ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కొద్ది రోజుల్లో చీఫ్‌ను మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్‌కు హైకమాండ్ వద్ద పలుకుబడి ఉంది. ఆయన ఏపీ బీజేపీ చీఫ్ కావాలనుకుంటున్నారు. ఆయనకు ఓ వర్గం మద్దతు బలంగా ఉంది. అయితే సోము వీర్రాజు మాత్రం తానే చీఫ్ గా కొనసాగాలని కోరుకుంటున్నారు . ఆయనకు మరో వర్గం అండగా ఉంది. ముఖ్యంగా సునీల్ ధియోధర్ అండగా ఉంటున్నారు. ఆయన కో ఇంచార్జ్. అసలు ఇంచార్జ్ మురళీధరన్ .. రాష్ట్రం గురించి పట్టించుకునేది తక్కువే. అందుకే సునీల్ ధియోధర్.. చక్రం తిప్పుతూఉంటారు. ఆయన సోము వీర్రాజుకు సపోర్ట్ చేస్తూంటారు. ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని ధియోధర్ ప్రకటించేశారు.
కానీ జీవీఎల్, ధియోధర్, సోము వీర్రాజు ఓ గ్రూప్ అని వీరంతా పేరుకే బీజేపీ కానీ.. మొత్తంగా వైసీపీ కోసం పని చేస్తూంటారన్న వాదన బీజేపీలోని ఓ వర్గం చేస్తూ ఉంటుంది. వారికి ఇటీవలి కాలంలో సత్యకుమార్ రూపంలో నాయకుడు వచ్చారు. జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాల్లో బిజీగా ఉండే సత్యకుమార్ .. ఇటీవల రాష్ట్రంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన ఎక్కువగా రాష్ట్రంలోనే ఉంటూ చురుకుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారు. అందుకే ఆయనపై ప్రో టీడీపీ ముద్ర పడిపోయింది.
ఏపీ బీజేపీకి ఉండే మైనస్ ఏమిటంటే… వైసీపీ వ్యతిరేకిస్తే టీడీపీ సపోర్ట్ అంటారు… పాలనను సమర్థిస్తే వైసీపీ కోవర్ట్ అంటారు.. అంతే తప్ప.. తమ రాజకీయం కోసం తాము పోరాడుతున్నామని ఎవరూ అనుకోరు. అలా అనుకునేలా బీజేపీ కూడా ఇంత వరకూ రాజకీయం చేయలేకపోయింది. ఢిల్లీలో మారుతున్న రాజకీయ పరిణామాలతో… ఏపీలో బీజేపీ చీఫ్ మార్పు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అది ఎప్పటికి అనేది తేలాల్సి ఉంది.