ఆంధ్రప్రదేశ్‌లో రెండు అత్యున్నత అధికార వ్యవస్థలు అయిన పోలీసులు, అధికారుల చీఫ్‌ల మధ్య వృత్తిపరమైన వైరం వచ్చిపడింది. డీజీపీ సవాంగ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్‌కు ఓ ఘాటు లేఖ రాశారు. దానికి కారణంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న పదిహేను వేల మంది మహిళా పోలీసులను ఇతర అవసరాలకు వాడుకోవడం. గతంలో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి అందులో మహిళా పోలీసు పేరుతో కూడా ఉద్యోగ్యం కల్పించింది. ఇటీవల వారిని పోలీసు శాఖలో విలీనం చేశారు. వారందరికీ శిక్షణ ప్రారంభించారు. అలాగే యూనిఫాం కూడా పంపిణీ చేశారు. కానీ వారి విధులు మాత్రం పోలీస్ స్టేషన్లకు ఎటాచ్ కాలేదు.
గ్రామ సచివాలయం నుంచే పని చేయాలి. పేరుకే మహిళా పోలీసులు కానీ ఆ ఉద్యోగితో ఇతర ప్రభుత్వ శాఖలన్నీ పని చేయించుకంటున్నాయి. ఆ వార్డు లేదా గ్రామానికి సంబంధించి మహిళా సంబంధిత సమస్యలన్నింటినీ ఆ ఉద్యోగిపైనే పడుతున్నారు. చివరికి అంగన్వాడీ టీచర్ రాకపోతే ఆ బాధ్యతలు కూడా ఆమెకు అప్పచెప్పే పరిస్థితి ఏర్పడింది. మరో వైపు పోలీసు శాఖలో ఉద్యోగులుగా మారినందున వారి విధులకు సంబంధించి వివరాలు చెప్పాలని సమాచారం సేకరించాలన్న ఒత్తిడి వారి పోలీస్ స్టేషన్ల నుంచి వస్తోంది.
దీంతో వారు ఒత్తిడికి గురవుతున్నారు. ఈ విషయం సవాంగ్ దృష్టికి వెళ్లింది. పోలీసు శాఖ ఉద్యోగులతో ఇతర పనులు చేయించడం ఏమిటని ఆయన నేరుగా సీఎస్‌కు లేఖాస్త్రం సంధించారు. ఇక నుంచి వారు పోలీసు పనులు మాత్రమే చేస్తారని స్పష్టం చేశారు. ఈ లేఖ వ్యవహారం అధికార వర్గాల్లో కలకలం రేపింది. ఇది పూర్తిగా వృత్తిపరమైన లేఖేనని వారిద్దరి మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి తేడాలు లేవని అధికారవర్గాలు చెబుతున్నాయి.