ఏపీలో తెలుగుదేశం పార్టీ గెలిచి ఉంటే లోకేష్‌ను ఎంత పొగిడేవారో కానీ.. ఇప్పుడు టీడీపీ ఘోరపరాజయం పొందడంతో… ఆ క్రెడిట్ మొత్తాన్ని లోకేష్ ఖాతాలోనే వేస్తున్నారు. టీడీపీలో ఉండి ఏమీ మాట్లాడలేరు కాబట్టి .. బయటకు వెళ్లిన తర్వాత తమ విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. లోకేష్‌ను మాత్రమే టార్గెట్ చేసుకుంటున్నారు. బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో అత్యధికులు కారణంగా లోకేష్ నే చూపించినట్లు గాప్రచారం జరిగింది. కానీ బయటకు చెప్పలేదు. ఇప్పుడు… ఆ నలుగురి ప్రొద్భలంతో.. బీజేపీలో చేరుతున్న టీడీపీ నేతలు మాత్రం.. లోకేష్‌ను టార్గెట్ చేయడానికి మొహమాట పడటం లేదు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరీ.. బీజేపీలో చేరిన బాపట్ల నేత అన్నం సతీష్ ప్రభాకర్… లోకేష్ వల్లే.. టీడీపీ ఓడిపోయిందని తీర్పునిచ్చారు.
ఎందరో నాయకులు లోకేష్ కారణంగా టీడీపీలో ఇబ్బంది పడుతున్నారన్నారు. లోకేష్ ఆధ్వర్యంలో పని చేయడం ఇష్టంలేకే టీడీపీకి రాజీనామా చేశానని ప్రకటించుకున్నారు. లోకేష్ వల్లే చంద్రబాబు నిట్టనిలువునా మునిగారని… లోకేష్ కారణంగానే త్వరలో టీడీపీ పూర్తిగా ఖాళీ కాబోతోందని జోస్యం చెప్పారు. లోకేష్ చేసిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో ఐటీ శాఖలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని… ఈ విషయంలో రెండు రోజుల్లో సీఎం జగన్‌ను కలుస్తానని కూడా ప్రకటించారు. కేంద్రంతో మాట్లాడి సీబీఐ విచారణ కోరతామని చెప్పుకొచ్చారు.
తెలుగుదేశం పార్టీలో లోకేష్ కోటరీ ఏర్పాటు చేసుకుని కొంత మంది నేతలను మాత్రమే ప్రొత్సహించారన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఆ ప్రొత్సాహానికి నోచుకోని నేతలు.. ఇప్పుడు.. ఇతర పార్టీల్లో చేరి లోకేష్ టార్గెట్ చేస్తున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి..లోకేష్ విషయంలో.. ఇప్పటి వరకూ ఉన్న ఇమేజ్‌కు.. ఇప్పుడు ఆయన కేంద్రంగా జరుగుతున్న రాజకీయ ఇమేజ్‌కు చాలా తేడా ఉంది.