`గోదావరి మహా పుష్కరాలు వచ్చివారం అవుతున్నా ఇంట్లోనుంచి నువ్వు కదలవేంట’ని కనిపించిన బంధువులు, స్నేహితులు, కనిపించకపోయినా ఫేస్ బుక్, ట్విట్టర్ , వాట్సాప్ వంటి సోషల్ మీడియాల్లో అందరూ ఎడాపెడా వాయించేస్తుంటే, ఇక భరించలేక ఒక శుభముహూర్తాన పుష్కర యాత్రకు బయలుదేరాను. పద్మవ్యూహంలో అభిమన్యుడిలా జనప్రవాహాన్ని చేధించుకుంటూ చివరకు గోదావరిలో మునిగాను. వస్తూవస్తూ ఎవరికైనా పనికొస్తాయని ఓ సీసానిండా గోదావరి నీళ్లు ఇంటికి తెచ్చాను.
అదే నేను చేసినతప్పు. ఆరోజు రాత్రి నేను నిద్రలోకి జారుకుంటుండగా, ఎవరో పిలిచినట్టుఅనిపించింది. చూస్తే, ఎవరూ లేరు. మళ్ళీ నిద్రకు ఉపక్రమించాను. కానీ అదే గొంతు. ఈసారి మరింత నిశితంగా చూశాను. నాకు కాస్తంత భయం వేసింది. హారర్ సినిమా చూసొచ్చినా నాకు పడుకోగానే నిద్రపడుతుంటుంది. `వీడు ప్రతిదానికీ భయపడడు’ – అని ఫ్రెండ్స్ సర్కిల్ ఇచ్చిన కితాబు. అలాంటిది నాకే భయం వేసింది. అంతలో మళ్ళీ అదే పిలుపు. అది ఆడగొంతుక. జాగ్రత్తగా వింటుంటే, ఆ పిలుపు గదిలోనుంచే, అది కూడా టేబుల్ మీద నేను పెట్టిన నీళ్ల సీసా నుంచే వచ్చినట్టు అనిపించింది. కళ్లు చికిలించుకుని చూశాను. నిజమే. అనిపించడంకాదు, ఇదే నిజం. నీళ్లు మాట్లాడుతున్నాయి. నాకెందుకో ఇది నీళ్ల దెయ్యమేమో అనిపించింది. వైశాలి సినిమా గుర్తుకు వచ్చింది. ఇక లాభంలేదు. ధైర్యం చేయాల్సిందేననుకుని టేబులు ముందు ఉన్న కుర్చీలో కూర్చుని గట్టిగా అడిగేశాను.
`ఎవరు నువ్వు ?’
ఠక్కున అటునుంచి సమాధానం
`నన్నెవరో గుర్తుపట్టలేదా…? ‘
`ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు, నువ్వు ఎవరో తెలిస్తే, అలా ఎందుకు అడుగుతాను’ మొండి ధైర్యంతో లాజిక్ లేవనెత్తాను. దెయ్యాలు, భూతాలు కనబడినప్పుడు భయపడకుండాఇలా లాజికల్ గా మాట్లాడితే అవి తోకముడుచుకుపోతాయని ఎక్కడో ఓ పుస్తకంలో చదివాను. ఇప్పుడు ఆ ఫార్ములానే ఇంప్లిమెంట్ చేశాను.
`నువ్వు నా భక్తుడివి ‘ ఆ సీసాలోంచి మళ్ళీ స్వరం.
ఆశ్చర్యపోవడం నావంతైంది.
`నేను నీ భక్తుడినా…అంటే, నువ్వు..గోదా.. ‘
`అవును భక్తా, నేను గోదావరి మాతను. నా దగ్గరకు వచ్చి స్నానం చేశావు కదా. పైగా నన్ను సీసాలో ఇక్కడికి తీసుకువచ్చావుగా, నీ ఆంతర్యం తెలుసుకోవాలని పలకరిస్తున్నాను ‘
చాలా స్పష్టంగా చెప్పింది. ఇక ఎలాంటి డౌట్లు లేవు. ఇక నాలోని జర్నలిస్ట్ మేల్కొన్నాడు. ఎవరికీరానీ మహదావకాశం. గోదావరి మాతతో స్పెషల్ ఇంటర్వ్యూ. సంచల వార్త. ఎగిరి గంతేశాను. గోదావరి మాతతో నా స్పెషల్ ఇంటర్వ్యూ ఇలా సాగింది…
`అమ్మా, గోదావరి మాత, ఈ పుష్కరాల వైభవంలో ఎలా ఉన్నావు తల్లీ…’
`ఏం బాగోలేదు’
`అదేం ! రోజూ లక్షలాదిమంది పుణ్యస్నానాలు చేస్తున్నారు. నీకు దండాలు పెడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నీ స్నానం కోసం త్రొక్కిసలాటదాకా కూడా వెళ్లారు. మరి, ఏం బాగోలేదు తల్లీ ? ‘
`అసలు మీరంతా ఎందుకని నదుల్లో స్నానం చేస్తున్నారు ? ‘
`అదేమిటీ, నీలో , అంటే గోదావరి నదిలోకి పుష్కరుడు ప్రవేశించాడుగా… ! ‘
`అదే నాకిప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఆ పుష్కరుడు ఒక్కడే వస్తే బాగుండు, కానీ ముక్కోటి దేవతలనూ వెంట బెట్టుకు వచ్చాడు. వాళ్లందరికీ ఈ పన్నెండు రోజులు వండివార్చి వడ్డించేటప్పటికీ నా ఫ్లో, అదే ప్రవాహం కాస్తా తగ్గిపోయింది ‘
`అవునవును, అంతమందికి వండాలంటే చాలా నీళ్లు కావాలి. ఇప్పుడర్థమైంది. అసలే వర్షాలు లేవు, పైగా వీళ్లందరికోసం వంటకీ, తాగడానికి నీళ్లు కావాలాయె, అందుకే నీళ్లు లేని గోదావరైపోయావు. పాపం…’
`మీ వల్ల కూడా నాకు మనస్శాంతి లేకుండా పోయింది ‘
`ఎందుకు తల్లీ ?’
`మీ స్నానాలతో … ‘
`ఆ తెలిసిందీ, కోటానుకోట్ల జనాభా ఉంటే, కేవలం లక్షల్లో స్నానాలు చేస్తున్నందుకా ?’
గోదావరి మాతకు కోపం వచ్చినట్టుంది. కసురుకుంటూ…
`ఏడ్చావ్… నువ్వేం జర్నలిస్ట్ వయ్యా, విషయం అర్థం చేసుకోవు. ఇప్పటికి మునిగిన వాళ్ల సంఖ్యే ఎక్కువని నేను ఇదవుతుంటే… ? ‘
`అలా అంటే ఎలా అమ్మా, అందరికీ పుణ్యం సంపాదించుకునే మంచి అవాశం ఇది.. ‘
మళ్ళీ కోపంగా…
`అదే.. అదే నాకు చిర్రెత్తుకొచ్చేది. కేవలం మూడు మునకలతో మీకు పుణ్యం రావాలా? పైగా పుష్కరనితో సహా మూడు కోట్ల మంది దేవతలూ మీ పాపాలన్నీ తీసేసుకుని `క్లీన్ చిట్’ ఇవ్వాలా..? ఏంటయ్యా, ఇదంతా?? ‘
`అంటే మేము చేసేది పుణ్యస్నానాలు కావా ! ‘
ఈసారి గోదావరి మాత అరిచినంతపనిచేస్తూ….
`కాదురా,కాదు.. మీరు చేసేది పుణ్యస్నానాలు కానే కావు. మనసులో సవాలక్ష కోరికలు పెట్టుకుని పుష్కర స్నానం చేస్తే అది పుణ్యస్నానమెలా అవుతుందిరా..? ‘
`అంటే అది… ? ? ? ‘
`మీరు చేసేది పాపస్నానాలు. ఎవరి మనసులో ఎలాంటి కోరికలు లేకుండా, స్థితప్రజ్ఞుడై భాసిల్లుతుంటాడో, ఎవరు నిష్కామ కర్మ చేస్తాడో వాడు ఆచరించే స్నానం పుణ్యపరమైనది. అలాంటి వాడు నాకింకా తగలలేదు.. చేసిన పాపాలను కేవలం పుష్కర స్నానంతో వదిలించుకోవాలనుకునే మీ వళ్లనే పుణ్య నదినైన నాకు మరింత పాపం చుట్టుకుంటోంది. ? ‘
`అర్థమైంది మాత, అర్థమైంది. మనసు పాపాల కొలిమిలా కాలుతుంటే, అది నదిలో ముంచేసుకుని చల్లబరచుకోవాలనుకోవడం మా అవివేకం. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? ‘
`వెంటనే ఈ సీసాను బయటపారేయ్. నువ్వు జర్నలిస్ట్ విగా, వాస్తవం ప్రజలకు చెప్పేయ్’
ఇంతకాలంగా భయం లేదనుకున్న నాకు, గుండె ఆగిపోతుందేమోనన్నంత భయం ఇప్పుడు ఆవహించింది. గొంతు పెగుల్చుకుంటూ…
`అమ్మో..అంత సాహసం నేను చేయలేను తల్లీ, ఇది వాస్తవం కావచ్చు. కానీ బయటప్రపంచానికి చెబితే, స్వామీజీలు, బాబాలూ, భక్తులు, చివరకు ప్రభుత్వాలు …నన్ను ఉప్పుపాతరేస్తాయి… నేను చెప్పలేను. మీరు చేసే పుష్కర స్నానాలు పాపస్నానాలని నా నోటితో చెప్పలేను. అవను చెప్పలేను…చెప్పలేను…చెప్ప… ‘
ఉలిక్కిపడ్డాను. అప్పుడర్థమైంది. నాకొచ్చింది కల అని. టేబుల్ మీద ఉన్న గోదావరి నీళ్ల సీసా వంక చూస్తూ, ఒక వెర్రినవ్వు నవ్వుకున్నాను.
– కణ్వస
kanvasa19@gmail.com