గత రెండు నెలలుగా సౌదీ అరేబియా దేశం పేరు తరచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. డిల్లీలో సౌదీ దౌత్యవేత్త ఒకరు నెల తన ఇంట్లో పనిమనుషులుగా ఉన్న ఇద్దరు నేపాలీ మహిళలపై సుమారు నాలుగు నెలలుగా అత్యాచారం చేస్తూ వారిపై తన స్నేహితుల చేత కూడా అత్యాచారం చేయించినందుకు అతనిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. కానీ దౌత్యవేత్తగా తనకున్న రక్షణని అడ్డుపెట్టుకొని సౌదీ పారిపోయి శిక్ష నుండి తప్పించుకొన్నాడు. ఆ తరువాత సౌదీ యువరాజు మజేడ్ అబ్డులజీజ్ అల్-సౌద్ అమెరికాలో తన ఇంట్లో పనిచేస్తున్న మహిళపై అత్యాచార ప్రయత్నం చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేసారు. కానీ భారీ మొత్తం పూచికత్తుగా చెల్లించి బెయిలో పొందాడు. ఇంతలోనే మళ్ళీ మరో సంఘటన జరిగింది. ఈసారి రియాద్ కి చెందిన ఒక సౌదీ కుటుంబం ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న కస్తూరీ అనే భారతీయ మహిళ బలయింది.
ఆమె తన కుటుంబాన్ని పోషించుకొనేందుకు రెండు నెలల క్రితమే వారి ఇంట్లో పనిమనిషిగా చేరింది. కానీ చేరిన మొదటి రోజు నుండే ఆమెకు తిండి కూడా పెట్టకుండా యజమానులు హింసిస్తుండటంతో ఆమె ఒకరి సహకారంతో సౌదీ ప్రభుత్వానికి పిర్యాదు చేసింది. తక్షణమే స్పందించిన ప్రభుత్వం ఆమెను సరిగ్గా చూసుకోమని సదరు యజమానిని గట్టిగా హెచ్చరించింది. అందుకు ఆగ్రహించిన ఆ యజమాని ఆమె కుడి చేతిని నరికేసినట్లు సమాచారం. ప్రాణభయంతో వారి నుండి తప్పించుకొనే ప్రయత్నంలో ఆమె మూడవ అంతస్తు నుండి క్రిందకు దూకేసింది. దానితో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఆమెను రియాద్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ దేశాలకు వెళుతున్న భారతీయ మహిళలు చాలా మందికి ఇటువంటి అనుభవాలే ఎదురవుతుంటాయి. కానీ వాటిలో ఏ ఒక్కటో ఇలాగ వెలుగులోకి వస్తుంటుంది. కస్తూరి చెయ్యి నరికిన సౌదీ వ్యక్తి కూడా మహిళే కావడం విశేషం. ఆమె, తన మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి కస్తూరిని పట్టుకొని ఈ ఘాతుకానికి పాల్పడింది.