నేను ఓ మంచి కుక్కని. ఎంతగాఅంటే, రాముడు మంచి బాలుడన్నంతగా మంచిదాన్ని. అలా ఎందుకంటున్నానంటే, మా యజమాని దగ్గర చాలా విశ్వాసంతో ఉంటాను. అసలు మా జాతికి మారుపేరే విశ్వాసమనుకోండి. కానీ అందులోనే తేడాలుంటాయి. ఎవరిదాకానో ఎందుకు మా ఇంటి ఎదురింట్లో ఉందో కుక్క. అబ్బో దానికి ఉంది చాలా టెక్కు. యజమాని కారెక్కితే అదీ ఎక్కాల్సిందే. యజమాని ఏసీ రూమ్ లో పడుకుంటే అదీ అక్కడే పడుకుంటానంటూ మారాంచేసేది. కానీ క్రిందటేడాది దీపావళి రోజున దాని తిక్కకుదిరింది. ఇంటాయన వీధిలో క్రాకర్స్ పేలుస్తుంటే, రాకెట్లు విసురుతుంటే భయంలేకుండా ఇది కూడా తోకాడించుకుంటూ ఆయన పక్కనే తిరిగింది. కానీ అంతలో ప్రమాదం జరిగింది. దాని ఒళ్లు కాలిపోయింది. కాలు విరిగింది. ఆస్పత్రికి తీసికెళితే ఐసీయులో ఉంచారట. చాలారోజులతర్వాత కుంటుకుంటూ కనిపించింది. నన్ను చూసి అదోలా మొరిగింది. అప్పుడు నాకేమో దానిమీద కోపంపోయి, బోలెడు జాలి కలిగింది. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి మా ఇద్దరికీ దీపావళి వస్తుందంటే భయం. అంతా మనవాళ్లేకదా అని తోకాడించుకుంటూ పోయామంటే తోకకే నిప్పంటించుకోవచ్చు. ముక్కూమొహం మాడిపోవచ్చు.
దీపావళి అంటే భయపడుతున్న మాకు ఈసారి చాలా సంతోషమేసింది. ఆ సంతోషంలో ఎదురింటి కుక్క గంటసేపు తోకాడిస్తూ నాముందు నాట్యం చేసింది. అవును చెప్పడం మరిచాను, మేమిప్పుడు లవ్ లో పడ్డాంలేండి. ఈసారి మా వీధిలో దీపావళి జరుపుకునే తీరులో చాలా మార్పు వచ్చింది. సౌండ్ పొల్యూషన్ మీద బాగా అవగాహన ఏర్పడిందట, క్రాకర్స్ ని బాగా తగ్గించేశారు. కేవలం కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్ల, భూచక్రాలు, మతాబులు వంటివాటితో సరిపెట్టేశారు. ఢాంఢాంలు కాల్చినా అవి మా ఇంటి యజమానురాలి గొంతుకంటే తక్కువ స్థాయిలోనే పేలాయి. అందుకే మా చెవులకు ఎలాంటి హానీ కలగలేదు. మీకో విషయంచెప్పాలి. మా చెవులు మీ చెవులకంటే చాలా సున్నితం. మీకేమో ఇంట్లో దొంగలపడుతున్నా చెవికెక్కించుకోకుండా పడుకుంటారు. మేమైతే అలాకాదు, దొంగవెధవ వీధి చివర్లో ఉండగానే మాకు తెలుస్తుంది. చిన్నచిన్న శబ్దాలను కూడా ఇట్టే పట్టేస్తాము. అలాంటిది మీరు పెద్దపెద్ద క్రాకర్స్ పేల్చారనుకోండి, మా చెవులు చిల్లులుపడిపోవూ. ఓ రకంగా అది మీకేనష్టం. దీపావళి అయ్యాక చెవులు బండబారి మా బాధ్యతలను మేము సరిగా నిర్వర్తించలేకపోవడం మీకే నష్టం కదా. అదన్న మాట.
ఈసారి దీపావళి ప్రశాంతంగా జరిగింది. నేనూ, ఎదురింటి నా లవర్ చాలా సంతోషించాము. అందుకే మేమిద్దరం ఒక తీర్మానం పాస్ చేశాం. దీపావళిని కూడా కుక్కల పండుగల్లో చేర్చేశాం. ఇకపై మేము కూడా మీతోపాటు ఆనంద దీపావళి జరుపుకుంటాము.
పండుగైన మర్నాడు యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ ఒకావిడ మా ఇంటికొచ్చి యజమానితో చాలాసేపు మాట్లాడింది. ఆమె కళ్లలో ఆనందాన్నిచూశాను. ఆమె చెప్పిన కొన్ని విషయాలు నాకు బాగానే అర్థమయ్యాయి. ఈసారి దీపావళిచాలా చోట్ల ఇలాగే ప్రశాంతంగా జరిగిందట. క్రాకర్స్ కాల్చడం తగ్గిపోయిందట. సేఫ్ దివాలీకే చాలామంది ఆసక్తి చూపారట.
క్రిందటి ఏడాది కంటే ఈసారి మాలాంటి పెంపుడు జంతువులు, అలాగే వీధుల్లో తిరిగే జంతువులు ఎక్కువగా గాయపడలేదట. తోకలకు నిప్పంటుకోలేదట. బొచ్చు కుక్కలు కాలిపోలేదట. దేశ రాజధాని ఢిల్లో లోనేకాదు, చాలా చోట్ల సేఫ్ దివాలీ జరుపుకున్నారని ఆమె చెబుతుంటే నేను తోకాడిస్తూ శ్రద్ధగా విన్నాను. మనుషుల్లో ఇంత మార్పు రావడానికి తమ లాంటి సేవాకార్యకర్తలు చేస్తున్న ప్రచారమేనంటూ ఆమె తెగ సంబరపడిపోయింది. ఇంటి యజమాని కూడా సంతోషించి ఆమెకు స్వీట్ ప్యాకెట్ ఇచ్చి పంపించారు.
ఇది నిజం కావచ్చు. అంతకంటే మరో నిజం ఉంది. రేట్లు బాగా పెరిగిపోయాయి. ఓ గంటసేపు దీపావళి టపాకాయలు మ్రోగాలంటే వేలాది రూపాయలు ఖర్చుచేయాల్సిందేనని యజమాని వాళ్లబ్బాయిని కసురుకుంటూ చెప్పడం నేను విన్నాను. సంపన్నులు లక్షలుపోసి పెద్దపెద్ద అట్టెపెట్టెల్లో టపాకాయలు తీసుకురావడం నేనూ మా వీధిలో చూస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడిప్పుడే మార్పు వస్తున్నట్లుంది. కోటీశ్వరులు చాలా కూల్ గా దీపావళి జరుపుకుని ఇదే లేటెస్ట్ స్టైల్ అనేస్తున్నారు. దీంతో మధ్యతరగతి వాళ్లు అదే ట్రెండ్ ని ఫాలోఅవుతున్నారు. అసలు దీపావళి అంటే దీపాల వరుస అనే కదా అర్థం. ఏమిటో ఈ మనుషులు. అర్థం తెలిసినా పాటించి చావరు.
ఇన్నాళ్లకు మనుషుల్లో మార్పు వస్తోంది. ఇది వాళ్లకీ మంచిదేగా. దీపావళి యాక్సిడెంట్ రేటు తగ్గుతుంది. లేకపోతే దిపావళి రాత్రివేళ ఆస్పత్రుల్లో నైట్ డ్యూచేసేవాళ్లకి చేతినిండా పనేగా మరి. కానీ ఈసారి చాలాచోట్ల సీరియస్ కేసులు నమోదుకాలేదట.
మొత్తానికి ఆనంద దీపావళి వైపు అంతా అడుగులువేస్తున్నారు. దీంతో మాజాతివాళ్లంతా నిజమైన దీపావళి చూస్తూ గెంతులేస్తున్నాం. మాలాంటి వాళ్లను ఇబ్బంది పెట్టకుండా, మీరు చేతులుకాల్చుకోకుండా ఉంటే, దీపావళి మాకూ పెద్ద పండుగే అవుతుంది.
ఏమిటో ఆనందం పట్టలేక ఏదో మొరిగాను. నాకర్థమైంది నేను చెప్పాను. మరి నా మొరుగుడుశోష..అదే కంఠశోష మీకు అర్థమైందా….?
– కణ్వస