మా ఊర్లో టీ కొట్టు నడుపుకునే కోటిగాడు ఉన్నట్టుండి నాయకుడైపోయాడు. టీ కలపడం తప్ప మరో పని చేతకాని కోటిగాడు అలావెళ్ళి రాజకీయ రియాల్టీ షోలో పాల్గొని ఇలా సడన్ గా నాయకుడై తిరిగిరావడం ఊర్లోకెళ్ళా పెద్ద వింతైపోయింది. అదే టీకొట్లో అసిస్టెంట్ గా ఉండే కుర్రాడ్ని అంతా అరకోటిగాడని పిలిచేవారు. కోటి లీడరైపోవడంతో, ఇప్పుడు అరకోటి గాడే టీ కొట్టు నడుపుతున్నాడు.
ఈమధ్య అరకోటిగాడి ఆలోచనలన్నీ రాజకీయాలచుట్టూ తిరుగుతున్నాయి. కోటిగాడిలాగా తానూ రాజకీయాల్లో చేరి పెద్ద నాయకుడ్ని అయిపోవాలని తెగ కలలు కంటున్నాడు.
టీ అమ్ముకునే వాళ్లు నాయకులు కాలేరన్న అభిప్రాయం తప్పని కోటిగాడు సారీ, లీడర్ కోటేశ్వరరావుగారు నిరూపించడంతో ఊర్లో అరకోటిగాడికే కాదు, అనేకమందికి తామూ నాయకులుగా మారిపోవాలని తెగ ఉబలాటపడిపోతుండేవారు.
నాయకునిగా మారిన తర్వాత కోటి ఓరోజు సొంతూరు వచ్చాడు. ఇదే మంచి సమయమనుకున్న అరకోటి తన దుకాణాన్ని ముందుగానే కట్టేసి, లీడర్ కోటి ఉండే బసకు వెళ్ళాడు.
లీడర్ కోటి : ఆఁ… ఎవరూ, అరకోటా… రారా, వచ్చి ఇలా కూర్చో. ఏమిటీ విశేషాలు ?
అరకోటి : అన్నా నాదో సందేహం.
లీడర్ కోటి : చెప్పరా, నా దగ్గరెందుకు మొహమాటం. టీ కొట్టు ఎలా నడుస్తున్నదిరా?
అరకోటి : ఆఁ ఏముందన్నా, నీకు తెలియంది. రోజంతా టీకాస్తే రెండు మూడొందలు మిగలడంలేదు. మధ్యలో ఫ్రీ ఖాతాలెన్నో ఉంటాయికదా…నీకు తెలియందేముందీ…
లీడర్ కోటి : (విసుగ్గా) ఆ సర్లే, మళ్ళీ ఆ పాతజ్ఞాపకాలు గుర్తుచేయకు. ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పు. అవతల నాకు మీటింగ్ ఉంది.
అరకోటి : ఏం లేదన్నా, నాకూ లీడర్ కావాలని ఉందే.
లీడర్ కోటి : అయిపో, దాన్దేముందీ. నేనేమీ అడ్డుకోవడంలేదే…
అరకోటి : అదే అన్నా, ఎలా లీడర్ కావాలో కాస్త మంత్రోపదేశం చెయ్యన్నా.
లీడర్ కోటి : (చిరాగ్గా) మంత్రోపదేశం ఏంట్రా, నీ బొంద.
అరకోటి : అదే అన్నా, మన ఊర్లో అంతా చెప్పుకుంటున్నారు. నీవేదో రాజకీయ రియాల్టీ షోకి వెళ్ళావనీ, బయటకు రాగానే ఇలా లీడరైపోయావని…(నసిగాడు)
లీడర్ కోటి : (సంతోషంగా) అవున్రా, రాజకీయ రియాల్టీ షోకి వెళ్ళకపోతే ఇప్పటికీ నేనూ నీలాగానే టీ అమ్ముకుంటూ బతికేవాడ్ని.
అరకోటి : (బతిమిలాడుతూ) అన్నా, ఆ రియాల్టీ షో ముచ్చట్లు చెప్పవా ?
లీడర్ కోటి : (ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతూ) చూడు అరకోటి … ఇది చాలా కష్టమైన రియాల్టీ షో. చాలా సీక్రెట్ గా నిర్వహిస్తుంటారు. ఎంపిక చేయడానికే చాలా తతంగం ఉంటుంది. ముందుగా ప్రిలిమనరీ పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత మెయిన్ పరీక్ష , ఇంటర్వ్యూ గట్రా ఉంటాయి. ఎంపిక చేసిన తర్వాత మన కళ్లకు గంతలుకట్టి కారులో చాలాదూరం తీసుకువెళతారు. అక్కడ నన్ను ఓ పెద్ద చెట్టునీడన దింపేసి కారు వెనక్కి వెళ్ళిపోయింది. అక్కడ జనసంచారమే లేదు. పులులూ, పాములూ ఉంటాయేమోనని భయమేసింది.
అరకోటి : అమ్మో , అప్పుడేం చేశావ్ ?
లీడర్ కోటి : (విసుగ్గా) మధ్యలో నన్ను ఆపకు. ఏం చెబుతున్నాను… ఆఁ… అప్పుడు అటూఇటూ జాగ్రత్తగా చూశాను. ఓ చెట్టు కొమ్మకి రెడ్ కలర్ లో యారో మార్క్ తగిలించి ఉంది. అంటే అటే రాజకీయ రియాల్టీ షో జరిగేదన్న విషయం అర్థమైంది. అటుగా వెళితే ఓ పెద్ద భవంతి ఉంది. నెమ్మదిగా లోపలకు వెళ్ళాను. అక్కడ ఓ పెద్ద మిషన్ నన్ను స్కాన్ చేసి లోపలకు తోసేసింది. లోపల చాలా గదులున్నాయి. కానీ ఒక్క గది తలుపులు మాత్రమే తెరిచి ఉన్నాయి. అలా తెరిచిఉన్న గదిలోకి వెళ్ళాను. అంతే…
అరకోటి : (భయంగా) అమ్మో , ఏమైందీ ?!
లీడర్ కోటి : ఆ గదిలో చుట్టూ అమ్మాయిలున్నారు. నేను వారిని ఎగాదిగా చూస్తుంటే ఒక వ్యక్తి వచ్చి షర్టు, ప్యాంట్ తీసేయమన్నాడు. డ్రాయర్ తో నిలబడమని చెప్పాడు. నాకు ఆశ్చర్యమేసింది. దానికి తోడు బోలెడు సిగ్గేస్తోంది. అమ్మాయిలు పకపకా నవ్వుతున్నారు. సరే, ఏదైతే అది అవుతుంది, డ్రాయర్ తో నిలబడ్డాను. అప్పటి నా పరిస్థితి నిండా మునిగాక చలేమిటన్నట్టుగా ఉంది. నాలో సిగ్గు పోయింది. తేరపారా అమ్మాయిల వైపు చూస్తూ వారితో పాటు నవ్వడం మొదలుపెట్టాను. కాసేపటికి విషయం అర్థమైంది. అక్కడున్నది నిజంగా అమ్మాయిలు కారు. వారు అమ్మాయిల డ్రెస్ లో ఉన్న రోబోలు. ఆ వెంటనే ఇందాక వచ్చిన వ్యక్తే మళ్ళీ వచ్చి డ్రెస్ వేసుకోమని చెప్తూ, ఓ కాగితం ముక్క చేతిలో పెట్టాడు. డ్రెస్ వేసుకుని ఆ కాగితం వైపు చూశాను. అందులో – నువ్వు ఈ టెస్ట్ లో పాసయ్యావని ఉంది. ఆ టెస్ట్ పేరు `సిగ్గు వదిలేయ్’. అంతలో పొలిటికల్ టోపీలాంటిది పెట్టుకున్న మరో వ్యక్తి వచ్చి నా భుజం తడుతూ, `నీకు మంచి భవిష్యత్తు ఉందోయ్. `సిగ్గు వదిలేయ్’ టెస్టులో బాగానే మార్కులు కొట్టేశావ్. రేపు నువ్వు రాజకీయ నాయకుడివి అయితే, ముందుగా వదిలేయాల్సింది ఈ సిగ్గునే. అందుకే ఈ టెస్టు… చూడు రేపు నువ్వు ఏదైనా కేసులో ఇరుక్కుని అరెస్ట్ అయ్యావనుకో, అందరూ చూస్తుండగా పోలీస్ జీప్ ఎక్కాల్సి వచ్చిందనుకో అప్పుడు ఈ టెస్ట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట..ఒకే, ఆల్ ద బెస్ట్ ‘ అంటూ వెళ్ళిపోయాడు. నేను గది చూట్టూ చూస్తే మరో గదికి ఎంట్రీ ఉంది. వెంటనే ఆ గదిలోకి వెళ్ళాను.
అరకొటి : అక్కడేముంది గురువా…?
లీడర్ కోటి : రెండవ గదిలోకి ఎంటరయ్యాను. కానీ లోపల అంతా చీకటి. ఎవరో మూలుగుతున్నట్టు, మరెవరో ఏడుస్తున్నట్టు, ఇంకెవరో దభీదభీ బాదుతున్నట్టు శబ్దాలు. చిన్న రెడ్ లైట్ వెలుగుకి కళ్లు అలవాటుపడ్డాయి. అటూఇటూ చూశాను. భయం వేసింది. పైకప్పుమీద నుంచి ఏవో ఆకారాలు వ్రేలాడుతున్నాయి. అవి నామీద పడేటట్టున్నాయి. పక్కకి చూశాను. గోడవారగా ఓ స్త్రీ జుట్టు విరబోసుకుని నా వంక తీక్షణంగా చూస్తోంది. వెంటనే నా వెంటబడింది. నేను పరిగెత్తబోతే ఎదో కాలికి అడ్డు తగలడంతో క్రిందపడ్డాను. నేను పడింది ఓ శవంమీద అన్నట్టు అనిపించింది. ఇక భయపడి లాభంలేదనుకున్నా, మొండితనం ఆవహించింది. పెద్దగా అరవడం మొదలుపెట్టాను… `ఎవర్రా మీరు…నా వెంట పడ్డారేంట్రా…చూడండీ, నన్నెవరూ ఏమీ చేయలేరు. మీ వికృత చేష్టలకు నేను బెదరను. ఏం చేసుకుంటారో చేసుకోండి.. ‘ ఇలా అనేసరికి క్షణాల్లో చీకటి మాయమై అక్కడ పెద్ద వెలుతురు వ్యాపించింది. అప్పటివరకూ ఉన్న ఆకారాలు మాయమయ్యాయి. ఇంతలో ఒకతను వచ్చి కాగితం ముక్క ఇచ్చి భుజం తట్టాడు. కాగితం మీద ఏం రాసుందా? అని చూశాను. `భయం’ టెస్టు పాస్- అని రాసుంది. వచ్చిన వ్యక్తి నన్ను ప్రశంసిస్తూ, `చూడబ్బాయ్, రాజకీయాల్లో ఎదగాలంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ భయపడకూడదు. ఎన్ని కుట్రలు పన్నినా, ఎంత మంది ప్రాణాలు తీసినా పాపభయం ఉండకూడదు. అందుకే ఈ భయం టెస్టు పెట్టేది. ఆల్ ద బెస్ట్ ‘ – అంటూ వెళ్ళిపోయాడు. ఈ రియాల్టీ షో పెట్టిన ఉద్దేశం పూర్తిగా అర్థమైంది. రాజకీయాల్లో ఎదగాలంటే కావాల్సిన ముఖ్యలక్షణాలపై ఇలా రియాల్టీ షో పెట్టారనీ. సిగ్గుశరం-అభిమానం ఉండకూడదనీ, పాపభయం అంతకన్నా తగదనీ చెప్పడానికే ఈ టెస్టులు పెట్టారన్న సంగతి తెలిసింది. ఇకపై ఏముంటాయన్న ఉత్సుకతతో మరో గదిలోకి వెళ్ళాను.
అరకోటి : అక్కడేముంది గురువా !
లీడర్ కోటి : చెబుతా విను… ఈసారి నేను అడుగుపెట్టిన గది చాలా విశాలంగా ఉంది. అక్కడ అనేక బల్లలపై వీడియో గేమ్స్ లాంటివి ఉంచారు. తేరపారా చూస్తే అర్థమైంది. ఆ గేమ్ లన్నీ స్కామ్ ల పేరుతో ఉన్నాయి. ఒకటేమో జీపుల కుంభకోణం. ఎప్పుడో 1948 నాటి స్కామ్ ఆధారంగా తయారు చేసిన గేమ్ లా ఉంది. ఇది 80లక్షల స్కామ్ అని రాసి బోర్డు పెట్టారు. సరే గేమ్ స్టార్ట్ చేశాను. జీపు అమ్మకాల వ్యవహారం, విదేశీ కంపెనీల చొరవ వంటి ఆసక్తికరమైన అంశాలతో స్కామ్ ఆట సాగింది. నేను గెలిచాను. ఆ పక్కన మరో స్కామ్ గేమ్…దీని పేరు బోఫోర్స్ స్కాండల్ గేమ్. పేరుబడ్డ స్కామ్ కాబట్టి, విషయం జ్ఞానం ముందే తెలుసుకున్నాను కనుక ఈ గేమ్ లో కూడా గట్టెక్కాను. అటు తర్వాత ఎయిర్ బస్ స్కామ్ ఆటలో కూడా గెలిచాను. ఆ తర్వాత వరుసుగా గడ్డి స్కామ్, బొగ్గు స్కామ్ గేమ్ ల్లో గెలుచుకుంటూ చివరకు `వ్యాపం’ నరహంతక కుంభకోణం ఆటలోకి వచ్చాను. ఇది చాలా ఆసక్తిగా సాగింది. పుర్రెలతో ఆట ఇది. పెద్ద బుట్ట పెట్టారు. ఆ బుట్టలోకి ఎన్ని పుర్రెలను ఏరుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి చీకటి గదిలో త్వరత్వరగా పారేయడమే ఆట. నేను బాగానే ఆడాను. అంతే, అంతకుముందులాగానే ఒక వ్యక్తి వచ్చి స్లిప్ ఇచ్చాడు. నేను ఈ పరీక్షలో కూడా పాసయ్యాను. వచ్చినతను నవ్వుతూ… మీరు ఘటికులు సార్. చాలా బాగా స్కోర్ చేస్తున్నారు. రేపు మీరు నాయకులైన తర్వాత ఎలాగో ఏదో ఒక స్కామ్ లో చిక్కుకుంటారు. అప్పుడు స్పోర్టీవ్ గా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇది ఏర్పాటుచేశారు. `స్కామ్ వీరుడు’గా ఎదగాలంటే ఇలాంటివన్నీ ఆడాలి సార్.. ఆల్ ద బెస్ట్ …అంటూ వెళ్ళిపోయాడు.
అరకోటి : (టెన్షన్ తో…) ఇంకా ఎన్నిగదులున్నాయ్ అన్నా…? నువ్వు ఎప్పుడు లీడరైపోయావో అది చెప్పు??
లీడర్ కోటి : దగ్గరకు వచ్చేశాము. ఆ తర్వాత ఇంకో గదిలోకి వెళ్ళాను. అక్కడ నన్ను చాలా మంది పలకరిస్తూ, మీరు నాయకులైపోయారంటూ ఉబకేశారు. నన్ను రాజసింహాసనం మీద కూర్చోబెట్టారు. సకల మర్యాదలు చేశారు. నేను ఆనందడోలికల్లో తేలిఆడుతుంటే , అంతలో రౌడీల్లాంటి నలుగురు వచ్చేసి నన్ను పక్కకు తోసేసి సింహాసనాన్ని లాక్కెల్లారు. ఇలా వచ్చిన పదవి అలా జారిపోయిందేనన్న దిగులు పడ్డా. ఆ వెంటనే తేరుకుని నా అభిమానుల సపోర్ట్ తో నేను తిరుగుబాటు చేసి మళ్ళీ నా కుర్చీ నేను తెచ్చేసుకున్నాను. అంతే, మళ్ళీ కాగితం ముక్క నా చేతుల్లోకి వచ్చి వాలింది. చూశాను. ఈ గేమ్ పేరు `ఉల్టా పుల్టా’ అట. పైకి ఎదిగినా, క్రిందకు దిగజారినా రాజకీయాల్లోంచి పక్కకు జారకూడదన్న లక్షణంతో ఈ గేమ్ పెట్టారు. ఆ తర్వాత మరో గదికి వెళితే అక్కడ ఉన్నట్టుండి రోగం వచ్చిన వాడిలా నటించమన్నారు. నేను అలాగే నటించాను. ఎందుకని అడిగితే, `రేపు నువ్వు అరెస్ట్ కాబోతున్నావని తెలియగానే నీకు గుండెజబ్బో, మరేదో పెద్ద జబ్బో వచ్చినట్టు నటించాలి. లేకపోతే వెంటనే జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది. అందుకే ఈ పరీక్ష ‘ అన్నారు వాళ్లు.
అలా ఇంకా కొన్ని పరీక్షలు అయ్యాక ఓ పెద్దాయన వచ్చి – `భేష్ కోటిగారు మీరు ఇవ్వాళ్టి నుంచి రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణాలన్నీ మీకు అబ్బాయని గ్రహించండి. సిగ్గులేకుండా, మానాభిమానాల గురించి పట్టించుకోకుండా, ఎలాంటి భయాలు లేకుండా, కుంభకోణాలను ఆటగా తీసుకుంటూ మందుకుసాగే వాడే ప్రస్తుత కాలపు నిజమైన నాయకుడు. అరెస్టయినా, సీబీఐ విచారణ చేపట్టినా, లక్షల కోట్ల కుంభకోణాల్లో చిక్కుకున్నా చెక్కుచెదరని నవ్వుతో ఓటర్ల ముందు వాలేవాడే నేటి నాయకుడు. స్థితప్రజ్ఞత అని పెద్దలు చెబుతుంటారు చూడు ఆ లక్షణం నీకు మరోలాగా అబ్బిందన్నమాట. ఇక నీకు డోకా లేదు. వచ్చే ఎలెక్షన్స్ లో నిలబడండి. విజయోస్తు…’ అంటూ దీవించి బయటకు పంపించారు.
అరకోటి : (అమాయకంగా) ఈ మొత్తం రియాల్టి షోలో ప్రజలకు మేలు చేయాలన్న గేమ్ పెట్టలేదా అన్నా ?
లీడర్ కోటి : (విసుక్కుంటూ) ఛత్ , ఇంత చెప్పినా ప్రజలకు మేలంటావేంట్రా… ఇక నీకు టీ కొట్టే దిక్కు. నువ్వు రాజకీయ నాయకుడిగా ఎప్పటికీ ఎదగలేవు… పో..పోపో…అవతల నాకు మీటింగ్ కు టైమైంది.
– కణ్వస