ఫంక్షన్ ఏమో నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాది… స్టేజి మీద డాన్స్ చేసింది మాత్రం మరో హీరో విజయ్ దేవరకొండ. అలాగని, అతను ఏమైనా సినిమాలో లేదా సాంగులో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడా? అంటే అదీ లేదు. ఫంక్షన్‌కి గెస్ట్‌గా వచ్చాడంతే! డ్యాన్సర్లు దగ్గరకు వచ్చి పిలవడంతో స్టేజి ఎక్కి రెండు స్టెప్పులు వేశాడు. దాంతో స్టేజి ముందు గ్యాలరీల్లో కూర్చున్న అక్కినేని అభిమానులు, ప్రేక్షకులతో పాటు టీవీల్లో లైవ్ చూస్తున్న ప్రేక్షకులు కూడా రెండు మూడు క్షణాలు ఆలోచించారు… ఇది నాగచైతన్య ‘సవ్యసాచి’ ఫంక్షనా? రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఫంక్షనా? అని! ఆ రేంజ్లో ‘సవ్యసాచి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో విజయ్ దేవరకొండ సందడి చేశాడు. హంగామా సృష్టించాడు.
సాధారణంగా కొంతమంది హీరోలు తమ సినిమా ఫంక్షన్స్‌లో డాన్స్ చేస్తుంటారు. దేవిశ్రీ ప్రసాద్ వంటి సంగీత దర్శకులు అయితే నిర్మాత దిల్‌రాజుతో కూడా డాన్స్ చేయిస్తారు. కానీ, ఇక్కడ నాగచైతన్య సినిమా ఫంక్షన్లో విజయ్ దేవరకొండ డాన్స్ చేశాడు. అదీ స్పెషల్! ఈ యాటిట్యూడ్‌కి మాధవన్ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. “నా లైఫ్‌లో ఎప్పడూ స్టేజిపై డాన్స్ చేయలేదు. నా సినిమాలకు చేయలేదు అంటే.. ఇతర హీరోల ఫంక్షన్స్‌లో అయితే అసలు చేయలేదు. విజయ్ దేవరకొండ చాలా స్పోర్టివ్” అని మాధవన్ ప్రశంసించాడు.
ఎప్పుడూ తన స్పీచ్‌తో ఆకట్టుకునే విజయ్ దేవరకొండ మరోసారి తన స్పీచ్‌తో ఆడియన్స్‌ని స్పెల్ బౌండ్ చేశాడు. ఒకసారి ఫ్లైట్‌లో ఫుడ్‌కి డబ్బులు లేకపోతే కీరవాణిగారు డబ్బులు ఇచ్చారని, డిగ్రీలో వున్నపుడు అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య యాక్టింగ్ వర్క్ షాప్ జరుగుతుంటే అక్కడికి వెళ్లి చూశానని విజయ్ దేవరకొండ చెప్పాడు. ఎందుకో తెలియదు కానీ, తనకు చైతన్య అంటే ఇష్టమని అన్నాడు. విజయ్ దేవరకొండ మాట్లాడుతున్నంత సేపూ.. అంతకు ముందు డాన్స్ చేసినప్పుడు.. ఆడిటోరియంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడూ.. ప్రేక్షకుల, అక్కినేని అభిమానుల రెస్పాన్స్ అదిరింది.
కొసమెరుపు: ‘సవ్యసాచి’ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ‘డియర్ కామ్రేడ్’ సినిమాను నిర్మిస్తుంది. దీని తరవాత వచ్చే యేడాది మైత్రీ సంస్థలో మరో చిత్రాన్ని చేయనున్నట్టు విజయ్ దేవరకొండ ‘సవ్యసాచి’ ఫంక్షన్లో ప్రకటించాడు.