చేతిలో మైకు ఉంది కదా.. అని ఏది పడితే అది మాట్లాడకూడదు. పైగా సోషల్ మీడియా ఎక్కువైపోయింది. మీమ్స్, ట్రోలింగ్స్… జోరు పెరిగిపోయింది. ఎవరు దొరుకుతారా? వాళ్లపై పంచులు వేసేద్దామా? అని జనాలు కాపుకాచుకుని కూర్చున్నారు. ఇలాంటి సమయంలో మరింత ఆచి తూచి మాట్లాడాలి. ఇది తెలియకే.. మొన్నటికి మొన్న విశ్వక్ సేన్ దొరికిపోయాడు. `పాగల్ సినిమా హిట్టవ్వకపోతే.. నా పేరు మార్చుకుంటా` అని భారీ స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆ సినిమా ఫలితం తేడా చేసేసింది. దాంతో `విశ్వక్ సేన్ నామకరణ మహోత్సవం ఎప్పుడు` అంటూ జనాలు ఆరా తీస్తూ.. ఆడేసుకుంటున్నారు.
ఇప్పుడు శ్రీవిష్ణు కూడా విశ్వక్ బాటలోనే నడుస్తూ దొరికిపోయాడు. శ్రీవిష్ణు కొత్త సినిమా `రాజ రాజ చోర` ఈవారంలోనే విడుదల అవుతోంది. ఈసినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా.. శ్రీవిష్ణు ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేశాడు. `నవ్వలేక మాస్కులు ఊడిపోతాయి. ఎందుకైనా మంచిది రెండు మూడు మాస్కులు ఎక్కువ తెచ్చుకోండి` అంటూ ప్రేక్షకుల్ని ఊరించే ప్రయత్నం చేశాడు. అయితే దీనికి సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం మొదలైంది. `మాస్కులు చాలా.. డైపర్లు అక్కర్లెద్దా` అంటూ శ్రీవిష్ణుకి కౌంటర్లు విసురుతున్నారు జనాలు. `మొన్న విశ్వక్ కూడా అలానే అన్నాడు. దొరికిపోయాడు. నువ్వు కూడా మొదలెట్టావా` అంటూ… ఈ కామెంట్లని కామెడీ చేస్తున్నారు. నిజానికి.. శ్రీవిష్ణు ఎప్పుడూ లో ప్రొఫైల్ లోనే ఉండడానికి ఇష్టపడతాడు. తన గురించి గానీ, తన సినిమా గురించి గానీ ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడడు. కానీ… `రాజ రాజ చోర`పై కాస్త గట్టినమ్మకం పెట్టుకున్నట్టు ఉన్నాడు. అందుకే… మాస్కులు ఊడిపోయేలా నవ్వుతారు.. అంటూ కామెంట్ చేశాడు. మరి అంత కామెడీ ఈ సినిమాలో ఉందా, లేదా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.