తిరుమల తిరుపతి దేవస్థానం కార్యవర్గం కాలపరిమితిని మరొక ఏడాది పెంచాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దానిలో సభ్యుడిగా నియమించబడిన తెదేపా ఎమ్మెల్యే సాయన్న సభ్యత్వాన్ని రద్దు చేశారు. తెలంగాణాకు చెందిన ఆయన కొన్ని నెలల క్రితమే తెరాసలో చేరారు. అదీగాక ఆయన టి.టి.దే. బోర్డులో సభ్యత్వం స్వీకరించినప్పటి నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా కార్యవర్గ సమావేశానికి హాజరు కాకపోవడం కూడా ఆయన సభ్యత్వం రద్దు చేయడానికి ఒక కారణం. సాయన్న స్థానంలో మళ్ళీ తెలంగాణాకే చెందిన తెదేపా నేతనే సభ్యుడిగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మాజీ తెదేపా ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన 19 మంది సభ్యులతో టి.టి.దే. కార్యవర్గాన్ని గత ఏడాది మే 2న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేటితో దాని పదవీ కాలం పూర్తవుతుంది కనుక దాని కాలపరిమితిని మరొక ఏడాదిపాటు పెంచాలని నిర్ణయించింది.