ఆరు రోజుల్లో పరిషత్ ఎన్నికలు పూర్తి చేయాలని ఓ వైపు సీఎం జగన్ బహిరంగంగానే చెబుతున్నారు. మరో వైపు ప్రధాన కార్యదర్శి … తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. వివిధ శాఖలు ఎస్ఈసీ వద్దకు వచ్చి.. ఎన్నికలు నిర్వహించాలని కోరాయి. తాము ఎంత సంసిద్ధంగా ఉన్నాయో తెలియచేశాయి. అయితే ఏ క్షణమైనా ఎన్నికల ప్రకటన ఉంటుందని వైసీపీ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. కానీ నీలం సాహ్ని మాత్రం… అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూడాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన పార్టీ తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఈ పిటిషన్పై విచారణ జరుగుతోంది.
గత విచారణ సమయంలో రెండు వారాలకు వాయిదా వేశారు. తదుపరి విచారణలో హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూసి.. దాని ప్రకారం… ముందుకెళ్లాలని ఎస్ఈసీ సాహ్ని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కోర్టు కేసులు ఉన్నందున.. నిర్ణయం ప్రకటించకుండా నోటిఫికేషన్ ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఆమె అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం.. ఇప్పటికిప్పుడు ఎన్నికల ప్రకటన చేయాలన్న పట్టుదలను ప్రదర్శిస్తోంది. నిజానికి ఏకగ్రీవాల విషయంలో గతంలో నిమ్మగడ్డ ఇచ్చిన ఫిర్యాదును హైకోర్టు తోసి పుచ్చింది. ఏకగ్రీవాలు ఓకే చేసింది. అయితే.. మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలన్న పిటిషన్పై మాత్రం విచారణ పూర్తి చేయలేదు. అదే అడ్డంకిగా మారింది.
సీఎం జగన్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కూడా ఎన్నికల గురించే మాట్లాడారు. పరిషత్ ఎన్నికలు పూర్తయితే.. ఆటంకం లేకుండా వ్యాక్సినేషన్ వేయవచ్చని చెప్పుకొచ్చారు. సీఎం ఆతృత కారణంగా ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతోనే ప్రభుత్వ యంత్రాగం ఉంది. అయితే సాహ్ని మాత్రం.. కోర్టు చెప్పినట్లుగా చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో జనసేన పిటిషన్ తదుపరి విచారణ వచ్చే వరకూ… హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందనే దానిపై తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.