బాబుగారు: వరంగల్ ఉపఎన్నికల ప్రచారానికి డుమ్మా కొట్టేయగలిగాను..కానీ ఈ గ్రేటర్ ఎన్నికలకి తప్పడం లేదు…నోరు కట్టేసుకొని ప్రచారం చేస్తున్నా ఆ కేసీఆర్ మాత్రం నోరు పారేసుకొంటూనే ఉన్నాడు…వస్తే ఈ బాధ..రాకపోతే భయపడి పారిపోయానని దెప్పి పొడుపులు…ఏమిటో ఈ బాధ…కేసీఆర్ నాలికకి రెండు వైపులా పదునే…ఎంతయినా గురువుని మించిన శిష్యుడు అనిపించుకొన్నాడు…ఆ క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా నాదే…
అభ్యర్ధి: ఏమిటి సార్…ప్రచారానికి వచ్చి మీలో మీరే ఏదో మాట్లాడేసుకొంటే ఎలాగ…కాస్త నలుగురికి వినపడేలా చెప్పండి..విని జనాలు ఓట్లు వేస్తారేమో..
బాబుగారు: ఆ..ఆ..ఏమిలేదు ఆనాడు నేను వేసిన చిన్న విత్తనం ఇప్పుడు మర్రిచెట్టులాగ ఎంతగా ఎదిగిపోయిందో కదా అని సంతోషపడుతున్నానయ్యా…ఆ మర్రి చెట్టు నీడన సేద తీరాల్సి వస్తోంది తప్ప మన పచ్చ మొక్కకి నీళ్ళు పోసినా ఎదగడం లేదయ్యా…
అభ్యర్ధి: ఏమిటో సార్ మీ మాటాలు నాకు అర్ధం కావడం లేదు. విత్తనం…మర్రిచెట్టు అంటే మీరు అభివృద్ధి చేసిన హైదరాబాద్ గురించే కదా సార్..
బాబుగారు: ఆ..ఆ..అవునవును…దాని గురించే…అయినా ఇప్పుడు దాని గురించి తప్ప ఇంకా దేని గురించి మాట్లాడగలను అని మనసులో అనుకొంటూ హైటెక్ సిటీ గురించి తను ఎంత కష్టపడింది చెప్పుకొచ్చారు బాబుగారు.
అభ్యర్ధి: సార్..మీరు హైదరాబాద్ వచ్చి ప్రచారం చేసినా ప్రయోజనం ఉండదని కేసీఆర్ అంటున్నాడు…మీ స్పీచులో దానికి కాస్త ఓ కౌంటర్ వేయండి
బాబుగారు: ఆ..ఆ..ఆ సంగతి నాకు తెలుసు…ఆయనా…నువ్వు చెప్పాలా? కేసీఆర్ ని విమర్శించకపోతే ప్రసంగానికి రుచే ఉండదు..కానీ కేసీఆర్ అప్పుడే చెప్పాడు మనకి ఆప్షన్స్ ఉండవని…ఆయన మనల్ని ఎంతయినా విమర్శించవచ్చును కానీ మనం ఆయనని విమర్శించలేకపోతున్నాము…ఏమిటో…ఈ బాధ పైకి చెప్పుకోలేము…లోపల భరించలేము..తప్పదు…
అభ్యర్ధి: ఏమిటి సార్…ఏదో బాధ అంటున్నారు?
బాబుగారు: అబ్బా నువ్వుండవయ్యా…నేను ప్రచారానికి వస్తే ఆయనకి ఎందుకు అంత బాధ అనుకొంటున్నాను. మనమంటే భయం ఉండబట్టే బాధపడుతున్నాడేమో…అని అనుకొంటున్నాను..
అభ్యర్ధి: అవును సార్..అవునవును…కాస్త కౌంటర్ వేయండి సార్…లేకపోతే పరువు దక్కదు…
బాబుగారు: ఆ ఆ అలాగే…సోదర సోదరీమణుల్లారా..నేను వస్తే ఎవరో చాలా ఇబ్బంది పడుతున్నట్లు విన్నాను. కానీ మన పార్టీ పుట్టిందే ఈ గడ్డ మీద కనుక ఇక్కడికి రావద్దనడానికి ఎవరికీ హక్కు లేదు…తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను…వారికి అండగా నిలబడతాను. సింగపూర్ లో ఉంటే అక్కడకి వస్తాను…చైనా..జపాన్ దేశాలలో ఉంటే అక్కడికి కూడా వెళ్తాను. నా ప్రజలని నేనే కాపాడుకొంటానని హామీ ఇస్తున్నాను…
అభ్యర్ధి: సార్..సార్.. సింగపూర్…చైనా..జపాన్ కాదు తెలంగాణా…తెలంగాణా..అని చెప్పండి.
బాబుగారు: ఆ దానర్ధం అదే లేవయ్యా…ఈ మద్య తరచుగా ఆ దేశాలలో తిరిగివస్తుంటే ఆ పేర్లే నాలిక మీద ఉండిపోయాయి… హైదరాబాద్ లో స్థిరపడిన సోదర సోదరీమణుల్లారా… మీరు ఎవరికీ భయపడనవసరం లేదు…నిర్భయంగా తెదేపా-బీజేపీ కూటమికే ఓట్లేయండి…మన కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తే డిల్లీ నుంచి బోలెడు డబ్బు తీసుకువచ్చి హైదరాబాద్ ని ఇంకా అభివృద్ధి చేస్తాము…
అభ్యర్ధి: సార్…సార్…
బాబుగారు: అబ్బా వెనక నుండి ఎందుకయ్యా అలా గోకేస్తున్నావు…ఏమిటో చెప్పు..
అభ్యర్ధి: సార్…మీరు అమరావతికే డబ్బు తెచ్చుకోలేకపోయారు ఇంక హైదరాబాద్ కి ఎలా తెస్తారని కేసీఆర్ దెప్పుతున్నాడు సార్…మనల్ని…
బాబుగారు: ఆ..ఆ…అదీ నిజమే కదా…సోదర సోదరీమణుల్లారా… హైదరాబాద్ ని హైటెక్ సిటీగా అభివృద్ధి చేసి తెలంగాణాకి భారీగా ఆదాయం సృష్టించాను…ఆ డబ్బుతోనే హైదరాబాద్ ఇంకా ఎంతో బాగా అభివృద్ధి చేయవచ్చును…కానీ తెలంగాణా ప్రభుత్వం ఆ పని కూడా చేయలేకపోయింది…కనుక మా కూటమికి ఓట్లేసి గెలిపిస్తే హైదరాబాద్ ని అభివృద్ధి చేసి చూపిస్తాము…
అభ్యర్ధి: సార్…సార్…భలే సర్ది చెప్పుకొన్నారు సార్ మీరు నిజంగా చాలా గ్రేట్…
బాబుగారు: ఆ..ఆమాట నువ్వొకడివే…అంటున్నావయ్యా…ఆ జగన్ చూడు..నన్ను ఎప్పుడూ తిట్టినా తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉంటాడు..పైగా ఆడవాళ్ళని మనం ఏమీ అనలేమని ఆ రోజా చేత…ఈశ్వరి చేత నానా తిట్లు తిట్టిస్తున్నాడు…అక్కడ చూస్తే అతను…ఇక్కడ ఇతను. బాబోయ్ ఆ టార్చర్ భరించలేకుండా ఉన్నాను…
అభ్యర్ధి: సార్…సార్…గ్రేటర్ ఎన్నికల గురించి మాట్లాడండి…ముందు..
బాబుగారు: ఆ..ఆ..సోదర సోదరీమణుల్లారా…