సుధీంద్ర కులకర్ణి ముఖం ఉన్నట్టుండి నల్లగా మారిపోయింది. అతని సెక్రటరీ ఖేల్కర్ కి విషయం అర్థంకాక బట్టతలమీద వెంట్రుకలున్నాయనుకుని పీక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంటినుంచి చక్కటి మేకప్ తో ఏదో పుస్తకావిష్కరణ సభ నిర్వహించడానికని బయటకువెళ్లీవెళ్లగానే తన బాస్ ఇలా అయిపోవడం సెక్రటరీకి ఏమాత్రం నచ్చలేదు.
` ఏంటీసార్, ఏమిటీ అవతారం?’
`ఏం చెప్పమంటావురా… ఇవ్వాళ టైమ్ బాగోలేదు. నా జన్మనక్షత్రంలోకి శని ప్రవేశించినట్లున్నాడ్రా…’
`ఊరుకోండి సార్, మీరు మహా పండితులు మిమ్మల్ని శని ఏంచేస్తాడు’
`ఇంతకాలం అలాగే అనుకున్నాను. కానీ, పాకిస్తాన్ విదేశాంగశాఖ మాజీ మంత్రి ఖుర్దీద్, మనదేశంలోకి ప్రవేశించాడుకదరా..’
`ఓ..ఆయనేనా మీ పాలిట శని’ కోపంగా అడిగాడు ఖేల్కర్
`ఛ, కాదురా, పూర్తిగా వినిచావు. ఆ పెద్దాయన ఓ పుస్తకం రాశాడు. దాని ఆవిష్కరణ సభ ఏర్పాటు చేయమన్నాడు..అంతే…’
`ఇకనేం తమరు ఎగరేసుకుంటూ పుస్తకావిష్కరణ సభ నిర్వహణకోసం వెళ్లుంటారు. ‘
`సరిగా అదే జరిగింది. అంతే శివసేనవాళ్లు ఎక్కడినుంచో ఊడిపడి నా ముఖంమీద సీరాపోశారు’ దిగాలుపడిపోయాడు కులకర్ణి.
`ఎందుకలా చేశారో ఉతికిఆరేయకపోయారా’ కోపంతో ఊగిపోతూ అన్నాడు ఖేల్కర్.
`అదే చేశాను. కాని వారికో లెక్క ఉందట. ఆ లెక్కప్రకారం నేనో పాక్ ఏజెంట్ నట. పాక్ ఏజెంట్ గా నా ముఖం మీద ముద్ర ఇదిగో ఇలా వేశారన్నమాట.’ మరోసారి దిగులుపడ్డాడు కులకర్ణి.
`అయ్యే ఎంతపనైంది సారూ, మరి ఇంతకీ ఈ మరక ఉంచుకుంటారా, లేక తుడుచుకుంటారా?’
`తుడుచుకున్నా పోయేటట్లు లేదురా, ఏం చేయాలో ఏమిటో…’ కులకర్ణి ఆలోచనలో పడిపోయారు.
సరిగా అదే సమయానికి ఫోన్ మ్రోగింది. పక్కనే ఉన్న సెక్రటరీ ఫోన్ ఎత్తి మాట్లాడి కట్ చేశాక…
`సార్, శుభవార్త. మీతో యాడ్ ఫిల్మ్ తీయడానికి సర్ప్ ఎక్సెల్ వారు వస్తారట. పైగా పెద్ద ప్యాకేజీనేనట’
`సర్ఫ్ వాళ్లు రావడమేమిట్రా…!?’
`అవునుసార్. మీ ముఖం మీద మరక మంచిదేనని బల్లగుద్దీమరీ చెబుతున్నారు వాళ్లు. దాన్ని మీరు చెరపకుండాఉంటే, మరికాస్త నల్లరంగు పూసి యాడ్ షూట్ చేసుకుంటారట…’
`శివసేన వాళ్ల మరకతోనే ముఖం ఎవరికీ చూపించలేక ఛస్తుంటే, మధ్యలో ఈ యాడ్ గోలేంట్రా బాబూ..’ ఏడవలేక అదోలా నవ్వేశాడు కులకర్ణి.
మళ్ళీ ఫోన్ రింగైంది. సెక్రటరీ చాలా ఆనందంగా మాట్లాడేస్తున్నాడు…
`హలో…ఓహో, అలాగా.. ఎంతిస్తారు? అయితే ఒకే , రండి. మాసార్ ఇంట్లోనే ఉంటారు. ప్రస్తుతం ఎక్కడికీ కదలలేరు. ఆ…రండి’
`ఎవర్రా వాళ్లు ?’
`అదే సార్, వర్మ క్రియేషన్ వాళ్లు. `నడిచొచ్చిన నల్లదెయ్యం’ – సినిమా తీస్తున్నారట. అందులో టైటిల్ రోల్ గా మిమ్మల్ని బుక్ చేసుకుందామని వస్తున్నారు. కంగ్రాట్యూలేషన్స్ సార్. మీరు సినిమా హీరో అయిపోయారు’ తెగ సంబరపడిపోయాడు సెక్రటరీ.
`నీ సంబరం తగలెయ్యా, నేనేమిటీ? నడిచొచ్చే నల్లదెయ్యమేంట్రా. ఏంట్రా ఇదీ…ఒకడేమో పాకిస్తాన్ ఏజెంట్ వంటాడు. మరొకడేమో మరక మంచిదే అలాగే ఉంచుకోండని అంటాడు. వీడేమో నల్ల దెయ్యమంటాడు. ఒరే శని ప్రభావం చాలా దారుణంగా ఉందిరోయ్…ఏదైనా శాంతిగట్రా చేయించాల్సిందే…’ ఇలా అంటుండగానే మళ్లీ ఫోన్ రింగైంది.
`హలో, ఎవరూ.. అమ్మో, మీరా.. ఏమిటీ…వస్తున్నారా…’ సెక్రటరీ మాటలు తడబడుతున్నాయి. తెగ కంగారుపడిపోతున్నాడు.
`ఎవర్రా ఫోన్ లో ఉన్నదీ… మాట్లాడుతూనే వణికిపోతున్నావ్’ వివరాల కోసం అడిగాడు కులకర్ణి.
`సార్. కొంప మునిగింది. మిమ్మల్ని పాక్ ఏజెంట్ గా వాళ్లు కూడా గుర్తించారట’ షాక్ కి గురైనట్లు చెప్పాడు సెక్రటరీ.
`మళ్లీ వీళ్లెవరూ..!!’
`అల్ ఖైదా వాళ్లు’
`ఏమిటీ…అల్ ఖైదా వాళ్లా.. మధ్యలో వీళ్లెందుకు వచ్చార్రా లైన్ లోకి…’
`నాకేం తెలుస్తుందీ సార్. మీరు సదరు పుస్తకావిష్కరణ సభలో ఖుర్షీద్ మహ్మద్ కసూరీకి ఎంచెప్పారో, ఆయనేం విన్నారో…చివరకు అతగాడు ఏం చేరవేశారో నాకేం తెలుస్తుందీ, అల్ ఖైదా వాళ్ల నాయకుడు కూడా ఈమధ్యనే పుస్తకం రాశారట. దాన్ని మనదేశంలో కూడా ఆవిష్కరించాలనుకుంటున్నాడట. మీరు ఏర్పాట్లు చేయాలట. లేకపోతే….’ భయంభయంగా చెప్పాడు సెక్రటరీ.
`వద్దు, ఇక చెప్పొద్దు. చివరకు నేను అంతర్జాతీయ టెర్రరిస్ట్ రాసిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించేస్థాయికి వెళ్ళిపోయానా…. ఓర్నాయనో… శని మహా ఉచ్ఛదశలో ఉన్నాడ్రోయ్…’
ఇలా వణికి పోతుంటే మళ్ళీ ఫోన్… ఎప్పటిలాగానే సెక్రటరీ ఎత్తాడు.
`హలో..ఎవరూ, ఇండియన్ రైటర్స్ అసోసియేషన్ వాళ్లా…ఆ…ఒకే, రండి….ఉన్నారు’
`రైటర్స్ వస్తున్నారా…!?’ కాస్త ఊపిరిపీల్చుకున్నాడు కులకర్ణి.
`అవునుసార్. చాలా మంది పుస్తకాలు రాసినా, ఆవిష్కరణ సభలు పెట్టినా పెద్దగా ఆదరణ ఉండటంలేదట. పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడుకావడంలేదట. అదే మీరు నిర్వహిస్తే ఇంకు జల్లించుకునో, మట్టి పోయించుకునో, దెబ్బలు తగిలించుకునో ఎలోగా అలాగా పుస్తకావిష్కరణ సభను గ్రాండ్ సక్సెస్ చేస్తారట. దీంతో వాళ్ల పుస్తకానికి బాగా పాపులారిటీ వస్తుందట. అందుకే వస్తామంటున్నారు’
`అంటే, ఇక ఈ జన్మంతా ఇలా మరకలు పూయించుకుంటూ, దెబ్బలు తగిలించుకుంటూ బుక్స్ రిలీజ్ ఫంక్షన్స్ పెట్టిస్తుండాలా…ఓర్నాయనో…నాకెన్ని కష్టాలొచ్చాయిరో…’
చూస్తుండగానే కులకర్ణి మానసిక పరిస్థితి మారిపోయింది. విచిత్ర చేష్టలు చేయడం ప్రారంభించాడు. ఇంట్లో ఉన్న ఇంక్, నల్లపెయింట్లు తీసుకుని ఒంటినిండా పోసుకున్నాడు. ఇప్పుడాయన పూర్తిగా నల్లగా మారిపోయాడు. అలాగే బయటకువెళ్ళి నేరుగా ఓ టివీ స్టేషన్ ఎదుటున్న మర్రి చెట్టుక్రింద కూర్చున్నారు. కాసేపయ్యేసరికి అటూఇటూ పోతున్నవారు ఆయనగారి నల్లటి ఆకారం, ఆపైన ధ్యానముద్రలో కూర్చున్న భంగిమచూసి నమస్కారాలు పెట్టడం మొదలుపెట్టారు. ఈలోగా సెక్రటరీ అక్కడో తెల్లటి బోర్డు తగిలించాడు. దానిపై `మరకానందస్వామి’ అన్న నల్లటి అక్షరాలు కనిపిస్తున్నాయి. మరో బోర్డు కూడా పెట్టేశాడు. దానిపై `చిటికెడు ఇంకు జల్లండి, కడివెడు సంపదలు అందుకోండి’ అనిఉంది. దీంతో ఉన్నట్టుండి ఇంకుపెన్నులకు డిమాండ్ పెరిగిపోయింది. ఆ దారిన పోయేవాళ్లంతా స్వామివారిపై ఇంకుజల్లడం మొదలుపెట్టారు. దీంతో అదో హాట్ టాపికైపోయింది. మరకానందస్వామిపై స్పెషల్ ప్రొగ్రామ్స్ టివీలో రోజూ వస్తున్నాయి. ఈ కార్యక్రమాలకు సర్ఫ్ ఎక్సెల్ స్పాన్సర్ చేస్తోంది. ఇక ఒ ఇంక్ పెన్నుల కంపెనీ, పెయింట్స్ తయారీచేసే కంపెనీ కో స్పాన్సర్ గా ఉన్నాయి.
చూస్తుండగానే మరకానందస్వామి మహా కోటీశ్వరులైపోయారు. ఆయన తనపై పడిన మరకలను తుడుచుకునే ప్రయత్నం చేయడంలేదు. పనిలోపనిగా సెక్రటరీ ఖేల్కర్ అర్థకోటీశ్వరుడైపోయాడు.
– కణ్వస