రచయితగా వచ్చి దర్శకుడిగా మారారు సతీష్ వేగేశ్న. `శతమానం భవతి`తో ఓ సూపర్ హిట్ కొట్టారు. ఆ తరవాత వచ్చిన `ఎంత మంచివాడవురా` అనుకున్న ఫలితం తీసుకురాలేదు. ఇప్పుడు మరో ప్రయత్నం చేస్తున్నారు. అదే `కోతి కొమ్మచ్చి`.
కోతి కొమ్మచ్చి అనగానే ముళ్లపూడి వారి జీవిత కథ గుర్తొస్తుంది. ఆ టైటిల్ తో హాయిగా నవ్వించారాయన. సరిగ్గా అదే మార్కు వినోదంతో… సతీష్ ఈ కథ రాసుకున్నారు. శ్రీహరి తనయుడు మేఘాంశ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. సతీష్ వేగేశ్నతనయుడు సమీర్ ఈ సినిమాతో కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. అంటే ఇది రెండు `కోతుల` కథన్నమాట. సతీష్ కి ఈ సినిమాతో పెద్ద బాధ్యతే పడింది. దర్శకుడిగా నిరూపించుకోవాలి, దాంతో పాటు తనయుడికీ మంచి మార్గం చూపించాలి. అన్నింటికంటే ముఖ్యంగా `కోతి కొమ్మచ్చి` అనే బ్రాండెడ్ టైటిల్ కి న్యాయం చేయాలి. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి.