ఈమధ్య రావు హేమవాళ్లింటికి వెళ్ళాడు. ఇంట్లో హాలు మధ్యలో నేలమీద కూర్చుని హేమ భోరున ఏడుస్తోంది. చాలాకాలంతర్వాత వెళ్ళిన రావుకి ఏదోజరిగే ఉంటుందన్న అనుమానం వచ్చేసింది. హాల్లో అప్పటికే నలుగురైదుగురు కూర్చీల్లో మౌనంగా కూర్చున్నారు.
`డౌటే లేదు, ఎవరో టపా కట్టేశార’నుకుంటూ తాను ఓ కుర్చీలో కూర్చుంటూ మౌనంగా ఉండిపోయాడు. హేమ ఏడుపుగొంతుకతో చుట్టుపక్కిళ్లవాళ్లను పట్టించుకోకుండా ఇలా చెప్పుకుపోతోంది…
`మీరైనా చెప్పండి అన్నయ్యగారూ, నేనేమైనా మణులు అడిగానా, రత్నాలు అడిగానా, లేదే, నగలు చేయించమని గట్టిగా అడగలేదే, పుట్టినరోజునాడు కేక్ తీసుకురాకపోయినా సరిపెట్టుకున్నానే, అలాంటిది….’
మాట మధ్యలో ఆగిపోయి, దుఃఖం ముంచుకువచ్చింది. కళ్లుతుడుచుకుంటూ, ముక్కుచీదుకుంటూ మళ్ళీ అందుకుంది హేమ…
`నాకొచ్చిన కష్టం పగవారికి కూడా రాకూడదు అత్తయ్యగారూ, మీరు రోజూ చూస్తునే ఉన్నారుగా, నేను ఎంత కష్టపడతానో… పక్కింట్లో ఉన్న మీకు తెలుసు పిన్నిగారూ, కానీ కనీసం కట్టుకున్నవాడికి కూడా తెలియకుండాపోయింది. ఉన్నట్టుండి, ఎవ్వరికీ చెప్పకుండా తనదారితానుచూసుకున్నాడు..’
`కన్ఫర్మ్..నో డౌట్, హేమ హస్బెండ్ పోయినట్టే… ‘ అని రావు లోపల అనుకుంటూ, పైకి…
`చూడు హేమూ, ఇలాంటప్పుడే గుండెదిటవుచేసుకోవాలి. హఠాత్తుగా తనదారి తానుచూసుకోవడం నీకొచ్చిన పెద్దకష్టమే ‘ మాటల్ని కూడదీసుకుంటూ అన్నాడు.
అంతే, హేమ ఒక్కసారిగా రావువైపు చూసింది. కళ్లలో కోపం ఎగదన్నింది.
`ఓరే, ఎంట్రా మాట్లాడుతున్నావ్. నిన్న నరికేస్తా, ఏమనుకుంటున్నావ్, మా ఆయిన పోయాడనుకున్నావా? ‘
రావు అయోమయంలో పడిపోయాడు. అయినా ధైర్యం తెచ్చుకుంటూ….
`మరి అదేగా నువ్వుచెబుతున్నదీ ! ‘
రావుదగ్గర ఉన్న చనువుతో హేమ
`నీ బొంద… ఆయనకేంకాలేదు. నా ఏడుపుకు నువ్వనుకుంటున్నది కారణంకాదు ‘
ఈసారి రావుకు డబుల్ ఆశ్చర్యం కలిగింది.
`మరేంటే నీ ఏడుపు, ఎందుకు అలా ఏడుస్తావ్. చెప్పితగలడు ‘ ఆశ్చర్యంనుంచి కోపంతో తిట్టేశాడు.
`చూడండి పిన్నిగారూ, చూడండి అన్నయ్యగారూ, మీకున్న ఫేస్ బుక్ నాలెడ్జ్ ఈ రావుగాడికి లేకపోయే, నా ఏడుపంతా నా పోస్ట్ లకి లైక్ లూ, కామెంట్స్ రావడంలేదనే ‘
అంతవరకూ సీను గమనిస్తున్న పిన్నిగారు జోక్యం చేసుకుంటూ-
`నీ అసాధ్యంగూలా, నీ ఏడుపు వినిపిస్తుంటే, దోసెలు వేసేదాన్నికాస్తా ఆపని ఆపేసి పరిగెత్తుకువచ్చాను. ఇదెక్కడి విడ్డూరమే…’
`అదేమిటి పిన్నిగారూ, మీరు కూడా నన్ను ఆడిబోసుకుంటే ఎలా. నాలుగురోజుల కిందట అందరికీ నచ్చుతుందని ఒక బంగారంలాంటి పోస్ట్ పెట్టాను. కనీసం వందలైక్ లూ, పదోపరకో కామెంట్స్ వస్తాయని గంపెడంత ఆశపెట్టుకున్నా..కానీ ఏదీ ఒక్క కామెంట్ రాలేదు. కామెంట్ పోతేపోనీ, కనీసం లైక్ అన్నా చేసిచావలేదీ ఈ ఫేస్ బుక్ ఫ్రెండ్స్. ఇదిగో , ఈ రావుగాడుకూడా లైక్ చేసిచావలేదు. ఒక్కలైకూలేని బతుకు ఉన్నాఒకటే, పోయినా ఒకటే…అయినా అందరికీ అంత పరాయిదాన్నయ్యానా? మొన్నటికిమొన్న కొత్తచీర కట్టుకుని సెల్ఫీతీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే, దానికీ ఉలుకుపలుకూలేదు. నిన్నటినిన్న ఫ్రెండ్ షిప్ డే నాడు కష్టపడి మైసూర్ జిలేబీచేసి పోస్ట్ చేస్తే ఒక్కడిలో ఉలుకూపలుకులేదు. వీళ్లదిమ్మడ, వీళ్ల ఫేస్ బుక్ అకౌంట్లు హాకవ్వా, వైరస్ తెగులుపుట్టా….’
పిన్నిగారు మళ్ళీ జోక్యం చేసుకుంటూ..
`ఎందుకమ్మా అంతలా తిడతావు. ఏదో పనిఒత్తిడిలో ఉండి లైక్ లు కొట్టిండరూ.. ‘
`అవునవును, అంతే హేమూ, లేకపోతే కొట్టమా… ‘ రావు సమర్ధింపుగా అన్నాడు.
`ఎంత పనిఒత్తిడిలోఉన్నా లైక్ కొట్టడానికి టైమ్ లేదా, కాదండీ పిన్నిగారూ టైమ్ లేకకాదు, వీళ్లకి నామీద జెలసీ. నేను రోజుకు ఇన్నేసి పోస్టులు పెడుతున్నానని కోపం. పోస్టులు పెట్టడం ఈమూకకు చేతకాదూ, పైగా జెలసీఒకటి. అయినా ఎవర్ననిఏంలాభంలేండీ, నా అదృష్టంఅలాఉంది. కనీసం మా ఆయనైనా లైక్ కొట్టలేదు. ఇంట్లోనే శత్రువును పెట్టుకుని ఊరిజనాన్ని చూసి భయపడిందట నాలాంటిదే అందట నాలాంటిదే..’
అంతలో హేమకళ్లలో క్రోధం చోటుచేసుకుంది.
`ఉండు వీళ్లపనిపడతా, అందర్నీ ఫ్రెండ్స్ లిస్ట్ నుంచి తీసిపారేస్తా. పీడాపోతుంది. కొత్త ఫ్రెండ్స్ తో కామెంట్సూ, లేకులూ పెట్టించుకుంటూ….హీహ్హీహ్హీహ్హీహ్హీహ్హీ… ‘
అంతలో హేమ హస్బెండ్ ఓ డాక్టర్ని వెంటబెట్టుకుని వచ్చాడు. వస్తూనే…
`సారీ, మీ అందరికీ శ్రమఇచ్చినందుకు. హేమూకి ఈమధ్య ఆరోగ్యం కాస్తబాగోలేదు…అంతే ‘ అంటూ తెగబాధపడిపోయాడు.
రావు అందుకుంటూ.. `కాస్తకాదు, ఓవర్ డోస్ లో ఉంది’
డాక్టర్ ఆమెను టెస్ట్ చేసి-
`సో, ఇది ఆ జబ్బే కన్ఫర్మ్ ‘ అన్నాడు.
`ఏ జబ్బు డాక్టర్’ – దాదాపుగా అందరూ కలిసే అనేశారు.
`ఫేస్ బుకో ఫ్రెనియా – అంటే ఫేస్ బుక్ పట్ల విపరీతమైన మోజు పెట్టుకుంటే కలిగే మానసిక జబ్బన్నమాట. ఈ జబ్బు లక్షణాలేంటంటే…’
`మీరు ప్రత్యేకంగా చెప్పడమెందుకు డాక్టర్. ఆ సీనంతా అంతా చూశాము ‘ రావు అడ్డుతగులుతూ అన్నాడు.
`మరి ఈ జబ్బుకు మందులేదా డాక్టర్’ – పక్కింటి అన్నయ్యగారడిగారు.
`దీనికి ఇంకా మందుకనిపెట్టలేదు’ డాక్టర్ చావుకబురుచల్లగా బయటపెట్టాడు.
పక్కింటి పిన్నిగారు అందుకుంటూ –
`ఫేస్ బుక్ కనిపెట్టినవాడే ఈ జబ్బుకీ విరుగుడు కనిపెడతాడేమో…’
ఆమె తేలిసిఅన్నా, తెలియక అన్నా, సీరియస్ వాతావరణం ఈ మాటతో తేలికపడింది.
కానీ, అంతలో హేమ ఛటాలునలేచి మొబైల్ తీసుకుని ఫేస్ బుక్ లో దూరిపోయింది. ఆమె కళ్లు దేనికోసమో ఆత్రంగా ఎదురుచూస్తున్నట్టున్నాయి.
– కణ్వస