`బాబు’కు గత కొంత కాలంగా నిద్రసరిగా పట్టడంలేదు. పట్టిన కాసేపు ఎప్పుడూ చూడని లోకాలు కళ్లముందు కనిపిస్తున్నాయి. అక్కడ, ఓ మహా కోట.. ఎత్తైన ద్వారాలు, అద్భుతమైన శిల్పకళా చతురతతో నిర్మించిన సభాప్రాంగణాలు, నందనోద్యానవనాలు… ఒకటేమిటీ ఎటు చూసినా ఆ మహానగరి నేత్రానందదాయకమే. అందులోకి ఒక్కసారి అడుగుపెడితే చాలు, జీవితం ధన్యమైపోతుంది. రాజభోగమంటే ఇదీ.. అన్నట్టు కలలొస్తున్నాయి. కల ఇంత మహదానందంగా సాగుతుంటే, అంతలో వాడెవడో మహా కాలకేయుడట. వాడు విలన్ లాంటోడు. ఇక ఊరుకుంటాడా, మహా కాలకేయుడు, వాడి సైన్యం ఈ సుందర నగరంపై విరుచుకుపడినట్టు, కోటలను పేకమేడల్లా కూల్చేస్తున్నట్టు వికృత కల. అంతే బాబు ఉలిక్కిపడి లేవడం…ఇదీ వరుస. గత కొంతకాలంగా ఇలాంటి కలలు నిద్రలోకి జారుకోగానే ఠపీమని వచ్చేస్తున్నాయి.
ద్వారం దగ్గర ఏదో చప్పుడైంది. పరధ్యానంలో ఉన్న బాబు ఉలిక్కిపడి అటువైపు చూశాడు. వచ్చినవారు వందిమాగదులైన శర్మశాస్త్రులు. ఎదుటివాడికి `ఇది పొగడ్త’ – అని తెలియకుండా నేర్పుగా పొగడటం వీరిద్దరికీ వెన్నతో పెట్టిన విద్య.
`విజయీభవ..దిగ్విజయీభవ ..దుగ్గుదుగ్గు జయీభవ’ – అంటూ వీరిద్దరు బాబు చెంతకు చేరారు.
వందిమాగదల జయజయ స్తుతులు వినడానికి ఇంపుగానే ఉన్నా, చివర్లో – `దుగ్గు దుగ్గు జయీభవ’ అనగానే బాబుకు మరో రకంగా అనిపించి ఉలిక్కిపడ్డారు. ఆ వెంటనే కోపం వచ్చింది.
`ఏమిటీ, చివర్లో అన్నది…నాకేదో స్పురణకు వచ్చింది.
శర్మశాస్త్రులకు అప్పటికిగానీ లైట్ వెలగలేదు. వెంటనే నాలుక కరుచుకుంటూ..
`అయ్యా, మేము ఆయనగారిని, అదే దగ్గు..దగ్గు….ని దృష్టిలో పెట్టుకుని అనలేదండయ్యా, ఏదో ప్రాశ బాగుంటుందని తమ విజయకీర్తిని కొనియాడాలని…ఏదో …అలా…’
బాబు శాంతించాడు. వారిని ఎగాదిగా చూసి…వారి చేతుల్లో ఎదో ఉండటం గమనించి…
`ఏమిటీ, ఏదో పట్టుకొచ్చారు ? ‘
శర్మ అందుకుంటూ… ` అయ్యా, ఇది, మొన్నీమధ్య ఒక అడవిలోని శివాలయం వద్ద తవ్వకాల్లో కనిపించిందడయ్యా, తోలు పత్రంమీద ఏదో నగర నమూనా చిత్రించినట్టున్నారండయ్యా, మీకేమైనా ఉపయోగపడుతుందేమనని, తమ వద్దకు తీసుకువచ్చామండయ్యా.
నగరం నమూనాను చిత్రించిన ఆ తోలు పత్రాన్ని బల్లపై పరచి నిశితంగా చూసిన బాబు మరో సారి ఉలిక్కిపడ్డాడు. ఏంటీ ఇవ్వాళ ఇన్ని సార్లు ఉలిక్కిపడుతున్నానని తలచుకుంటూ కలవరపడ్డాడు బాబు.
శర్మ, శాస్త్రులకు అర్థం కాలేదు. పురాతన నగర చిత్రపటం చూడగానే ఎందుకిలా ఉలిక్కిపడ్డారో అర్థంకాక అయోమయంలో పడిపోతుంటూ ఆ నగర మాస్టర్ ప్లాన్ వైపే చూస్తూ…
`అవును, ఇది మాహిష్మతి రాజ్యం. ఇదిగో ఇది కోట..అదిగో అది జలాశయం. ఆ పక్కనే ఉన్నదే శివాలయం . ఇటు చూడండి, ఆ పెద్ద స్వర్ణ విగ్రహం నాదే…
శాస్త్రులు ధైర్యంతెచ్చుకుంటూ – `అయ్యా, తమరు భ్రాంతిలో ఉన్నట్టున్నారు. ఈ మహానగరి చిత్రం చాలా పురాతనమైంది. బహూశా వెయ్యిసంవత్సరాల కిందటిదనుకుంటా. (తల గోక్కుంటూ) మరి మీరేమో, దీన్ని చూసినట్టు మాట్లాడుతున్నారు ! ‘
`లేదు, ఇదే ఈ మహా సామ్రాజ్యాన్నే నేను రోజూ కలలో చూసేది. దీని పేరు మాహిష్మతి రాజ్యం. ఇందులో నేను చక్రవర్తిని. కానీ కొందరి కుట్రతో పదవీచ్యుతుణ్ణి అయ్యాను. అయినా మంచికాలం కోసం వేచి ఉండి మళ్ళీ నా రాజ్యాన్ని నేను నిర్మించుకున్నాను ‘
శర్మ ఆశ్చర్యపోతూ `అంటే, మీరు ?’
`నేను చక్రవర్తిని. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి రాజ్యాన్నే నిర్మిస్తాను. అందుకే దేవుడు పంపినట్టు మీరు ఈ నమూనా నగరి పటాన్ని తీసుకువచ్చారు.
శాస్త్రులు అడ్డుతగులుతూ – ` కానీ బాబుగారూ, ఇప్పుడు మీరున్న రాజ్యంలో ఇలాంటి అతిపెద్ద భవంతులు, మహాసభా ప్రాంగణాలు కట్టించడం కుదురుతుందా ?
`ఎందుకు కుదరదు ? నా శక్తిని మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు. ఆనాడు , అదే వెయ్యేళ్ల క్రితం అడవి ప్రాంతంలోనే నేను మాహిష్మతి రాజ్యాన్ని నిర్మించాను. ఆ విధంగా ముందుకు పోయాము. ఇప్పుడూ అంతే, అలాగే ముందుకుపోతాము. అప్పట్లో సింహపురం నుంచి శిల్పులను తెప్పించి మహా కోటలు కట్టించాను. ఇప్పుడు వారినే పిలిపిస్తాను’
శాస్త్రులు కంగారుపడిపోతూ… `ఏంటీ ! వారిని పిలిపిస్తారా… !! అదేలా సాధ్యం? పోయినవాళ్లు వచ్చి ఎలా కడతారు !!’
`నేను తలుచుకుంటే, సాధ్యం కానిదే లేదు. నాటి సింహపురమే నేటి సింగపూర్. నాటి శిల్పుల వంశస్థులు నేటికీ ఉన్నారు. వారిని పిలిపిస్తాను. కొత్త రాజ్యం రాజధాని మాస్టర్ ప్లాన్ వేయిస్తాను. అందరూ అశ్చర్యపోయేలా నిర్మిస్తాను ‘
శర్మ, శాస్త్రి మళ్ళీ విజయోస్తు వచనాలు పలకడం మొదలుపెట్టారు. అంతలో బాబు మొహంలో మార్పు వచ్చేసింది. రాజదర్ఫం వెలిగిపోతోంది. ఠీవీగా కుర్చీలో కూర్చుని…గంభీరంగా
`నేను ఎవర్నీ?’
మళ్ళీ ఈ ప్రశ్నేమిటి భగవంతుడా…అనుకుంటూ శర్మ అయోమయంగా శాస్త్రులవైపు చూశాడు. శాస్త్రి చేతివేళ్లతో లెక్కలు గట్టి, అసలు విషయం తెలిసినట్టు…
`ఆఁ ఇదేమిటో నాకు తెలిసిపోయింది. ఈయనపై `బాహుబలి’ ప్రభావం చాలానే పడింది. మనం కూడా అలాగే మాట్లాడాలిసుమీ..’ అంటూ సలహా ఇచ్చాడు.
ఇంతలో మళ్ళీ బాబు నోట అదే ప్రశ్న.
`నేను ఎవర్నీ ?’
శర్మ తెలివిగా మాట్లాడుతూ…
`తమరు, అమరేంద్ర `బాబు’బలి రక్తానివి బాబూ, రక్తానివి…
`అమరేంద్ర ఏంటీ ?’ బాబుగారికో డౌట్.
శాస్త్రి డౌట్ తీరుస్తూ…
`అదే బాబూ, అమరావతికి ఇంద్రుడులాంటివారని అర్థం. గతంలో మీ రాజ్యం మాహిష్పతి. ఇప్పటి మీ రాజ్యం అమరావతి. కనుక మీరు అమరావతి `బాబు’బలన్నమాట.
`భేష్.. బాగుందీ, జై అమరిష్మతి …’ అంటూ బాబు గావుకేక పెట్టాడు.
శర్మ, శాస్త్రులకు ఈ అమరిష్మతి ఏంటో అర్థం కాలేదు.
`ఇదేమిటీ బాబుగారూ ?!’
`ఇది నా కొత్త సామ్రాజ్యం పేరు. నాడు మాహిష్మతి రాజ్యం నిర్మిస్తే నేడు అమరావతి కేంద్రంగా అమరిష్మతి రాజ్యం నిర్మిస్తా. జై అమరిష్మతి..’ కేకలు మారుమ్రోగుతున్నాయి.
శర్మ, శాస్త్రులు వంత పాడుతూ..
`జైజై అమరిష్మతి రాజ్యం.. జయహో అమరేంద్ర `బాబు’బలి’
వీరు ఇలా అంటుండగానే, బాబు మళ్ళీ నిద్రలోకి జారుకుని కలలు కనడం మొదలుపెట్టాడు. కల మళ్ళీ ప్రారంభం.
– కణ్వస