దిల్‌రాజు కాంపౌండ్‌లో ఓ మహత్మ్యం ఉంది. ఆయన ఆఫీసులో అడుగు పెట్టినవాళ్లంతా అక్కడే తిష్ట వేసుకుని కూర్చుండిపోతారు. ఒక్క హిట్టు పడితే… దిల్‌రాజు వాళ్లని వదలడు. హరీష్ శంకర్, వంశీపైపడిపల్లి, అనిల్‌రావిపూడిల పరిస్థితి అంతే కదా?? ఇప్పుడు సతీష్ వేగ్నేశ కూడా ఈ లిస్టులో చేరిపోయాడు. రచయిత నుంచి దర్శకుడిగా ఎదగడానికి సతీష్ చాలా కష్టాలే పడాల్సివచ్చింది. `శతమానం భవతి` కథని ఒప్పించడం, దిల్‌రాజు చుట్టూ తిరగడం.. ఓ ప్రహసనం. హీరోలు మారి, మారి.. చివరికి శర్వానంద్‌తో సెటిల్ అయ్యాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో సతీష్‌కి తిరుగులేకుండా పోయింది. వెను వెంటనే మరో సినిమా దిల్‌రాజు కాంపౌండ్లోనే ఫిక్స్ అయ్యింది. ‘శ్రీనివాస కల్యాణం’ ఎలాంటి ఆటంకాలు, ఎదురు చూపులు, పురుటినొప్పులు లేకుండా పూర్తయిపోయింది. విడుదలకు ముందే ఈ సినిమా పాజిటీవ్ టాక్ దక్కించుకుంది. దిల్‌రాజు బ్యానర్లో వచ్చిన టాప్ 5 సినిమాల్లో ఇదొకటిగా నిలుస్తుందని అంతా నమ్మకంగా చెబుతున్నారు. అందుకే ముచ్చటగా మూడో ఆఫర్ ఇచ్చేశాడు దిల్‌రాజు. సతీష్ దర్శకుడిగా మరో సినిమా కూడా ప్రారంభిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు. అది కూడా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనరేనట. చూద్దాం… సతీష్ ఇంకా ఎన్నాళ్లు ఆ కాంపౌండ్లోనే ఉంటాడో..?!