ఇతర దేశాల్లో ఉపాధి కోసం పోవాలనుకునే భారతీయులకు చాలా దేశాలు నియంత్రణలు విధిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా నుంచి కెనడా వరకూ తమ దేశంలో ఉండటానికి రావాలంటే పెద్ద మొత్తంలో సంపాదించుకునే స్కిల్స్ ఉంటేనే రావాలని షరతులు పెడుతున్నాయి. తాజాగా అన్ స్కిల్డ్ లేబర్ ను ఎక్కువగా తమ దేశానికి ఆహ్వానించే సౌదీ అరేబియా కూడా నియంత్రణ విధిస్తోంది.
ఇండియన్లు ఎవరైనా సౌదీ అరేబియాలో ఉద్యోగం కోసం రావాలంటే ముందుగా విద్యార్హతలు, స్కిల్స్ సర్టిఫికెట్లు నిజమైనవో కావో సర్టిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ మేరకు సౌదీలోని భారత రాయబార కార్యాలయం కూడా సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఉపాధి కోసం ఇబ్బడిమబ్బడిగా వచ్చే వారిని నియంత్రించడానికే ఇలాంటి చర్యలను సౌదీ చేపట్టినట్లుగా భావిస్తున్నారు.
సౌదీలో అత్యధిక మంది భారతీయులు ఉపాధి పొందుతూంటారు. మొదట బంగ్లాదేశ్ కు చెందిన వారు ఎక్కువ మంది వివిధ పనుల్లో ఉండగా.. తర్వాత స్థానంలో భారతీయులు ఉన్నారు. ఇళ్లల్లో పనులు చేయాడనికి కూడా సౌదీకి భారత్ నుంచి పెద్ద ఎత్తున వెళ్తూంటారు. అక్కడ ఓవర్ ఫ్లో కారణంగానే సౌదీ ఇక నుంచి స్కిల్స్ టెస్టు చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.