శతమానం భవతి అంటూ ఈ సంక్రాంతికి ఓ మధురమైన విజయం అందుకొన్నాడు సతీష్ వేగ్నేశ. సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలొచ్చినా కూడా… శతమానం భవతి తన స్థానాన్ని నిలబెట్టుకొందంటే, ఆ సినిమాల పక్కన నిలబడగలిగిందీ అంటే అదంతా కథ, కథనాల్లో ఉన్న బలమే. సున్నితమైన కథని భావోద్వేగ భరితంగా మలిచిన విధానం ఆకట్టుకొంది. తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈసినిమా దిల్ రాజుకి లాభాల పంట పండించింది. అందుకే తన బ్యానర్లో సతీష్‌కి మరో ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ టైటిల్ కూడా బయటకు వచ్చేసింది. అదే.. ‘శ్రీనివాస కల్యాణం’. శ్రీ వెడ్స్ నివాస్ అనేది ఉపశీర్షిక. ఇప్పుడు ఈ కథలో హీరో ఎవరన్న ప్రశ్న మొదలైంది.
నిజానికి ఈ స్టోరీ నాగచైతన్య కోసం సిద్ధం చేసుకొన్నాడట సతీష్. ఓ కీలకమైన పాత్రని ప్రకాష్‌రాజ్ చేత చేయిద్దామని డిసైడ్ అయ్యాడట. అయితే.. ప్రకాష్ రాజ్ మరీ రొటీన్ అయిపోతున్నాడని, ఆ పాత్ర నాగార్జున చేత చేయిస్తే సినిమాకి మైలేజీ వస్తుందని దిల్‌రాజు భావిస్తున్నాడు. అందుకే.. ఆమధ్య నాగార్జున – చైతూలతో, సతీష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా అంటూ ధైర్యంగా ప్రకటించాడు. ఆ వెంటనే నాగ్ ‘అలాంటిదేం లేదు’ అని చెప్పడంతో.. దిల్‌రాజుకి గట్టి షాక్ తగిలింది. ఇప్పుడు నాగ్ – చైతూల స్థాయికి తగిన ఇద్దరు నటుల కోసం దిల్ రాజు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. హీరో తండ్రిగానూ ఓ హీరో కనిపిస్తే తప్ప.. ఈ కథకు బలం ఉండదన్నది దిల్‌రాజు ఉద్దేశం. అందుకే..ఇద్దరు హీరోల్ని పట్టాలని గట్టి ప్రయత్నాలే మొదలెట్టాడు. మరి ఎవరికి ఈ కథ సెట్ అవుతుందో చూడాలి.