రేపల్లె నియోజకవర్గం నేతలతో జగన్ సమావేశం పెట్టి తన పాత క్యాసెట్ వినిపించారు. కానీ ఎదురుగా ఉన్న వారు ఎవరో తెలుసుకుని ఆయన బీపీ తెచ్చుకున్నారు. నియోజకవర్గ ఇంచార్జ్ గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థితో పాటు ఒక్క ఎంపీపీ వచ్చారు. అంతే ఇక స్థానిక సంస్థల్లో కూడా ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులు ఎవరూ రాలేదు. అక్కడా ఇక్కడా పార్టీ కార్యకర్తల్ని పోగేసి తీసుకు వచ్చారు. కనీసం తన హాల్ పట్టేంత మంది అయినా వార్డు మెంబర్లను తీసుకురాలేకపోయారని జగన్ ఫీలయ్యారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
స్థానిక సంస్థల మొత్తం వైసీపీ క్యాడరే ఉంది. స్థానిక ఎన్నికలను అత్యంత ఘోరంగా నిర్వహించిన జగన్ … అన్ని చోట్లా ఏకగ్రీవాలతో తమ ఖాతాలో వేసుకున్నారు. బెదిరించి గెలిచారు. అలా గెలిచిన వారంతా ఇప్పుడు వైసీపీలో ఉండటం లేదు. భయంతోనో…. పదవి పోతుందన్న కారణంతోనో వైసీపీకి దూరంగా ఉంటున్నారు. వారెవరూజగన్ మీటింగ్లకూ రావడం లేదు. ఒక్క రేపల్లే కాదు ప్రతి నియోజకవర్గంలో అదే పరిస్థితి. క్యాడర్ ఇంత ఘోరంగా ఇనాక్టివ్ కావడంపై వైసీపీ వర్గాలు కూడా విస్మయానికి గురవుతున్నాయి.
అధికారంలో ఉన్నప్పుడు జగన్ కార్యకర్తల్ని పట్టించుకోలేదు. ఆర్థికంగా కూడా అణగదొక్కేశారు. పార్టీ పరంగా ప్రభుత్వపరంగా చిన్న సాయం చేయలేదు. అంతా వాలంటీర్ల చేతికే ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ కార్యకర్తకు గుడ్ బుక్ పేరుతో కబుర్లు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవరైనా నమ్ముతారో లేదో కానీ… జగన్ మాత్రం… కళ్లార్పకుండా ఎలా ఒకే విషయాన్ని పదే పదే ఎలా చెప్పగలరో అలా చెబుతున్నారు. గుడ్ బుక్లు ఏమీ ఉండవని.. జగన్ గురించి తెలిసిన వారు సెటైర్లు వేసుకుంటున్నారు.