చంద్రబాబుచాలా ఉత్సాహంతో ఉన్నారు. ఎంతగా అంటే ఆయన గాలిలో తేలిపోయేటంతగా. అలా తేలిపోతూ తేలిపోతూ ఢిల్లీకి వెళ్ళారు. సోనియా ఇంటిముందు వాలారు. తలుపుతట్టారు. ఎంతసేపైనా తలుపుతెరుచుకోలేదు. బాబులో ఉత్సాహం తగ్గిపోయింది. మూసిఉన్న తలుపువైపు చూస్తూ, తనలో తాను…
`అరే, ఏమనుకుంటున్నారు సోనియాజీ. రాష్ట్రానికి నూతన రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి మిమ్మల్ని పిలవమని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ముందు అప్పజెప్పాను. అయినా మనసు ఉండబట్టలేక నేనే ఎగురుకూంటూ వచ్చాను. తలుపు తీయండి మేడమ్… మీ ఇంటికొచ్చా, మీ నట్టింట్లో అడుగుపెడతా…’
ఇలా అంటుంటే, పక్కనే ఉన్న బాబు పర్సనల్ సెక్రటరీ జోక్యంచేసుకుంటూ…
`సార్, చివరి మాటలు మీకంతగా నొప్పవండీ, మీ బావమరిదికిసూటవుతాయ్. మనకెందుకు సార్ అంత భారీ డైలాగ్ లు. అయినా అదేమిటండీ, కాలింగ్ బెల్ ఉంటే దాన్ని నొక్కకుండా ఇలా తలుపులు ధబీధబీమని బాదుతారేంటీ…’
`అవును కదూ, కాలింగ్ బెల్ నొక్కుదాం…ఆ విధంగా ముందుకుపోదాం… ‘
`సార్, నాదో డౌట్. ఇటు సోనియాను పిలుస్తామంటున్నారు, అటు కేసీఆర్ నీ వదిలిపెట్టేలాలేరు. మిమ్మల్ని ఎలా అర్థంచేసుకోవాలో తెలియక జనం జుట్టుపీక్కుంటున్నారు’
`నిజం చెప్పమంటావా, అబద్దం చెప్పమంటావా?’
`సారీ సార్, ఈ డైలాగ్ మీ మామగారు ఎన్టీఆర్ గారికి సూటైంది. మీకు సూటవదు. అసలు విషయంలోకి రండి’
`నిజం చెప్పాలంటే ఈరోజు మనం ఇలా ఉన్నామంటే సోనియా అమ్మ దయేనయ్యా’ భావోద్వేగానికి గురయ్యారు.
`ఏంటీ! సోనియా దయా!!’ పక్కన పిడుగుపడినట్లు ఫీలైపోయాడు సెక్రటరీ.
`అవును సెక్రటరీ నేను నిజమే చెబుతున్నాను. నేను ఇవ్వాళ ఇంత స్పీడ్ గా ముందుకుపోతున్నానంటే అది సోనియా దయఉండబట్టే’
`సారూ, నాదో డౌట్. మీరు ఆహ్వానపత్రిక ఇవ్వడానికి వచ్చారా, లేక కాంగ్రెస్ పార్టీలోకి తెలుగుదేశం పార్టీని విలీనం చేయడానికి వచ్చారా ?!’
`రాజకీయాలు నీకు అర్థం కావు. చిత్రమేమంటే సోనియాగాంధీ నన్ను శత్రువుగా చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో తన పార్టీ తుడిచిపెట్టుకుపోయినందుకు ఆమెకు కోపంవచ్చి ఉండవచ్చు. కానీ, నాకు మాత్రం ఆమె శత్రువుకాదు. నాకు మేలుచేసిన దేవతయ్యా దేవత’ బాబు మరోసారి భావోద్వేగానికి గురయ్యారు.
`ఓర్నాయనో, షాక్ మీద షాక్. సోనియా మీకు దేవతా !!’
`అవును, ఈ రోజు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఉల్లాసంగా ఉన్నాను. మనసు తేలిపోతోంది. నూతన రాజధాని శంకుస్థాపన దగ్గరపడుతోంది. ఆ విధంగా మనం ముందుకుపోతున్నాం. మొన్నటిమొన్న కృష్ణాగోదావరి పవిత్ర సంగమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము. నదుల సంగమానికి శ్రీకారం చుట్టేశాము. ఆవిధంగానే ఇంకాస్త వెనక్కి వెళితే గోదావరి మహాపుష్కరాలను మహాఘనంగా నిర్వహించాము. ఇంకా వెనక్కి..మరికాస్త వెనక్కి… ‘
`అర్థమైంది సారూ, హుద్ హుద్ తుపాను తాకిడికి విశాఖ అల్లల్లాడితే దగ్గరుండి ఆదుకున్నారు. అంతకు ముందు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు’
`భేష్, సరిగానే ఆలోచించావు. ఎన్నికల్లో గెలవబట్టేగా, ఈరోజు ఇన్ని ఘనకార్యాలు చేయగలుగుతున్నాను. అంటే ఆరోజు సోనియా రాష్ట్రాన్ని విభజించబట్టేగా నాకీ సీఎం సీటువచ్చింది. అంటే సోనియా వల్లనే కదా..’
`అవును సార్. మీరు చెప్పింది నా మట్టిబుర్రకు ఇప్పుడర్థమైంది’
`అందుకే సోనియాను, రాహుల్ ని పిలుద్దామని వచ్చాను. నొక్కవయ్యా కాలింగ్ బెల్లూ…’
`ఎంటీ నొక్కేదీ … బెల్లు మ్రోగుతుందేతప్పా, తలుపు తెరుచుకోవడంలేదు. తల్లీకొడుకులు ఇంకా బిహార్ నుంచి వచ్చినట్లులేరు. ఇక వెళదాం పదండి’
ఇద్దరూ వెంటనే ఆకాశయానంచేస్తూ రయ్యిన హైదరాబాద్ లో కేసీఆర్ ఇంటికి వచ్చేశారు.
`సార్, నాదో డౌట్..’
`ఏంటో చెప్పు ‘
`ఒకరు నిప్పు, మరొకరు ఊప్పు. పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది. అలాంటిది మీరొచ్చి కేసీఆర్ ఇంటి తలుపులు కొట్టడమేమిటండీ.. ‘ సెక్రటరీ చాలా ఫీలైపోయాడు.
`చూడు సెక్రటరీ, మనిషన్నాక కాస్తంత రాజకీయాలు తెలిసుండాలయ్యా…’
మధ్యలోనే సెక్రటరీ కట్ చేస్తూ….
`సారీసార్ ఈ డైలాగ్ రావుగోపాలరావుగారికి బాగా సూటైంది. మీకవదు సారూ.. అసలు విషయం చెప్పేయండి’
`సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేనెవర్నీ?, కేసీఆర్ ఎవరు? కానీ విడిపోయిన తర్వాత ఇద్దరం సీఎంలయ్యాం. కేసీఆర్ అద్బుతంగా పోరాడారు. ఆ విధంగా ఆయన ముందుకుపోయారు. నేను కూడా ఊరుకోలేదు, నేనూ ముందుకుపోయాను. ఇలా ఇద్దరం ముందుకే పోవడంలో విజయం సాధించాము. పైకి పాము-ముంగీసల్లాఉన్నప్పటికీ మీమిద్దరం ఒకే తాను ముక్కలమయ్యా. ఒకరివల్ల మరొకరు లబ్దిపొందాం. అందుకే కేసీఆర్ తమ్ముడ్ని పిలవడానికి ఇంటికి వచ్చాను. నువ్వు నొక్కు కాలింగ్ బెల్లూ… ‘ బాబు మళ్ళీ భావోద్వేగానికి గురయ్యారు.
`ఇందాకటి నుంచీ నొక్కుతూనే ఉన్నానండయ్యా, ఆయన ఇక్కడ లేరు. ఫాం హోజ్ లో ఉన్నారట. ఎవరన్నీ కలిసే మూడ్ లో లేరని కబురొచ్చింది. గడపకు బొట్టుపెట్టి కార్డు తలుపు సందులో పెట్టేయండయ్యా..’
`భేష్. బాగుందీ, ఆ విధంగా ముందుకుపోదాం. ఇటునుంచి ఇటే మనం జగన్ ఇంటికి కూడా వెళదాం…’
`ఏంటీ!! జగన్ ఇంటికా ??’ సెక్రటరీకి పై ప్రాణాలు పైనే పోయినట్లయింది.
`సార్, ఏమన్నారూ, జగన్ ఇంటికా…??’ మళ్ళీ అడిగాడు అర్భక మానవుడు.
`అవును, జగన్ ఇంటికే వెళదాం. పాపం పిల్లవాడు, ఏపీహోదా కోసం నేను చేయాల్సిన పని అతగాడే చేస్తున్నాడు. అందుకే పిలిస్తే పోలా…’
`ఏంటీ పిలిచేది. ఆయన ఇంటిదగ్గర లేరు’
`అవును కదూ, నా ఉత్సాహంలో..నా ఉల్లాసంలో మరచిపోయాను. ఆయన దీక్షాశిబిరంలో ఉన్నారుకదూ…’
`ఇప్పుడే అందిన వార్త. ఆయన శిబిరంలో కూడా లేరు’
`ఏంటీ ! శిబిరంలో కూడా లేరా. ఆస్పత్రిలో చేర్పించారా…నాకు తెలియలేదే..’
`అదేం కాదూ, దీక్ష ఆపేసి ఓదార్పు యాత్ర ప్రారంభించారని వేగులు చెబుతున్నారు’
`ఓదార్పు యాత్రా !? ఇప్పుడెవర్నీ ఓదారుస్తారట ?’
`అదేనండీ, వేగులు చెబుతున్నదేమిటంటే, తమరు అమరావతి శంకుస్థాపనకు ఎంతో మందిని పిలుస్తున్నారుకదా…’
`అవును, పిలుస్తున్నాను. మీ ఇంటికొస్తాను, మీ నట్టింటికొస్తాను…అంటూ వెళతాను. బొట్టుపెట్టి మరీ పిలుస్తాను. ఆ విధంగా ముందుకుపోతాను, ఎవ్వరూ ఆపలేరూ, ఏమంటారు తమ్ముళ్లూ…అవునా, కాదా…’
`సార్, మీరు ఆవేశపడకండి. ఇక్కడ తమ్ముళ్లు ఎవ్వరూ లేరు. మీరేమో ఎంతోమందిని పిలుస్తున్నామంటున్నారు. కానీ, మీరు పిలవని ఆంధ్రులు చాలామందే ఉన్నారు. వాళ్లంతా మీపై అలిగారట. తీవ్రమనస్తాపం చెందారట’
`మహోత్సవానికి పిలవని వారంతా అలిగినట్లు ఎవరన్నారయ్యా?’ కంగారుపడుతూ బాబు అడిగారు.
`ఇంకెవరో అంటే ఈ దిగులంతా ఎందుకు. జగన్ గారే అంటున్నారు. మీరు పిలవలేదని కోట్లాది మంది మనస్తాపానికి గురయ్యారట. అందుకే, వారందరిని ఓదార్చడానికి ఆయనగారు బయలుదేరారట’
`అంటే మళ్ళీ…’
`అవునండయ్యా, మళ్ళీ ఓదార్పు యాత్ర ప్రారంభించారట. ప్రజల రాజధాని అని అంటున్న చంద్రబాబు మిమ్మల్ని ఎందుకు పిలవలేదూ, మీరు చాలా మనస్తాపానికి గురయ్యారూ, మిమ్మల్ని ఓదారుస్తున్నానూ…అంటూ ఊరూర తిరగబోతున్నాడాయన’ నాటకీయంగా చెప్పాడు సెక్రటరీ.
`దీక్షలో ఉన్నాడు, అందరూ అతగాడ్ని పరామర్శిస్తున్నారుకదా, ఇక నాకు ఏం ఫర్వాలేదనుకున్నా, కానీ…’
`అంతేనండయ్యా, కాలం కలసిరాకపోతే ఇలాగే అవుతుందయ్యా, శంకుస్థాపనకు మీరు ఎంచుకున్న ముహూర్తంలోనే దోషముందని ఇప్పటికే ఓ ఛానెల్ వాళ్లు డిసైడ్ అయిపోయి చర్చలు కూడా పెట్టేస్తున్నారట. మరో పక్క జగన్ సుడిగాలి ఓదార్పు యాత్రతో అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరువరకూ చుట్టుముట్టేస్తారటయ్యా..ఇంకా తాజా వార్తలేమిటంటే…’
`ఇక చాల్లే ఆపవయ్యా తాజా వార్తలు. ఇక్కడికే పొలుసుకారిపోతుంటే…’ బాబులో ఉత్సాహం ఆవిరైపోయింది. సరిగా అదే సమయంలో బడ్డీకొట్టులోని ఎఫ్ఎం రేడియోలోనుంచి పెద్దగా పాట వినిపిస్తోంది…
`అనుకున్నదొకటీ, అయినది ఒకటి, బోల్తాపడ్డావులే ….’
– కణ్వస