గాడ్ ఫాదర్లో చిరుని ఢీకొట్టే పాత్రలో సత్యదేవ్ ఒదిగిపోయాడు. చిరు కళ్లల్లో కళ్లు పెట్టి నటించాడు. ఆ సీన్స్ అన్నీ బాగా పండాయి. అయితే… ఆ సన్నివేశాల్లో ధైర్యంగా ఎలా నటించాడో ఆ సీక్రెట్ కూడా చెప్పేశాడు సత్యదేవ్. తనకి ఐ సైట్ ఉంది. లెన్స్ వాడతాడు. చిరంజీవితో సీన్ అనగానే లెన్స్ తీసేసి యాక్ట్ చేసేవాడట. ఈ ట్రిక్కు బాగా వర్కవుట్ అయ్యింది.
అయితే ఇదే సినిమాలో పూరి జగన్నాథ్ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. చిరుతో ఓ మంచి సీన్ పడింది పూరికి. అందులో పూరి నటన కూడా బాగా పండింది. అయితే చిరుతో షూటింగ్ అనగానే పూరి కూడా సత్యదేవ్ లా షివర్ అయ్యాడట. అందుకే ఓ అర్థరాత్రి సత్యదేవ్‌కి ఫోన్ చేసి..”నువ్వు ఆల్రెడీ బాస్ తో యాక్ట్ చేశావ్ కదా… ఆయన ముందు ఎలా నటించాలో టిప్ చెప్పు” అని అడిగాడట. ”బాస్ తో నటించడం చాలా ఈజీ… ఆయన కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడకు.. సరిపోతుంది” అని సలహా ఇచ్చాడట సత్యదేవ్. మరుసటి రోజు పూరి సత్యదేవ్ కి ఫోన్ చేసి `ఇచ్చావ్ లే తొక్కలో సలహా.. నీకు సైట్ ఉంది.. నాకు లేదు..` అని ఫోన్ పెట్టేశాడట. ఇదంతా గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్లో సత్యదేవ్ చెప్పుకొచ్చిన విషయాలు. ఈ సినిమా కెమెరామెన్ నిరవ్ షా.. సత్యదేవ్‌కి ఓ సలహా ఇచ్చాడట. ”విలన్ గా బాగా నటించావు.. వంద కోట్లు సంపాదించాలని ఉంటే.. ఇలానే విలన్ పాత్రలే చేసుకుంటూ వెళ్లిపో” అన్నాడట. మరి… సత్యదేవ్ ఆ సలహా పాటిస్తాడో లేదో చూడాలి.