్బాయ, చుట్టపక్కలూర్లను స్వర్గసీమగా మారుస్తారు. ఆఁ ఏంచెబుతున్నాను… అదే నీ స్కూల్ మేట్ శీనుగాడి గురించి కదా… వాడు చెప్పాడు. నీ కలవరింతల గురించి. అదేం పాడుబుద్ది. పైగా `ఇంకా ఇప్పటికీ మనూర్లో పందులు తిరుగుతూనే ఉన్నాయా? దోమలు కుడుతూనే ఉన్నాయా..? ‘ అంటూ అసహ్యంగా అడిగావటగా. నీదిమ్మడపోను. అదేం మాటలబ్బాయ. నీమీదున్న గౌరవం పోతోంది. నీలాంటివాళ్లంతా ఆడజేరితే ఈడ ఎలా డెవలప్ అవుతుంది చెప్పు. నువ్వు రావడం లేటైతే చాలా మిస్సైపోతావబ్బాయ.
మీ అమ్మ ఆరోగ్యం క్షీణించింది. నువ్వేమో నీ పెళ్ళాంబిడ్డలతో హైదరాబాద్ లో సెటిలైతివి. అమ్మేమో ఇక్కడ నులకమంచంమీదనే నువ్వొస్తావన్న ఆశతో బతుకు ఈడుస్తోంది. ఆమెను చూస్తే నాకు ఏడుపొచ్చింది అబ్బాయ. చిన్నప్పుడు నీమీద మనసుపారేసుకున్నా తర్వాత నీకు పెళ్ళయిందని తెలిసి నేనూ చేసుకున్నాన్లే. వాడూ మన క్లాస్ మేటే. తూర్పున శివాలయం వెనుక నాలుగెకరాల తోట వాడిదే. కనకారావు నన్ను చేసుకున్నాక అది కూడా నాదైంది. అబ్బాయ, నీకోసంగతి చెప్పాలి. ఇప్పుడు ఆ నాలుగెకరాలు అమరావతి రాజధాని కోసం ఇచ్చేశాం. వచ్చిన డబ్బులతో పుల్లట్ల కొట్టుని ఫైవ్ స్టార్ హోటల్ గా మార్చేస్తున్నాం. మొన్నీమధ్యనే జపాన్ వాళ్లొచ్చి అదేదో ఎంఓయు అంటగా…అది కుదుర్చుకున్నార్లే. ఆరు నెలల క్రితం బాబుగారు మనకొట్టుమందు ఆగి ఓ పుల్లట్టు రుచిచూశార్లే. అంతే, ఈ పుల్లట్లను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారట. జపాన్ వారికి చెప్పారు. వారు ఎగిరిగంతేసుకుంటూ మా ఇంటికాడికొచ్చి పెట్టుబడి పెట్టడానికి రెడీ అయిపోయారు. నువ్వు లేటుగా వస్తే ఈ పుల్లట్ల కాంతం బదులు , ఫైవ్ స్టార్ హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ కాంతం కనబడుతుంది నీకు.
అబ్బాయ, రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. ఇప్పుడు మా బండ్లు ఓడలవుతున్నాయి. అమరావతి నిర్మాణంలో నువ్వూ భాగస్వామివేనంటగా. బాబుగారు చెబుతున్నార్లే. అమరావతికి ఇటుకలు కొనకపోతే పోనీ, కాస్త ఈడకొచ్చి నిలబడు అబ్బాయ. ప్రభత్వ ఉద్యోగులైన మీరంతా గట్టిగా తలచుకుంటే మన బాబుగారు ఐదేళ్లలోనే బాగా డెవలప్ చేస్తార్లే. ఇందాకే చెప్పానుకదా అబ్బాయ. బాబుగారికి మీరంటే ముద్దు. అలాంటప్పుడే మీకు కావాల్సినవి తీసుకుని ఆయనకు కావాల్సింది ఇవ్వండి. హైదరాబాద్ నుంచి అమరావతికి రావడానికి గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని శీనుగాడు తెగ విసుక్కుంటున్నాడ్లే. కానీ నేను అలాకాదబ్బాయ. ఇదే మంచి అవకాశం మీకు. మీ డిమాండ్లకు మరికొన్ని నేను జతచేస్తున్నానీడ. ఈసారి బాబుగారితో మాట్లాడేటప్పుడు వీటిని ఆయన ఎదుటపెట్టండి.
1. అమరావతికి దగ్గర్లో తలో 500 గజాలు ఇవ్వాలి. మామూలు ప్రజలు ఏ వందగజాల్లోనో, 200 గజాల్లోనోఇరుగ్గా ఇళ్లుకట్టుకున్నా ఫర్వాలేదు. కానీ, మీరు ప్రభుత్వ ఉద్యోగులుకదా. కనీసం 500 గజాలుండాలి. రేపు పిల్లగాళ్లకు చెరో రెండొదల గజాలచొప్పున పంచినా, మీకోసం ఓ వందగజాలు ఉంటాయి.
2. స్థలం ఫ్రీగా ఇవ్వడంతోపాటుగా ఇల్లు కూడా ఫ్రీగానే కట్టించాలి. ఎలాగో అమరావతి రాజధాని కోసం ప్రజలంతా ఇటుకలు కొని ఇస్తున్నారుగా వాటిలో కొన్ని మీ ఇళ్ల నిర్మాణానికి అడగటంలో తప్పేమీలేదు. ప్రజలకు సేవచేస్తున్నప్పుడు `ప్రజల సొమ్ము…ప్రజల ఇటుకలు’ అడగటంలో తప్పేముందట.
3. శంకుస్థాపన , గృహప్రవేశం ఖర్చులు ప్రభుత్వమే భరించాలని అడగండి.
4. ఇంటికి సున్నాలు, పెయింటింగులూ, ఇంటీరయర్ డెకరేషన్లు ఇవన్నీ మీ జేబులోంచి పెట్టకండి. బాబుని అడిగేయండి.
5. ఇంటికో ఏసీ కారు పథకం ప్రవేశపెట్టమని కోరండి.
6. `మన ప్రభుత్వం – మన కుటుంబం’ పథకం పెట్టించి, పదేళ్లపాటు కుటుంబసభ్యుల విందువినోదాల ఖర్చులు రాబట్టండి. వారానికోసారి ఫ్యామీలిని మల్టీప్లెస్ థియేటర్ లో సినిమా చూపించడం, స్టార్ హోటల్ లో భోజనం, నెలకోసారి హైదారాబాద్ నుంచి వచ్చివెళ్లడానికి గరుడ ఏసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం వంటివి అడిగేయండి.
7. అసలే కొత్తఊరుకదా… ఓ పదేళ్లపాటు ఫ్రీగా పాలు, కూరగాయలు, పండగలకు కొత్తబట్టలు ప్రభుత్వమే ఇవ్వాలని కోరండి అబ్బాయ. ఆ మరిచాను, పుల్లట్ల సంగతి మరచిపోకండేం.
ఇలాంటివి ఇంకా చాలా డిమాండ్లు చేయొచ్చు. బాబుగారూ ఈసారి గవర్నమెంట్ ఉద్యోగుల విషయంలో సాప్ట్ గానే ఉంటారని మనఊరోళ్లు అనుకుంటున్నార్లే. గతంలో చేసిన తప్పులు ఆయన చేయరటగా… ఇదే మంచి ఛాన్స్. అన్నీ ఫ్రీ అబ్బాయ. వచ్చేయండి. మన సొంత రాజధానికొచ్చి పనిచేయండి. మంచంమీద ఉన్న అమ్మ సంతోషిస్తుంది. ఊర్లోని జతగాళ్లు సంబరపడిపోతారు. నీ సంసారం నీది, నా సంసారం నాది. అలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోకు. చిన్నప్పటి నేస్తగాడివని ఈ లేఖ రాస్తున్నాను. మరి నీరాక కోసం నేను కాదు, అమరావతి ఎదురుచూస్తోంది. `రారా…అమరావతికి రారా…’ అంటూ పాడుకుంటుందో నీ కాంతం.
– కణ్వస